వృక్షాలతో.. సూపర్ కెపాసిటర్లు!
ఉత్పత్తి చేసుకున్నప్పుడు వాడుకోవాల్సిందేగానీ.. రేపటి కోసం దాచుకోవడమనేది విద్యుత్తు విషయంలో సాధ్యంకాదు. బ్యాటరీల్లో దాచుకోగలిగేదీ తక్కువే. అయితే ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక విజయం సాధించారు. వృక్షాల్లో ఉండే సెల్యులోజ్‌తో సూపర్‌కెపాసిటర్లు తయారుచేయవచ్చని వారు నిరూపించారు. సూపర్ కెపాసిటర్లు అధికమొత్తంలో విద్యుత్తును నిల్వ చేసుకునేందుకు పనికొస్తాయి. వీటిని యంత్రాలు నడిపేందుకు అవసరమైన విద్యుత్తు నిల్వకు, వాహనాల్లో బ్రేకులేయడం ద్వారా వృథా అయ్యే శక్తిని తిరిగి వాడుకునేందుకూ ఉపయోగించొచ్చు.
కానీ సూపర్‌కెపాసిటర్ల తయారీకి అవసరమైన నాణ్యమైన కార్బన్ ఎలక్ట్రోడ్లను ఉత్పత్తి చేయడం బాగా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా ఉంది. అయితే సెల్యులోజ్‌ను అమ్మోనియా సమక్షంలో వేడిచేస్తే.. అది అత్యంత పలుచనైన నానో కార్బన్ పొరలుగా మారుతుందని ఒరెగాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నానో కార్బన్ పొరలు ఎంత పలుచగా ఉంటాయంటే.. ఒక్క గ్రాము పొరలనే 2 వేల చదరపు మీటర్ల స్థలంపై పరిచేయొచ్చట! ఈ పద్ధతిలో నానో కార్బన్ పొరలను తయారు చేయడం చాలా సులభం, చవక, పర్యావరణ అనుకూలమే కాదు.. పని కూడా వేగంగా అయిపోతుందట.