
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అమేధితో పాటు కేరళలోని వయనాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తారని ప్రకటించడంపై సీపీఎం స్పందించింది. వయనాద్‌లో ఎల్‌డీఎఫ్‌కు వ్యతిరేకంగా రాహుల్ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఎల్‌డీఎఫ్ అభ్యర్థిపై రాహుల్ పోటీచేయాలన్న నిర్ణయంతో ఎలాంటి సంకేతాలు పంపదలుచుకున్నారో చెప్పాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోరారు.
కేరళకు వచ్చి ఎల్‌డీఎఫ్‌పై పోటీకి దిగుతూ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని నిలదీశారు. ఏ స్ధానం నుంచి ఏ అభ్యర్ధి పోటీ చేయాలనేది ఆయా పార్టీలు నిర్ణయించుకుంటాయని, అయితే రాహుల్ నిర్ణయంతో ఏం సంకేతాలు పంపాలనుకుంటున్నారో ప్రజలకు వెల్లడించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలనే లక్ష్యంతో తమ పార్టీ పనిచేస్తోందని, కీలకమైన ఈ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ అభ్యర్ధితో తలపడాలన్న రాహుల్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు.