ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడు పోతున్న విద్యుత్ కార్లు (టెస్లా) మొదలు అంత ర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు, సరుకులను పంపే రాకెట్ల (స్పేస్–ఎక్స్) వరకూ తనదైన ముద్రవేయడం ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ సొంతం. అసాధ్యం అని ఎవరైనా చెబితే దాన్ని సుసాధ్యం చేసే వరకూ అతడికి నిద్ర పట్టదంటే అతిశయోక్తి కాదు. మనిషి కేవలం భూమికే పరిమితం కారాదని.. అంగారకుడితో మొదలుపెట్టి వీలైనన్ని గ్రహాలకు విస్తరించాలన్న ఆలోచనలూ అతడివే.
అందుకేనేమో ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక ‘టైమ్’ 2021కిగాను మస్క్‌ను ఈ ఏటి మేటిగా ప్రకటించింది. ఈ సందర్భంగా మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. భూతాపోన్నతి ద్వారా వస్తున్న వాతావరణ మార్పులకు ప్రధాన కారణమైన కార్బన్ డయాక్సైడ్‌నే తాను రాకెట్ల ఇంధనంగా మార్చుకొని మనుషులను అంగారకుడిపైకి చేరుస్తానన్నది ఆ ట్వీట్ సారాంశం. ఆసక్తి ఉన్నవారు తనతో చేతులు కలపాలని, యుద్ధప్రాతిపదికన ఈ కార్యక్రమం చేపడుతున్నామని తరువాతి ట్వీట్లలో మస్క్ పేర్కొన్నాడు. మరి చెప్పాడంటే.. చేస్తాడంతే టైపు మస్క్ ఈ సవాలనూ జయించగలడా?
కొత్త పనా?
నిజానికి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా కంపెనీలు రకరకాల పద్ధతులను ఉపయోగించి ఈ పని చేస్తున్నాయి. ఇంధనం మాత్రమే కాదు.. ఈ విషవాయువును వోడ్కా వంటి మద్యంలా మార్చేందుకు, శరీరానికి అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకూ కొన్ని కంపెనీలు పరిశోధించి విజయం సాధించాయి. ఇంకొందరు వాతా వరణంలోంచి కార్బన్‌డయాక్సైడ్‌ను వేరు చేసి అత్యధిక పీడనానికి గురి చేయడం ద్వారా సూక్ష్మస్థాయి కృత్రిమ వజ్రాలను తయారు చేయ గలిగారు.
కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్వెల్వ్’... రెండు వినూత్న ఎలక్ట్రొలైజర్ల సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను సింథటిక్ గ్యాస్ లేదా కృత్రిమ గ్యాస్‌గా మార్చేందుకు ఒక టెక్నా లజీని తయారు చేసింది. ఇందులో సిన్‌గ్యాస్‌తో పాటు హైడ్రోజన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ రెండింటి సాయంతో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
అయితే ఈ రకమైన కంపెనీలు ఎన్ని ఉన్నా అవి ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌లో ఓ 10 శాతం మాత్రం తగ్గించగలవు. అంగారక యాత్రకు అవసరమైనంత ఇంధనం మాట ఎలా ఉన్నా.. భారీ ఎత్తున సీవో2ను ఇంధనంగా మార్చగల టెక్నాలజీ అందు బాటులోకి వస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. మస్క్ అనుకున్నది నిజమైతే మాత్రం అద్భుతం జరిగినట్లే!
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment