గతంలో రూ. వెయ్యి.. ఇప్పుడు 19.19 కోట్లు!
ఇది ఐదు దశాబ్దాల కిందటి మాట. ప్రముఖ చిత్రకారుడు అక్బర్ పదంసీ కుంచె నుంచి జాలువారిన 'గ్రీకు ల్యాండ్‌స్కేప్' కళాఖండానికి అప్పట్లో వెయ్యి రూపాయల ధర పలికింది. ఇప్పుడు అదే చిత్రరాజం ఏకంగా రూ. 19.19 కోట్లకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. మన దేశంలో కళలపై నానాటికీ పెరిగిపోతున్న ఆసక్తికి ఇది అద్దం పడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
1960లో 20వ పడిలో ఉన్న అక్బర్ పదంసీ 4.3x12 కాన్వాస్‌పై ఈ దృశ్య కళాఖండాన్ని చిత్రించారు. దీనిని ఆయన మిత్రుడు, స్నేహితుడు అయిన క్రిషేన్ ఖన్నా 1960లో రూ. వెయ్యికి కొనుగోలు చేశారు. దీనిని పర్సనల్ కలెక్షన్‌గా ఇన్నాళ్లు తనతో ఉంచుకున్న ఆయన ఇటీవల ఢిల్లీలో వేలానికి పెట్టారు. గుర్తుతెలియని ఓ ఔత్సాహికుడు ఈ పెయింటింగ్‌ను ఏకంగా రూ. 19.19 కోట్లకు వేలంలో కొనుగోలు చేశారు. దేశంలో సమకాలీన చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన అక్బర్ పదంసీ పెయింటింగ్‌లలో అత్యధిక ధర పలికిన కళాఖండం ఇదే. తన స్నేహితుడైన పదంసీ పెయింటింగ్‌కు ఇంత ధర పలుకడం తనకు ఆనందంగా ఉందని, పదంసీ చిత్రించిన కళాఖండాల్లో ఇది ఉత్తమమైనదని 92 ఏళ్ల ఖన్నా ఆనందం వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లలో ఈ చిత్రరాజాన్ని తాను చూడలేదని, తాను 22, 23 ఏళ్ల వయస్సులో దీనిని చిత్రించానని 89 ఏళ్ల పదంసీ చెప్పారు.