కార్మికుడిగా వెళ్లి ఇంటర్నేషనల్‌ కంపెనీ మేనేజర్‌గా.. | Ravi Gulf Success Special Story | Sakshi
Sakshi News home page

పట్టుదలతో సాధించాడు

Published Fri, Sep 6 2019 8:21 AM | Last Updated on Fri, Sep 6 2019 8:36 AM

Ravi Gulf Success Special Story - Sakshi

రవి వుట్నూరి

గల్ఫ్‌ డెస్క్‌: జీవనోపాధి కోసం దుబాయిలో సాధారణ కార్మికునిగా అడుగు పెట్టి తన ప్రతిభతో ఉన్నత ఉద్యోగం పొందాడు. స్వయంకృషి పట్టుదలతో ఉన్నత జీవనానికి బాటలు వేసుకున్నాడు. దుబాయిలో కార్మికునిగా నెలకు 600 ధరమ్స్‌ వేతనం పొందిన ఆయన.. ప్రస్తుతం 16వేల ధరమ్స్‌ సంపాదించే స్థాయికి ఎదిగాడు జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాల వాసి రవి వుట్నూరి.తనకు ఎదురైన కష్టాలను.. వాటిని అధిగమించినతీరును ‘సాక్షి’తో మాట్లాడుతూ వివరించాడు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
మా నాన్న నర్సయ్య సౌదీ అరేబియాలో క్లీనింగ్‌ కార్మికునిగా పనిచేసేవారు. ఆయన సంపాదన ఇల్లు గడవడానికే సరిపోయేది. నేను పదో తరగతి అయిపోగానే ఐటీఐ పూర్తిచేశాను. ఏదైనా కంప్యూటర్‌ కోర్సు నేర్చుకుంటే గల్ఫ్‌ దేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించవచ్చని కొందరు మిత్రులు సూచించడంతో కంప్యూటర్‌ ఇనిస్టిట్యూలో శిక్షణ పొందాను. గల్ఫ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని 2000 సంవత్సరంలో దుబాయిలో అరబ్‌ టెక్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పని కోసం వీసా పొందాను. నేను ఐటీఐ, కంప్యూటర్‌ కోర్సు చదవడం వల్ల ఆఫీస్‌ బాయ్‌గా ఉద్యోగం లభిస్తుందని ఆశించాను. కానీ, కన్‌స్ట్రక్షన్‌ కార్మికునిగానే వీసా వచ్చింది. దుబాయికి రావడానికి చేసిన అప్పును తీర్చడం కోసం గత్యంతరం లేక కార్మికునిగా పని చేశాను. కార్మికునిగా ఆరు నెలల పాటు పనిచేసిన నేను మంచి పదోన్నతి పొందాలని ఆశించా. అప్పట్లో మా కంపెనీలో కార్మికుల హాజరును మాన్యువల్‌గా తీసుకునేవారు. అందుకు టైం కీపర్‌గా పనిచేసే వ్యక్తికి వేతనం వచ్చేది.

అయితే, ఆ సమయంలో కంపెనీలో కంప్యూటరీకరణ జరిగింది. సాధారణ పద్ధతిలో కాకుండా కంప్యూటర్‌లో హాజరు నమోదు చేయడం మొదలైంది. టైం కీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి కంప్యూటర్‌పై అవగాహన లేదు. దీంతో నాకు కంప్యూటర్‌ వినియోగంపై అవగాహన ఉందని కంపెనీలోని సూపర్‌వైజర్లకు వివరించాను. కంప్యూటర్‌లో హాజరు నమోదు చేసే పని కొన్ని రోజుల పాటు చేస్తూ టైం కీపర్‌కు నేనే శిక్షణ ఇచ్చా. దీంతో నా పని విధానాన్ని మెచ్చి మెటీరియల్‌ అసిస్టెంట్‌ స్టోర్‌ కీపర్‌గా పదోన్నతి కల్పించారు. ఆ ఉద్యోగం కూడా నాకు తృప్తినివ్వలేదు. మంచి ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ‘మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ దుబాయి’ అందిస్తున్న లాజిస్టిక్‌ అండ్‌ సప్‌లై చైన్‌ మేనేజ్‌మెంట్‌(ఎల్‌ఏఎస్‌సీఎం) కోర్సులో చేరా. దూర విద్యా విధానంలో దుబాయి విద్యాశాఖ ఈ కోర్సును అందించింది. ప్రతి శుక్రవారం తరగతులకు హాజరవుతూ 2001 డిసెంబర్‌ నుంచి 2002 జనవరిలోగా కోర్సును పూర్తిచేశా. అలాగే ఇంగ్లిష్, అరబిక్‌ భాషల్లో ప్రావీణ్యం సంపాదించా. ఎల్‌ఏఎస్‌సీఎం కోర్సు సర్టిఫికెట్‌ చేతికి రాగానే దుబాయిలోని మన భారతీయుల కంపెనీలో స్టోర్‌ కీపర్‌గా  ఉద్యోగం దక్కించుకున్నా. అరబ్‌ టెక్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో 1,900 ధరమ్స్‌ వేతనం పొందిన నేను.. షాపుర్జీ పాలోన్జీ కంపెనీలోకి 3,500 ధరమ్స్‌ వేతనంపై వెళ్లాను.

ముంబైలో ఎంబీఏ...
ఒక వైపు దుబాయిలో ఉద్యోగం చేస్తూనే ముంబై కేంద్రంగా దూర విద్యలో ఎంబీఏ అందించే ఇనిస్టిట్యూట్‌లో చేరాను. ఎంబీఏ పూర్తి కాగానే దుబాయి కేంద్రంగా కాంట్రాక్టులను నిర్వహిస్తున్న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కాంట్రాక్టింగ్‌ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించాను. 2009లో నన్ను ఒమాన్‌లో నిర్వహిస్తున్న ప్రాజెక్టుకు యాజమాన్యం బదిలీ చేసింది. కొంతకాలం  అక్కడ విధులు నిర్వహించిన నేను మళ్లీ దుబాయికి బదిలీపై వచ్చా.

స్వచ్ఛంద సేవలోనూ..  
జగిత్యాలలో ప్రముఖ పిల్లల వైద్యుడు ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిం చారు. ఆ వైద్యుడి ప్రేరణతో ఎల్లాల శ్రీనివాస్‌రెడ్డి సేవా సమితిని ఏర్పాటు చేశాం. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 130మంది సభ్యులుగా ఉన్నారు. అందరం కలిసి పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం. అలాగే దుబాయిలో కష్టాల్లో ఉన్న కార్మికులకు అన్ని విధాలుగా సహాయపడుతున్నాం. విదేశాంగ శాఖ కార్యాలయంలో న్యాయ సహాయంతో పాటు స్వదేశానికి వెళ్లడానికి చేతిలో డబ్బు లేని వారికి టిక్కెట్‌లు కొని ఇవ్వడం ఇతరత్రా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం.

ఆస్ట్రేలియా కంపెనీలో ఉన్నత ఉద్యోగం
2015లో ఆస్ట్రేలియాకు చెందిన మెరిహిజ్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో ప్రొక్యూమెంట్, ఆపరేషన్స్‌ మేనేజర్‌గా ఎంపికయ్యా. ఈ కంపెనీలో ప్రస్తుతం నెలకు 16వేల ధరమ్స్‌ వేతనం అందుతుంది. మన కరెన్సీలో దాదాపు రూ.3లక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement