
చాసో స్ఫూర్తికి...
ఇది ఒక విధంగా ఒక తండ్రి మీద ఒక కూతురి ప్రేమకు నిదర్శనం; మరొకవిధంగా తనకు ఇష్టమైన కథకుడికి అంతకంటే ఇష్టంగా సాహిత్య నివాళి అర్పించుకోవడం! చాగంటి సోమయాజి కథల్లోని మాండలిక పదాలు, ద్విరుక్త పదాలు (ఉదా: చివ చివ, టపక టపక, పడ పడ), జంట పదాలు (ఉదా: అవ్వాకులు చెవ్వాకులు, నడ్డీమూతీ, లొడ్డూ లొస్కు), సంగీత పదాలు, అలంకారాలు, పలుకుబడులు, సూక్తులు అన్నీ ఒక పుస్తకంగా కూర్చారు చాగంటి తులసి. వాటికి తగిన అర్థాలూ, అవసరమైన వివరణలూ ఇచ్చారు. కీలకమైన మాండలిక పదాల విభాగం అక్షర క్రమంలో ఇలా సాగుతుంది: అడ్డకి పడ్డ= పడి అంటే రెండు అడ్డలు- అడ్డకి పడ్డ అనగా ఒక అడ్డకి రెండు అడ్డలు ఇవ్వడం- అంటే రూపాయికి రూపాయి లాభం; ఒట్టుకెళ్లు=పట్టుకెళ్లు; బొట్టి= కూతురు, చిన్నపిల్ల; మదుం= పెద్ద మురికి కాలువ; సకేశ=జుత్తున్న విధవరాలు.
‘విజయనగరం ప్రాంతపు భాషా సౌందర్యం తెలుగుజాతి అంతటికీ చెందిన సంపద. ఇక్కడి పలుకుబడి సొగసుని మిగిలిన ప్రాంతాలకు తెలియచేసి సాంస్కృతిక సమైక్య చైతన్యాన్ని ఆహ్వానించే ఉద్దేశ్యంతో ఈ సాంస్కృతిక పదకోశం రూపొందించడం జరిగింది’ అన్నారామె.
ఇక, చాసో శతజయంతి(1915-2015) సందర్భంగా, చాసో మీద పలువురి అభిప్రాయ మాలికగా వెలువడిన మరో పుస్తకం ‘చాసో స్ఫూర్తి’. ఆరుద్ర, కేతు విశ్వనాథరెడ్డి, పాపినేని శివశంకర్, మృణాళిని, ఆర్వీయార్, కాత్యాయిని విద్మహే, కొలకలూరి ఇనాక్, మధురాంతకం నరేంద్ర, గొల్లపూడి, తుమ్మల రామకృష్ణ, ఎండ్లూరి సుధాకర్, దేవరాజు మహారాజు, సుమనస్పతి, గుడిపాటి, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వంటి 25 మంది 1995-2013 మధ్యకాలంలో చేసిన ప్రసంగాలివన్నీ.
‘‘చాసో కథలు ఒక పోయమ్‌లాగా సజెస్టివ్‌గా ఉంటాయి తప్ప వాచ్యం కావు; ఓపెన్‌కావు ఎక్కువగా,’’ అంటూ ‘కుక్కుటేశ్వరం’ కథను ఉదాహరిస్తారు కె.శివారెడ్డి. చాసో ‘వెర్బల్ స్టయిల్’నీ, కథలకు పేర్లు పెట్టే తీరునీ విశ్లేషిస్తారు ఇ.బి.పద్మావతి. ‘‘జీవితంలో విషాదం కవికైనా కథారచయితకైనా మూలాధారం. విషాదంలోనే జీవస్పందన, జనం నాడి లోలోపల కొట్టుకుంటాయి’’ అని తనకు చాసో చెప్పిన మాటల్ని స్మరించుకుంటారు ఎం.రామకోటి.
- శేషసాయి
1. చాసో కథలు - సాంస్కృతిక పదకోశం
కూర్పు: డాక్టర్ చాగంటి తులసి; పేజీలు: 102; వెల: 80
2.చాసో స్ఫూర్తి
(1995-2013; ప్రముఖుల ప్రసంగాల సంకలనం)
సంపాదకుడు: డాక్టర్ రామసూరి
పేజీలు: 208; వెల: 150; ప్రతులకు: చాగంటి తులసి, పాల్‌నగర్, 3వ వీధి, విజయనగరం
ఫోన్: 08922-274787
కేవలం ఉపరితల పరిశీలనే!
