
చికాగో: తెలంగాణ పర్యాటక శాఖ, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో చికాగో మహానగర తెలుగు సంస్థ(టీఏజీసీ) దసరా, బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రజల జీవన విధానం, సంస్కృతిని అద్దం పట్టేలా, కులమతాలకు అతీతంగా, ప్రాంతీయ విభేదాలు లేకుండా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని గుర్తించేలా, ఘనంగా బతుకమ్మ వేడుకలను చికాగోలో టీఏజీసీ నిర్వహించింది. ఈ నెల 24న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం, పంచవటి కళాప్రాంగణములో సుమారు వెయ్యికి పైగా అతిథులతో బతుకమ్మ, దసరా వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. గత పదిహేనేళ్ల నుంచి టీఏజీసీ కార్యవర్గం, జాతీయ సంస్థల సహకారంతో దసరా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. గత ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టీఏజీసీ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన సంప్రదాయ గుర్తింపు తెచ్చేందుకు టీఏజీసీ అధ్యక్షురాలు జ్యోతి చింతలపాణి, మహిళా బోర్డు డైరెక్టర్లు విశేష కృషి చేశారు. 125 మంది మహిళలు పోచంపల్లి ప్రత్యేక చీరలు ధరించి టీఏజీసీ బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక వన్నెను తెచ్చారు. టీఏజీసీ అలంకరణ కమిటీ చైర్ శ్వేతా జనమంచి నాయకత్వంలో వాలంటీర్ల సహాయముతో పంచవటి కళాప్రాంగణాన్ని మరియు బతుకమ్మలను పెట్టే ప్రాంతాన్ని రంగుల రంగుల పూలతో అలంకరించారు. టీఏజీసీ బతుకమ్మ తయారుచేయడానికి న్యూ జెర్సీ నుండి పూలను తెప్పించి ఆదివారంనాడు సాంప్రదాయ పద్దతిలో అమర్చారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు దేవాలయములో పార్వతి దేవికి పసుపు, కుంకం, ముక్కు పుడక మరియు పుష్పాలను సమర్పించారు. టీఏజీసీ బతుకమ్మ కమిటీ చైర్ మమతా లంకాల మరియు టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే అతిథులను స్వాగతిస్తూ పండుగా విశిష్టతను వివరించారు.
పలు సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యక్ష సాంప్రదాయ సన్నాయి, సంగీత వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళి టీఏజీసీ పురుషు వాలంటీర్ల సహాయంతో ఆలయ ప్రాంగణ కొలనులో నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రా రెడ్డి ఏడే బహుమతులు అందజేశారు. టీఏజీసీ ఫుడ్ కమిటీ చైర్మెన్ అవదూత నాయకత్వంలో తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన ఆహార పదార్థాలను అమ్మకానికి ఉంచారు. వాటిద్వారా వచ్చిన డబ్బును వరుస హారికేన్లతో సతమతమైన వరదబాధితుల సహాయర్థం ఉపయోగించనున్నారు.
బతుకమ్మలను సాగనంపిన తరువాత, అన్ని కుటుంబాలు టీఏజీసీ నిర్వహించే జమ్మి పూజలో పాల్గొన్నారు, బాలాజీ ఆలయ పూజారి హనుమాన్ ప్రసాద్ పూజ అనంతరము భక్తులందరికి పూజలో కంకణాలను కట్టి జమ్మి ఆకులు, అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. అన్ని కుటుంబాలు జమ్మీని పంచుకోవడం మరియు పెద్దల నుండి అతిథిలు నుండి దీవెనను తీసుకున్నారు. టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రా రెడ్డి ఏడే మాట్లాడుతూ, రాబోయే కాలానికి మన సంస్కృతిని కాపాడుకోవటానికి ఈ పండుగ వేడుకలు ఎంతోగానో ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా ఈ వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికీ, సంస్థ కార్యవర్గ సభ్యులకు, స్వచ్చంద సేవలను అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిత్వశాఖ, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బృందం, ఎస్‌వీఎస్ బాలాజీ ఆలయం నిర్వహణ కమిటీ, దాతలు, మీడియాకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.