డల్లాస్: జాతిపిత మహాత్మా గాంధీ 148వ జయంతి వేడుకలను మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్( ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) ఆధ్వర్యంలో ఆదివారం డల్లాస్ నగరంలో ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన ‘గాంధీ పీస్ వాక్’లో వందలాది మంది ప్రజలు పాల్లొన్నారు. శాంతికి నిదర్శనంగా పిల్లలు, పెద్దలందరూ తెల్లని దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇర్వింగ్ నగర మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్, హుస్టన్ నగరం నుంచి కాన్సుల్ ఆఫ్ ఇండియా ఆర్.డి జోషిలు హాజరయ్యారు.
ఇర్వింగ్ నగర్ మేయర్ ప్రొటెం ఆలన్ మేఘర్ మాట్లాడుతూ.. ప్రత్యేక అతిధిగా వచ్చి, గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు గర్వంగా ఉందన్నారు. చాలా ఏళ్లుగా సిటీ గవర్నమెంట్ తో కలిసి పని చేస్తూ, ఇలాంటి కమ్యూనిటీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ బోర్డు సభ్యులను ఆయన అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటికి తమ పూర్తి మద్దతు, సహాయం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ చైర్మన్ డాక్టర్. ప్రసాద్ తోటకూర, డైరెక్టర్ శ్రీమతి, సెక్రటరీ రావుకల్వల, ఐ.ఏ ఎన్.టి అధ్యక్షుడు సల్మాన్ ఫర్షోరి, ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ బోర్డు సభ్యులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.