కార్బన్ డయాక్సైడ్‌తో ఇంధనం!
సూర్యకాంతిని ఉపయోగించి వాతావరణంలోని కార్బన్ డైయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చేందుకు లారెన్స్ బెర్క్‌లీ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు ఓ వినూత్న మార్గాన్ని ఆవిష్కరించారు. ఇది మొక్కల కంటే మెరుగ్గా ఉండటం విశేషం. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకుంటాయన్నది తెలిసిందే. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ను ఇంధనంగా మార్చేందుకు ఇప్పటికే ఎన్నో ఇతర పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవన్నీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నవే. లారెన్స్ బెర్క్‌లీ శాస్త్రవేత్తలు ఈ సమస్యను అధిగమించారు.
కార్బన్ డయాక్సైడ్‌ను వాయుస్థితి నుంచి ద్రవ స్థితికి మార్చేందుకు, ఆ తర్వాత దాన్ని ఇథనాల్, ఇథిలీన్ వంటి ఇంధనాలుగా మార్చేందుకు ప్రత్యేక పదార్థాలు, పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే అతితక్కువ ఇంధనాన్ని ఖర్చుపెట్టి కార్బన్ డయాక్సైడ్‌ను వేర్వేరు కర్బన పరమాణువులుగా మార్చేందుకు ఓ ప్రత్యేకమైన ఉత్ప్రేరకాన్ని సిద్ధం చేశారు. రాగి–వెండితో కూడా నానోకోరల్ క్యాథోడ్, ఇరీడియం ఆక్సైడ్ నానోట్యూబ్ ఆనోడ్‌తో మొక్కల కంటే సమర్థంగా ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలిగారు. సౌరశక్తితోనే వాతావరణంలోని విషవాయువును తగ్గించేందుకు తమ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని బెర్క్‌లీ శాస్త్రవేత్త గురుదయాళ్ తెలిపారు.