ప్రముఖ నటులు, రచయిత గొల్లపూడి మారుతిరావు రాసిన ‘ఆచార్య ఆత్రేయ ఒక పరిశీలన’లో (క్రియేటివ్ లింక్స్ ప్రచురణ) నాకు కన్పించిన నలుసులు కొన్ని:
‘మారాజులొచ్చారు’ పాట రచన దాశరథి(పుట 71) అన్నారు. కాదు సి.నారాయణరెడ్డి. అదే పుటలో కృష్ణశాస్త్రి ‘కొమ్మలగాలులు రుసరుసమనినా’ అని రాశారు. తప్పు, అక్కడ కొమ్మల గాలులు ఉసురుసురన్నాయి.
తర్వాతి పుటలో ‘శ్రీవేంకటేశ్వర వైభవం’ చిత్రానికి పి.పుల్లయ్య దర్శకుడన్నారు. పుల్లయ్య తీసింది ‘శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం’. ‘శ్రీవేంకటేశ్వర వైభవం’ నిజానికి సినిమా కాదు. 1971లో తి.తి.దే. ఎం.చంద్రమౌళిరెడ్డి కార్యనిర్వహణాధికారిగా పి.డి.ప్రసాద్ రూపొందించిన డాక్యుమెంటరీ!
మారుతిరావు చాలా చోట్ల కన్నదాసన్ అనే రాశారు. కణ్ణదాసన్ అని రాయాలి. ‘స్వయంసిద్ధ’ నవలా రచయిత శరత్‌చంద్ర(పుట 85) అన్నారు. కాదు, మణిక్‌లాల్ బందోపాధ్యాయ. కానీ పి.పుల్లయ్య అనుసరించింది మద్దిపట్ల సూరి అనువాదాన్నే. ఇది స్పష్టపరిచి ఉంటే బాగుండేది. అర్ధాంగి సంగీత దర్శకుడు బి.నరసింగరావు కాదు, భీమవరపు నరసింహారావు. మారుతిరావు ప్రస్తావించిన పేరు సంగీత దర్శకునిది కాదు, దర్శకునిది!
నలుగురు కలసి పాట (పుట 95) ఆత్రేయది కాదు, శ్రీశ్రీది. ‘తోడికోడళ్లు’ వచ్చింది 1957లో, 1955లో కాదు. ‘శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం’ ఆడే థియేటర్ల ముందు పెట్టిన హుండీల్లో పడే కానుకలు తిరుమలకు మించి పోయాయని చెప్పడం కేవలం అతిశయోక్తి, రచయిత కలం చాపల్యం. ఈ చిత్రం విడుదలైంది 1960లో, 1961లో కాదు.
‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత బావాజీ కథను ఆత్రేయ చేర్చారన్నారు. ఆ కథను చేర్చింది దువ్వూరి రామిరెడ్డి, 1939లో వచ్చిన ‘తిరుపతి వేంకటేశ్వర మహాత్మ్యం’లో. గుమ్మడి రెండేసార్లు విలన్ వేషాలు వేశాడన్నారు. ఏది నిజం, పిచ్చి పుల్లయ్య, నమ్మినబంటు, శాంత, వీరకంకణం, రాజమకుటం ఇలా ఎన్నో! అంతెందుకు, ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’లో గుమ్మడిది విలన్ వేషమే!
ఠి డాక్టర్ కంపల్లె రవిచంద్రన్
ఫోన్: 9848720478
నవ్యాంధ్రదర్శిని
‘గోదావరి మహాపుష్కరాలు-2015’ ప్రత్యేక సంచికగా వెలువడిన ఈ 999 రూపాయల కాఫీ టేబుల్ బుక్ భారీగా కనబడే ఏపీ క్విక్ గైడ్ లాంటిది. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం, 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ క్లుప్త పరిచయం, ఆయా జిల్లాల్లోని దర్శనీయ స్థలాల గురించి ఇందులో చకచకా వివరించారు. ‘తూర్పు గోదావరి యాత్ర’ పేరుతో ఇదివరకు ఘనమైన పుస్తకాన్ని వెలువరించిన సబ్బెళ్ళ శివన్నారాయణరెడ్డి ఈ ‘అమరావతి’ని కూడా దానికి దీటుగా తీసుకొచ్చారు. ఆకర్షణీయమైన ఫొటోలు, నాణ్యమైన కాగితం, పద్ధతైన ఫొటో డిస్‌ప్లే ఈ పుస్తకం అసలు విలువ! శ్రీనివాస్ కొయ్యానతో పాటు వివిధ జిల్లాల ఫొటోగ్రాఫర్లు ఫొటోలు అందించారు. లే అవుట్: బద్దేరాజా శ్రీనివాసు. ముద్రణ: ప్రగతి ప్రింటర్స్. 190 పేజీల ఈ పుస్తకం ఇంగ్లీషులోనూ వెలువడింది. ఏ భాష కాపీకైనా ‘శ్రీ వినాయక పబ్లికేషన్స్, కాకినాడ, ఫోన్: 9849611888’లో సంప్రదించవచ్చు; అదే నంబరులో సంపాదకుడినీ పలకరించవచ్చు.
