
అసలైన అర్హులకే సత్కారాలు
సందర్భం
ప్రత్యేక రాష్ట్రం కోసం విభిన్న రంగాల్లో కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా సత్కరిస్తోంది. కానీ అర్హులైన వారికే ఈ సత్కా రాలు అందేలా ప్రభుత్వం ఒక స్థిర యంత్రాంగాన్ని ఏర్పర్చాల్సి ఉంది.
తెలంగాణ అవతరణ ఉత్సవాలు జూన్ 2 నుంచి ప్రారంభం కాను న్నాయి. 2014 జూన్ 2నతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా జరిగిన తొలి ఉత్సవాలు ఒక ఉద్వేగభరిత స్వాతం త్య్రోద్యమ స్ఫూర్తితో సాగాయి. 2015 జూన్ 2 నాటి తెలంగాణ అవతరణ వారోత్సవాలను గ్రామ, మండల, రెవెన్యూ, జిల్లా రాష్ట్ర స్థాయిల్లో ఎక్కడికక్కడ నిర్వహించారు. ఎందరో కళాకారులు, రచయితలు, విభిన్న రంగాలలో కృషి చేసినవారిని సత్కరించి తెలంగాణ ప్రభుత్వం తనను తాను గౌరవించుకున్నది.
వివిధ ప్రభుత్వ శాఖల తరపున మహనీయుల జయంతి, వర్ధంతుల నిర్వహణతో పాటు, వందలాది మందిని సత్కరించి, పురస్కారాలు అందజేసింది. తొలిదశలో హడావుడి తప్పలేదు కానీ, ఇకనుంచి నిజంగా అర్హులైన వారిని గుర్తించి సత్కరించుకోవడానికి ఒక సమగ్ర దృష్ట్టితో స్థిరమైన యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం అవసరం.
1) ముఖ్యంగా 1969 నాటి జై తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇంకా జీవించి ఉన్న ఉద్యమకారులను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. వారి త్యాగాలను వెలకట్టలేము. నగదు పురస్కారాలు ముఖ్యం కాదు. వారి త్యాగాలకు, కృషికి సమాజంలో తగు గుర్తింపు ఇచ్చే విధంగా సత్కరిస్తే చాలు. 2016 జూన్ 2 నాటి తెలంగాణ అవతరణ ఉత్సవాలతోనే ఈ కార్యక్రమాలు ముగించకుండా, ఆగస్టు 15 వరకు వెలికివచ్చే వివరాలను బట్టి.. వారిని గౌరవించుకునే సభలు, సదస్సులు ఏర్పాటు చేయాలి.
2) తెలంగాణ ఉద్యమంలో కళాకారులు, జర్నలిస్టులు, పాటల కవులు, సామాజిక కార్యకర్తలు, ఉద్యమ కారులు, విద్యావంతులు, అడ్వొకేట్లు, రచయితల పాత్ర ఎనలేనిది. ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు తదితర అనేక రంగాల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నెలల తరబడి రిలే నిరాహార దీక్షా శిబిరాలను నిర్వహించిన నిర్వాహకులు మొదలైన వారందరినీ తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. పలు త్యాగాలు చేస్తూ, ఉద్యమాలు చేసిన అనేక రంగాల విద్యా ర్థులను, మహిళలను, యువతరాన్ని ప్రత్యేకంగా గౌరవించాలి. అలా పలు రంగాల్లో కృషి చేసినవారిని సత్కరించుకోవడం అంటే మనని మనం సత్కరించుకోవడమే.
3) రెండేళ్లు గడుస్తున్నాయి. ఈసారి గత రెండేళ్లుగా సత్కారాలకు, పురస్కారాలకు వెలుపలే ఉండి పోయిన వివిధ రంగాల కృషీవలురను, ఉద్యమ త్యాగశీలురను సత్కరించుకోవడం, గౌరవించుకోవడం అందరి కర్తవ్యం. ప్రభుత్వ అధినేత కేసీఆర్ ఆహ్వానం కోసం వేలాది మంది నిరీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రికి వందల, వేలమందితో ప్రత్యక్ష, పరోక్ష పరిచయమే ఉంది. వారి వారి కృషిని గుర్తించి, సముచిత సత్కా రాలను, పురస్కారాలను అందజేయడం సముచితంగా ఉంటుంది.
4) ఉత్తమ రచయితలకు, కళాకారులకు, వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున నగదు పురస్కారం, ఆ తర్వాత 5 లక్షలు, 3 లక్షలు, లక్ష రూపాయలకు తగ్గకుండా జిల్లా స్థాయి పురస్కారాలు ఇవ్వడం ద్వారా దేశానికి, రచయితలకు, కళాకారులకు, వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి గొప్ప సందేశం చేరుతుంది. ఇతర రాష్ట్రాల్లోని సుప్రని ద్ధులను కూడా ఇలా సత్కారాల్లో చేర్చడం అవసరం.
5) వివిధ ప్రక్రియలు, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో 20 సాహిత్య కళా ప్రక్రియలకు, రచనలకు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు చొప్పున మూడు పురస్కారాలు... 60 మందికి ఇవ్వడం సముచితంగా ఉంటుంది. అలాగే జిల్లా స్థాయిలో 2 లక్షలు, లక్ష, 50వేల చొప్పున 60 మందికి పురస్కారాలు యివ్వడం ద్వారా తెలం గాణలో సాహిత్యం, కళలు, నాటి అణచివేత పరిమితులను, వివక్షను, వెలివేతను అధిగమించి ఇతోధికంగా అభివృద్ధి చెందుతాయి. సీనియర్ రచయితలకు, కళాకారులకు, రూ. 10 లక్షల చొప్పున ఇచ్చే అన్ని పుర స్కారాలకు అయ్యే వ్యయం మొత్తం రూ. 20 లేదా 25 కోట్లకు మించి ఉండదు.
6) బంగారు తెలంగాణ సాధనలో అందరి కృషీ అవసరం. అందుకు అందరికీ ప్రోత్సాహకాలు కూడా అవసరం. నూతన రాష్ట్రం కోసం పోరులో భాగంగా డీఎస్పీ ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలో చేరిన నళిని తిరిగి ఉద్యోగాన్ని ఆశిస్తున్నదని తెలుస్తున్నది. అలాగే శ్రీకాంతాచారిలా ఆత్మ బలిదానాలు చేసుకున్న వారి తల్లులు, కుటుంబీకులు ప్రభుత్వ ఆసరా కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కూడా సముచితంగా గౌరవించుకోవాల్సి ఉంది. హుస్సేన్‌సాగర్ సమీపంలోని సంజీవయ్య పార్కులో నెలకొల్పుతున్న తెలం గాణ అమరవీరుల స్థూపం శంకుస్థాపన నుంచి దాని ఆవిష్కరణ వరకు అందరి వివరాలు సేకరించి ఏదో ఒక రూపంలో సత్కరించుకోవాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వేలాదిమంది కేసుల పాలయ్యారు. చిత్రహింసలబారిన పడ్డారు. ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇలాంటి వారందరినీ పేరుపేరునా గౌరవించుకోలేకపోవచ్చు. అయితే, 1969 జై తెలంగాణ ఉద్యమకారులతో పాటు, సాహిత్య, సామాజిక, కళ, విద్య, వైద్య తదితర సమస్త రంగాల వారిని వీలైన మేరకు గుర్తించి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సర్టిఫికెట్‌తోపాటు సత్కరించడం, గౌరవించడం ద్వారా తెలంగాణ తన చరిత్రను తాను గౌరవించుకున్నట్టవుతుంది.
- బి.ఎస్. రాములు
వ్యాసకర్త సామాజిక తత్వవేత్త మొబైల్ : 8331966987