మన బొల్లారం పికాసోకు వందేళ్లు | Bollaram Picasso gets Hundred years | Sakshi
Sakshi News home page

మన బొల్లారం పికాసోకు వందేళ్లు

Published Sat, Jan 18 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

మన బొల్లారం పికాసోకు వందేళ్లు

మన బొల్లారం పికాసోకు వందేళ్లు

1947లో ప్రోగ్రెసివ్ ఆరిస్ట్స్ గ్రూప్ ఏర్పడింది. అరా, మక్బూల్ ఫిదా హుసేన్, ఫ్రాన్సిన్ న్యూటన్ సుజా, హరి అంబాదాస్‌గా డే వ్యవస్థాపకులు. వీళ్లకు అక్బర్ పదంసీ, మనీశ్ డే వంటివాళ్లు జతయ్యారు.  అరా స్వయంకృషితో రంగురేఖలపై పట్టుసాధించాడు. బొమ్మలకే పరిమితం కాకుండా ఉప్పు సత్యాగ్రహంలో, శాసనోల్లంఘనలో పాల్గొన్నాడు. అరెస్టయి ఐదు నెలలు జైల్లో గడిపాడు.
 
 ‘కృష్ణాజీ హవాలాజీ అరా’.. అపరిచితుడి పేరులా ఉంది కదూ! కాని మన పక్కింట్లో పుట్టినవాడు. మనతో ఆడి పాడి కరకు కాలప్రవాహంలో కొట్టుకుపోయినవాడు. ఏళ్లూపూళ్ల తర్వాత అనుకోని రకంగా తారసపడేనాటికి లోకమంతా తెలిసినవాడు. అతనిది చరిత్ర కేన్వాసుపై చెరగని సంతకం. అవును. అతడు మన బొల్లారం పికాసో.  రోళ్లుపగిలే ఎండలో ఎర్రకుండీలో సుఖదుఃఖాలతో అల్లాడే తంగెడు పూలకొమ్మలు, వాటి వెనక నీలాకాశంలో ఆవిరవుతున్న మసక చందమామ, నిశిరాతిరి ఎనభై క్యాండీల దీపపు గదిలో బట్టలువిప్పి కూర్చున్న అతివ ఒంటిపై దాగుడుమూతలాడే వింత వెలుగుచీకట్లు.. పదాలకందని ఇలాంటి చరాచర సంవేదనలకు అరా ఉద్రిక్తంగా, మొరటుగా చిత్రికపట్టి ప్రపంచం చేత భేష్ అనిపించుకున్నాడు. ఈ ప్రశంసకు మూలమెక్కడ? అతనికి జన్మతోపాటు బోలెడు కష్టాలు ప్రసాదించిన సికింద్రాబాద్ బొల్లారం గడ్డ.. అతన్ని చేరదీసి కళాపాఠాలు నేర్పిన బాంబే వీధులు..!
 
 కేహెచ్ అరా వందేళ్ల కిందట
 1913లోనో, 14లోనో బొల్లారంలో బస్సు డ్రైవర్ కొడుగ్గా పుట్టాడు. మూడేళ్లనాడే తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతితల్లి సతాయింపులకు తాళలేక ఏడేళ్ల కుర్రాడు బాంబే పారిపోయాడు. కార్లు తుడిచాడు. దుమ్ముపట్టిన చిట్టిచేతుల్తో బొమ్మలేశాడు. తర్వాత ఓ తెల్లదొర ఇంట్లో పనిమనిషిగా చేరాడు. బొమ్మలపై పిల్లాడి ఆసక్తి గమనించిన టైమ్స్ ఆఫ్ ఇండియా కళావిమర్మకుడు రూడీవాన్ లీడెన్, ఆర్ట్ టీచర్ వాల్టర్ ల్యాంగ్‌హామర్‌లు చేయూతనిచ్చారు.   
 
 అరా స్వయంకృషితో రంగురేఖలపై పట్టుసాధించాడు. బొమ్మలకే పరిమితం కాకుండా ఉప్పు సత్యాగ్రహంలో, శాసనోల్లంఘనలో పాల్గొన్నాడు. అరెస్టయి ఐదు నెలలు జైల్లో గడిపాడు. బయటికొచ్చాక కొన్నాళ్లు ఓ జపాన్ కంపెనీలో కారు క్లీనర్ కొలువు సంపాదించాడు. 1942లో తొలి సోలో ఎగ్జిబిషన్‌తోనే దమ్మున్న చిత్రకారుడనిపించుకున్నాడు. మనిషి పిట్టలా ఉన్నా చూపు మాత్రం గద్దచూపన్నారు. 1947లో తెల్లదొరలు దేశాన్ని నల్లదొరలకిచ్చిపోయారు. దేశంతోపాటు కళాకారుల్లోనూ అలజడి. భారతీయ కళాపునరుజ్జీవనంటూ బెంగాల్ కళాకారులు తెచ్చిన శైలిపై బాంబే కళాకారులు తిరగబడ్డారు.
 
