
రఘురాం రాజన్ రాయని డైరీ
- మాధవ్ శింగరాజు
‘ఏదో జరగబోతోందని చెప్పడం కన్నా... ఏమీ జరగబోవడం లేదని చెప్పడం వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుందేమో మిస్టర్ చైర్మన్’ అన్నారు ఇవాళ బోర్డు మీటింగులో డైరెక్టర్లంతా!! నిజానికి ‘మనకేం కాదు’ అని నేను చెప్పబోయింది గ్రీసు డిప్రెషన్ గురించి. నేను చెప్పబోతున్నానని వారు అనుకున్నది గ్రేట్ డిప్రెషన్ గురించి. ప్రొఫెసర్ గుప్తా అయితే మీటింగుకి వచ్చీరాగానే, ‘మరీ ఇంత తెల్లవారుజామున మీటింగ్ కాల్‌ఫర్ చేశారేమిటి మిస్టర్ చైర్మన్’ అని అడిగారు! మధ్యాహ్నం పన్నెండు గంటల సమయాన్ని తెల్లవారుజాము అంటున్నారంటే రాత్రంతా మేల్కొని రూజ్వెల్ట్ జీవిత చరిత్ర చదివి ఉండాలి ఆయన. ‘మిస్టర్ రాజన్, మీటింగ్‌లో మాట్లాడ్డానికి మీ దగ్గరేమైనా మంచి విషయాలు ఉంటాయని ఆశించవచ్చా?’’ ఇంకో డెరైక్టర్ ఎజ్డీ మలెగామ్ ప్రశ్న. ‘స్టాక్‌లకు, స్టేక్‌లకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మిస్టర్ మలెగామ్’ అని ఆయనకు ధైర్యం చెప్పాల్సి వచ్చింది. ‘కానీ మిస్టర్ చైర్మన్ నాకెందుకో విపరీతమైన ఆందోళన కలుగుతోంది’ అన్నారు డాక్టర్ నచికేత్. ‘స్టాక్‌మార్కెట్ గురించేనా?’ అని అడిగాను.
‘నో.. నో... మిస్టర్ చైర్మన్.. అది కాదు నా ప్రాబ్లమ్. ఇవాళ నా మనవడు నాకో హండ్రెడ్ రూపీస్ నోట్ ఇచ్చి... ఉంచుకో తాతయ్యా... ఆఫీసులో సాయంత్రం స్నాక్స్‌కి ఉంటుంది అన్నాడు. డిప్రెషన్ గురించి లండన్ బిజినెస్ స్కూల్లో మీరిచ్చిన స్పీచ్‌ని గానీ వాడు పేపర్లో చదివి ఉండడు కదా అని నా అనుమానం’ అన్నారు డాక్టర్ నచికేత్. డెరైక్టర్లంతా నా వైపు చూశారు. మరోసారి గ్రేట్ డిప్రెషన్ రాబోతోందని నేను ఆ స్పీచ్‌లో అన్నట్లు పేపర్లు రాశాయి! జాగ్రత్తగా లేకపోతే డిప్రెషన్‌లో పడిపోతాం అని మాత్రమే కదా నేనన్నాను?! ‘మిస్టర్ చైర్మన్... మాట్లాడుకోడానికి మన దగ్గర మంచి విషయాలేమైనా ఉన్నాయా’ అని అడిగిన ప్రశ్నే మళ్లీ అడిగారు మలెగామ్. ‘ఆ సంగతేమో గానీ, చదువుకోడానికి నా దగ్గరో మంచి పుస్తకం ఉంది’ అన్నారు ప్రొఫెసర్ గుప్తా.
‘ఏమిటది?’ అన్నారు మిగతా డెరైక్టర్లు ఎంతో ఆసక్తిగా. ‘రూజ్వెల్ట్ బయోగ్రఫీ. గ్రేట్ డిప్రెషన్‌ని ఆయన ఎంత చక్కగా డీల్ చేశారో అందులో రాశారు’ అని చెప్పారు గుప్తా. నా ఊహ నిజమే! రాత్రి ఆయన చదివింది రూజ్వెల్ట్ జీవిత చరిత్రే. ఇంటికొచ్చి స్నానం చేస్తున్నప్పుడు కూడా నాకు మలేగామ్ మాటలే గుర్తొచ్చాయి. మాట్లాడుకోడానికి మంచి విషయాలేమైనా ఉన్నాయా అంటాడేమిటాయన! ఆర్బీఐ బోర్డు మీటింగులో అన్నీ మంచి విషయాలే మాట్లాడుకోదలిస్తే డబ్బు గురించి మనం అస్సలు మాట్లాడుకోకూడదని ఈసారి ఆయనకు చెప్పాలి.