సరళంగా మాండూక్యోపనిషద్
దశోపనిషత్తులలో శిఖర భాగాన నిలిచే మాండూక్యోపనిషద్ పైన లోగడ పలువురు సాధువులు, సత్పురుషులు చేసిన వ్యాఖ్యానాలు ఇతర భాషల్లో ఉండటమూ, పైగా ఆధ్యాత్మిక రంగంలో ఒక స్థాయికి చేరుకున్నవారికే పరిమితమవటమూ చూసిన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి, మాండూక్య అద్వైత స్వరూపాన్ని సరళమైన తెలుగులో వ్యాఖ్యానించారు. ముముక్షువుల ముక్తికి మాండూక్యమొక్కటే చాలంటూ 215 కారికల ద్వారా గౌడపాదాచార్యులు అనుగ్రహించిన ఉపనిషద్ స్వరూపాన్ని వివరించారు. వీటిని చాగంటి ప్రకాశరావు సంకలించారు. రెండు భాగాలుగా ఉన్న ఈ 1,226 పేజీల గ్రంథరాజం వెల రూ.1,200. ప్రతుల కోసం 0891-2763332 నంబరులోగానీ, విశాఖ శ్రీ శారదాపీఠం, చిన ముషిడివాడ, పెందుర్తి-530051లోగానీ సంప్రదించవచ్చు.
కొత్త పుస్తకాలు
మలుపులు (కథలు); రచన: అంబల్ల జనార్దన్
పేజీలు: 206; వెల: 200
ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయతో పాటు, అంబల్ల సువర్ణ, బి/204, ధీరజ్ కిరణ్, సెకండ్ ఫ్లోర్, చించోలి బందర్ రోడ్, మాలాద్ (వెస్ట్) ముంబై-400064; ఫోన్: 09987533225
1. స్త్రీపర్వం (నవల); పేజీలు: 146; వెల: 120
2. స్త్రీకారం (కథానికలు); పేజీలు: 166; వెల: 140
రచన: సింహప్రసాద్
ప్రతులకు: శ్రీశ్రీ ప్రచురణలు, 401, మయూరి ఎస్టేట్స్, ఎంఐజీ-2-650, కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్-85; ఫోన్: 9849061668
వాస్తు శాస్త్ర కథలు; రచన: మంత్రాల సీతారామశర్మ
పేజీలు: 216; వెల: 150; ప్రతులకు: రచయిత, ఫ్లాట్ నం. 43, జింకలబావి కాలనీ, డాక్టర్స్ కాలనీ, సరూర్ నగర్, హైదరాబాద్-35. ఫోన్: 040-24030677
శ్రీవాల్మీకి రామాయణము (తెలుగు వచనము)
రచన: యం.వి.నరసింహారెడ్డి
పేజీలు: 376; వెల: 400; ప్రతులకు: సాహిత్య నికేతన్, 3-4-852, కేశవ నిలయం, బర్కత్‌పుర, హైదరాబాద్-27; ఫోన్: 040-27563236
కాలక్షేపం కథలు; రచన: మేడా మస్తాన్ రెడ్డి
పేజీలు: 164; వెల: 100; ప్రతులకు: 201, సత్యం ఎన్‌క్లేవ్, లక్ష్మీనగర్, విశాఖపట్నం. ఫోన్: 9441344365
బొగ్గు బతుకు; రచన: పి.కృష్ణారెడ్డి
పేజీలు: 180; రచయిత ఫోన్: 9949488526
ఇంటెన్సిటీ డ్రయివ్ వల్లే రచన!
( ఎందుకు రాస్తారు?)
‘కథక చక్రవర్తి డా.కేశవరెడ్డి’ పేరిట ఒక చిరునివాళి పొత్తాన్ని కూర్చారు సాకం నాగరాజ. ప్రచురణ: తెలుగు భాషోద్యమ సమితి, తిరుపతి. కేశవరెడ్డి రచనల్లోని ఆసక్తికర ఘట్టాలతోపాటు, కేశవరెడ్డి పుస్తకాలకు పలువురు రాసిన ముందుమాటలు, ఆ పుస్తకాలపై వచ్చిన వివిధ సమీక్షలు కూడా ఇందులో ఉన్నాయి. అందులో సుప్రభాతం(20 జూన్-3 జూలై, 1996) పత్రికకుగానూ కాసుల ప్రతాపరెడ్డి చేసిన ఇంటర్వ్యూలో అసలు తాను ఎందుకు రాస్తున్నానో ఇలా వివరించారు కేశవరెడ్డి (1946- 2015):
- డాక్టర్ కేశవరెడ్డి
‘‘అసలు మీరు దేనికోసం రచనలు చేస్తున్నారు?’’
‘‘నన్ను నేను అభివ్యక్తి పర్చుకోవడానికి. నాలో ఓ శూన్యం ఉంది. ఏకాంతం ఉంది. దాన్ని భర్తీ చేసుకోవడానికి ఏదో చేయాలనిపిస్తుంది. దీన్ని సైకాలజీలో ‘‘ఇంటెన్సిటీ డ్రయివ్’’ అంటారు. దానివల్లనే నేను రచనలు చేశాను. మరో మాటలో చెప్పాలంటే ఇంటెన్సిటీ డ్రయివ్‌ను తృప్తిపర్చుకోవడానికే నా రచనా వ్యాసంగమంతా!’’
కొన్ని అందమైన రంగురంగుల వాక్యాలు
ఒక వర్షం కురుస్తున్న రోజు
మిత్రుడొకడు చాలా కాలం తర్వాత ఇంటికొచ్చాడు
కుశల ప్రశ్నలయ్యాక
కూడా తెచ్చుకున్న మూట విప్పాడు
అందులో చిన్నవీ పెద్దవీ బోలెడు అక్షరాలున్నాయి
అత్యంత జాగ్రత్తగా కొన్ని అక్షరాలను ఏరి
అక్షరాలను పదాలుగా పదాలను రంగురంగుల వాక్యాలుగా
చాలా అందంగా తయారు చేశాడు
మా ఆవిడ ఇచ్చిన టీ త్రాగి
కిటికీలోంచి బయటకు చూశాడు
వర్షం వెలిసిందని నిర్ధారించుకున్నాక
వాక్యాలను భుజం మీద వేలాడేసుకుని
మిగిలిన అక్షరాలను మూటకెత్తుకుని వీడ్కోలు తీసుకున్నాడు
ఇందాక గమనించలేదు కానీ
కొన్ని వాక్యాలను మా ఇంట్లోనే వదిలి వెళ్లినట్టున్నాడు
చూద్దును కదా
రంగురంగుల అందమైన వాక్యాలను
మా ఆవిడ చీపురుతో చెత్తబుట్టకెత్తుతోంది
- మద్దికుంట లక్ష్మణ్; ఫోన్: 9441677373
వట్టికోట కథల పోటీ
వట్టికోట ఆళ్వార్‌స్వామి శతజయంతిని (1915-2015) పురస్కరించుకొని మంజీరా రచయితల సంఘం తెలంగాణ రాష్ట్రస్థాయి కథల పోటీ నిర్వహిస్తోంది. ఎంపికైన కథకు 10,000 నగదు బహుమతి ఇవ్వనున్నారు. కథను ఈ అవార్డు కోసమే రాయాలనీ, మూడు ప్రతులు పంపాలనీ, ఆగస్టు 31 కథ చేరడానికి చివరితేదీ అని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. చిరునామా: వేముగంటి రఘునందన్, 1-4-72, రామాలయం, పారుపల్లి వీధి, సిద్దిపేట-502103; ఫోన్: 9676598465
పి.రామకృష్ణ రచనల ఆవిష్కరణ
పి.రామకృష్ణ సాహితీ సర్వస్వం ‘పి.రామకృష్ణ రచనలు’ ఆవిష్కరణ సభ నేడు ఉదయం 9:30కి కడప సి.పి.బ్రౌన్ గ్రంథాలయంలో జరగనుంది. మల్లెమాల వేణుగోపాల రెడ్డి అధ్యక్షులు, ఆవిష్కర్త. సింగమనేని నారాయణ, పి.సంజీవమ్మ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, పాలగిరి విశ్వప్రసాదరెడ్డి ప్రసంగిస్తారు. నిర్వహణ ‘పెన్నేటి పబ్లికేషన్స్’ నూకా రాంప్రసాద్ రెడ్డి (ఫోన్: 7075351872).
చేరా ప్రథమ వర్ధంతి సభ
చేకూరి రామారావు ప్రథమ వర్ధంతి సభ, జూలై 26న మధ్యాహ్నం 2కు ఉస్మానియా యూనివర్సిటీ, మెకాస్టర్ ఆడిటోరియం(అడిక్‌మెట్ రోడ్)లో జరగనుంది. ఓల్గా, కాత్యాయని విద్మహే, వరవరరావు, శివారెడ్డి, నిఖిలేశ్వర్, దేవిప్రియ తదితరులు వక్తలు. వివరాలకు చేకూరి సంధ్య ఫోన్: 040-27152440