 వస్తుశిల్పాల్లో నవరూపాల, నవభావాల అంతర్జాతీయ కళాశైలి కావాలన్నారు. అలా 1947లో ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ ఏర్పడింది. అరా, మక్బూల్ ఫిదా హుసేన్, ఫ్రాన్సిన్ న్యూటన్ సుజా, హరి అంబాదాస్‌గా డే, సదానంద్ కృష్ణాజీ బాక్రే, సయ్యద్ హైదర్ రజా వ్యవస్థాపకులు. వీళ్లకు అక్బర్ పదంసీ, మనీశ్ డే వంటివాళ్లు జతయ్యారు. ప్రజలకు, కళాకారులకు మధ్య దూరాన్ని చెరిపేయాలని సంకల్పం చెప్పుకున్నారు. పేరుకే గ్రూప్ గానీ ఎవరి దారి వాళ్లదే. మనవైన బతుకు ముచ్చట్లను పాశ్చాత్య పోస్ట్-ఇంప్రెషనిజం రంగుల్లో, క్యూబిస్టు రూపాల్లో, ఎక్స్‌ప్రెషనిజం ధోరణుల్లో కళ్లు, గుండెలు చెదిరేలా బొమ్మకట్టారు. ఐదేళ్లయినా గడవకముందే తలొక దారి పోయారు. కొందరు విదేశాలకు, కొందరు కనుమరుగుకు. వయసులో అందరికంటే పెద్దవాడైన అరా ఒక్కడే ‘గ్రూప్’గా మిగిలిపోయాడు.
 
 అరా తొలినాళ్లలో ల్యాండ్‌స్కేపులు, సమకాలీన, చారిత్రక ఇతివృత్తాల బొమ్మలు వేశాడు. బిచ్చగాళ్లను, వేశ్యలను, జూదర్లను, పిచ్చివాళ్లను కేన్వాసులపైకి ఎక్కించాడు. తర్వాత స్టిల్ లైఫులకు, న్యూడ్లకు మళ్లాడు. స్త్రీ నగ్నత్వాన్ని కవిత్వంలా రంగులకెత్తిన తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడు అరా. అందంగా, లావుగా, నల్లగా, పసిమిగా, ఎర్రగా, చామనచాయగా ఉండే ఆడాళ్లను వాళ్ల ఆంతరంగిక ఆవరణల్లో లలాసభరితంగా సృజించి పోస్ట్-ఇంప్రెషనిస్టులైన డెగా, గాగిన్‌లను, ‘రోజ్ పిరియడ్’ పికాసోను తలపించాడు. అరా స్టిల్ లైఫుల్లోనూ కొత్త పోకడలు పోయాడు. ముదురురంగులకు బదులు కాంతిమంతమైన నీలి, ఎరుపు, గులాబీ, ఆకుపచ్చ, పసుప్పచ్చలతో ఇంద్రజాలం చేశాడు. అతని పూలు, పళ్లు, మట్టికుండలు, కూజాలు, జగ్గులు, గిన్నెలు మానవానుభూతుల ప్రతీకలు. అరా స్టిల్ లైఫు పాటల్లో సజాన్, మతీస్‌ల శ్రుతిలయలు లీలగా ధ్వనించినా బాణీలు మాత్రం సొంతానివే. యూరప్ దేశాల్లో ప్రదర్శనలిచ్చిన అరా అక్కడి కళాదిగ్గజాల ప్రభావానికి లోనయ్యాడు. అయితే అతని కళ మేధాశ్రీతం కాదు, హృదయాశ్రీతం. అతడు honest expression of form కోసం పరితపించాడు. అరా పెళ్లి చేసుకోలేదు. స్నేహితుడైన హైదర్ పఠాన్ కూతురు రుక్సానాను దత్తత తీసుకున్నాడు. బొమ్మలకొచ్చిన అరకొర డబ్బును పేద కళాకారులకిచ్చి ఆదుకున్నాడు. కళలో వారికి మెలకువలు నేర్పి ప్రోత్సహించాడు. 1985లో హైదర్ ఇంట్లోనే కన్నుమూశాడు. అతని వస్తుసామగ్రిని నిర్లక్ష్యంగా పడేశారు. లోకానికి తెలియని అతని బతుకు సంగతులు కాలగర్భంలో కలసిపోయాయి.
 
 అరా సృజనలో యథార్థం పాళ్లు తక్కువని, టెక్నిక్‌లో తోటి  కళాకారుల్లా విప్లవం తేలేకపోయాడని విమర్శలున్నాయి. అయితే అతడెప్పుడూ వాస్తవాన్ని విడిచి సాము చేయలేదు. అరా చిత్రాలు వాటిలోని ఇతివృత్తాల్లాగే చవకైనవి. వేలంలో కొన్ని లక్షలకే దొరుకుతున్నాయి. చరిత్ర గ్రేట్ మాస్టర్లదే కాదు, వాళ్లు రూపొందిన క్రమానిది, వాళ్ల సమకాలీనులది కూడా. చెట్టు మీది పూలు అందంగా ఉంటాయి. ఆకుల చాటు పూలు మరింత అందంగా, స్వచ్ఛంగా ఉంటాయి!
 - పి.మోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement