యూపీ ప్రజలకు యోగి తొలి వరం!
లక్నో: ఎన్నికల హామీలో భాగంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ ఆ రాష్ట్ర రైతులకు పెద్ద మొత్తంలో ఊరటను కల్పించబోతున్నారు. రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసే నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా అధికార బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి తొలిసారి మంగళవారం సాయంత్రం నిర్వహించిన కేబినెట్ భేటీలో రూ.లక్ష వరకు రైతుల రుణమాఫీకి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 2.5కోట్లమంది చిన్న, సన్నకారు రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా లబ్ధి పొందనున్నారు.
అత్యంత సన్నిహిత వర్గాల సమాచారం మేరకు యోగి ప్రభుత్వం దాదాపు రూ.36వేల కోట్లను రైతుల రుణమాఫీ కోసం వెచ్చించనుంది. దీంతోపాటు యూపీలో అక్రమంగా నడుపుతున్న కబేళాలను నిషేధించేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే, ఘాజిపూర్‌లో ఓ స్టేడియాన్ని నిర్మించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే గత ఆదివారం బుందేల్‌ఖండ్ ప్రాంతానికి రూ.47కోట్లను ఉన్నపలంగా కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.