ప్రపంచవ్యాప్తంగా గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించాలని దాదాపు అన్నిదేశాలు చాలా సదస్సుల్లో ఏకవాక్కు చేస్తున్నాయి. కానీ ఆ విషవాయువును తగ్గించడంలో చర్చలపై చూపుతున్న శ్రద్ధ.. ఆశించిన మేర చర్యలపై చూపడంలేదనేది అన్ని దేశాలకు మింగుడుపడని సత్యం. ఈ నేపథ్యంలో కార్బన్‌డయాక్సైడ్‌ను తగ్గించడానికి జరుగుతున్న చర్యలతోపాటు వాతావరణం నుంచి దాన్ని వెలికి తీయడానికి ఇంజినీర్లు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ విషవాయువును సైతం వినియోగించుకునే విధంగా వివిధ పద్ధతులను కనుగొనాలని ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ముందడుగు వేశారు. కార్బన్ డయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చే సమర్థ విధానాన్ని కనుగొన్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను ద్రవ లేదా ఘన పదార్థం రూపంలోకి మారుస్తుంది. దీన్ని హైడ్రోజన్ లేదా మెథనాల్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. ఫ్యూయెల్ కణాలకు శక్తిని అందించటానికి, విద్యుత్తు ఉత్పత్తికి వాడుకోవచ్చు. ప్రయోగశాల స్థాయిలోనే దీన్ని సాధించినప్పటికీ పెద్దఎత్తున అమలు చేయొచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇళ్లకు ఉద్గార రహిత విద్యుత్తు, వేడిని అందించొచ్చని ఆశిస్తున్నారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను 90% వరకు ఇంధనంగా మారుస్తుండటం గమనార్హం.
ఇదీ చదవండి: ఉచితంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండిలా..!
ఈ ప్రక్రియలో ముందుగా కార్బన్ డయాక్సైడ్‌ను మాధ్యమిక రూపంలోకి.. అంటే ద్రవ లోహ బైకార్బోనేట్‌గా మారుస్తారు. అనంతరం అణు, వాయు, సౌర విద్యుత్తు వంటి స్వల్ప కర్బన విద్యుత్తుతో పనిచేసే ఎలక్ట్రోలైజర్‌లో విద్యుత్‌రసాయన పద్ధతిలో ద్రవ పొటాషియం లేదా సోడియం ఫార్మేట్‌గా మారుస్తారు. దీన్ని ఎండబెట్టి ఘన పొడిగా చేస్తారు. దాంతో ఇది స్థిరంగా ఉంటుంది. చాలాకాలం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని ఇళ్ల నుంచి పరిశ్రమల అవసరాల వరకూ ఇంధనంగా వాడుకోవచ్చని ఇంజినీర్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment