ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి | Ysrcp demands to accomplish the AP special status | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి

Published Wed, May 13 2015 4:59 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి - Sakshi

ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి

కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్‌సీపీ
పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన

 
 సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంటులో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి ఏపీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని, తక్షణం ప్రకటించాలని పార్టీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి నినదించారు. అనంతరం లోక్‌సభలోనూ ఆందోళన కొనసాగించారు. వాయిదా తీర్మానంపై తామిచ్చిన నోటీసుకనుగుణంగా సభాకార్యక్రమాలను వాయిదా వేసి ప్రత్యేకహోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే మేకపాటి ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేశారు. ఇదేసమయంలో అమేథీ మెగా ఫుడ్ పార్క్‌పై కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ చేసిన ప్రకటనను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ రెండుసార్లు వాయిదాపడింది. తిరిగి 12 గంటలకు జీరోఅవర్‌ను ప్రారంభించిన స్పీకర్.. మేకపాటి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు.
 
 మీరు పదేళ్లన్నారు..
 మేకపాటి ఈ అంశంపై మాట్లాడుతూ.. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు ప్రకటించడమేగాక ప్రత్యేకహోదా పదేళ్లపాటు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాము అధికారంలోకొస్తే ప్రత్యేకహోదా పదేళ్లు కొనసాగిస్తామని చెప్పారని, కానీ రాష్ట్రం విడిపోయి ఏడాదవుతున్నా ఇవ్వలేకపోయారని  విమర్శించారు. ఏపీ  ప్రజలు ప్రత్యేకహోదా కోసం ఎదురుచూస్తున్నారని, దాంతోనే  రాష్ట్రం అభివృద్ధికి నోచుకోగలుగుతుందని, లేదంటే ప్రస్తుతమున్న ఆర్థిక చిక్కుల్లో నుంచి రాష్ట్రం బయటపడే పరిస్థితి లేదన్నారు. అందువల్ల ఇచ్చిన మాటకు కట్టుబడి పదేళ్లపాటు ప్రత్యేకహోదా వర్తించేలా కేంద్రం ప్రకటన చేయాలనికోరారు. అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మేకపాటి మాట్లాడుతూ.. ప్రత్యేకహోదాపై తమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. ప్రత్యేకహోదా ఇప్పించడంలో టీడీపీదే ప్రధాన బాధ్యతన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నందున టీడీపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలని, లేనిపక్షంలో ప్రజలు క్షమించరని అన్నారు. ఇదిలా ఉండగా ఇదే అంశంపై లోక్‌సభలో టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ‘మేకపాటి లేవనెత్తినట్టుగానే ఈ అంశం ఏడాదిగా నలిగిపోతోంది. మేం కేంద్రం నుంచి ఏ సాయం పొందబోతున్నామో స్పష్టత కావాలి. ఎప్పుడు పొందుతామో? ఎలా పొందుతామో స్పష్టత కావాలి’ అని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement