వీరనారిపై పాలకుల వివక్ష | Discrimination rule to Ailamma Heritage | Sakshi
Sakshi News home page

వీరనారిపై పాలకుల వివక్ష

Published Thu, Sep 10 2015 12:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

వీరనారిపై పాలకుల వివక్ష

వీరనారిపై పాలకుల వివక్ష

తమది ఐలమ్మ వారసత్వమని ఘనంగా చాటుకొని స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇప్పుడు ఆమె ఎవరో తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. ‘ఏరు దాటే వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్లుగా ఉంది టీఆర్‌ఎస్ నేతల తీరు. ‘భూమి నాదియనిన భూమాత ఫక్కున నవ్వున్..’ అన్నాడు ప్రజాకవి వేమన. భూమి నాదనీ, ఆ పంట నాకే నని జులుం చేసిన దొరపై వీరనారి ఐలమ్మ గర్జించింది. దున్నేవారికే భూమి అని ఎలుగెత్తి చాటినవారికి దన్నుగా నిలిచింది. భూపోరాటానికి నాందీ వాచకమైంది. నైజాం రాచరికానికి చరమగీతమైంది. వంగి వంగి దండాలు పెట్టే జాతిలో ఆమె సివంగివలె తలెత్తుకుంది.. రాజు అండ ఉన్న విస్నూరు రామచంద్రారెడ్డి అనే జమీందార్‌ను ఒక కింది కులం మహిళ, అందునా ఒంటరి, చావుకు వెరవ కుండా ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. గరీబు కులం (చాకలి)లో పుట్టిన ఐలమ్మ ఓ దొరను గజగజ వణి కించడం మొత్తం సమాజాన్ని నివ్వెరపర్చింది.
 
 నిన్ను చంపితే నీ భూమిని తీసుకుంటే ఏం చేస్తావని ఐలమ్మను బెదిరించిన దొరతో ‘నీకు ఒక్కడే కొడుకు, నాకు ఐదు గురు కొడుకులు, నాకు నాలుగెకరాల భూమి ఉంది. నీకు వేల ఎకరాలున్నాయి. నాకేమన్న అయితే నా కొడుకులు ఊకోరు. నా కొంగుల సంగం చిట్టి (పావలా కట్టి సభ్య త్వం తీసుకుంది) ఉంది. సంగపోలు నీ సంగతి జూస్తరు.  నీ గడీల గడ్డి మొల్తది’ అని సమాధానం ఇచ్చింది. ముందుచూపు ఉన్న ఐలమ్మ అన్నట్లే ఇప్పుడు గడీ పాడుబడింది. నిజంగానే గడ్డి మొలిచి ఎందుకూ పనికి రాకుండా ఉంది. కూలిపోయిన దొర ఆధిపత్యానికి నిదర్శ నంగా ఆ గడీ నిలిచింది. అప్పట్లో ఆమె పోరాటం అశేష పీడిత జనానికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
 
 ఆమె కొంగు నడుముకు చుడితే.. ఆధిపత్యం తోకముడిచింది. ఆమె కొడవలి ఎత్తిపడితే కోటలు నేలకూలాయి. కట్టుకున్నోడిని, కన్న వాడిని ఉద్యమంలో పోగొట్టుకున్నా ఎత్తిన జెండాను దించలేదు. ఆమె కళ్లలో రుద్రమ రౌద్రాన్ని నింపుకొని వరంగల్ జిల్లా పాలకుర్తి, ఆ చుట్టుపక్కల గడీలను గడగడ లాడించింది. భూమి కోసం, భుక్తి కోసం ఆమె పడిన పెనుగులాట విముక్తి పోరాటానికి దిక్సూచిగా నిలిచింది. పాలకుర్తి పక్కన ఉన్న మల్లంపల్లి దొర వద్ద ఐలమ్మ కుటుంబం నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పంటలు సాగు చేయడం, దొర గడీలో వెట్టి చేయడానికి నిరాకరించడం, ఆంధ్ర మహాసభలో చేరి సంఘం పెట్ట డం, పేదలను, కింది కులాల ప్రజలను సమీకరించడం విస్నూరు దొరకు కంటగింపు అయింది. అణచివేత చర్య లకు దిగాడు. ఆమె కుటుం బాన్ని ఆగమాగం చేశాడు. ఆమె భర్తను, కొడుకును జైలుపాలు చేశాడు. ఐలమ్మ చేను చెల్కల్లోని పంటలను గూండాలతో కొల్లగొట్టించాలని చూశాడు. కాని ఐలమ్మ ధీరోదాత్తంగా నిలబడి కంటికి రెప్పలా పంటను కాపాడు కొని ఇంటికి చేర్చుకుంది. ఇదంతా గతం. చెరిపినా చెరగని చరిత్ర. దాచినా దాగని సత్యం. చరిత్రపుటల్లో నమోదైంది. వరంగల్ జిల్లా జనగామ తాలూకా రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామంలో 1895లో సద్దుల బతుకమ్మనాడు జన్మించింది.
 
 ఓరుగంటి మల్లమ్మ, సాయిలు దంపతుల నాలుగో సంతానం. ఐలమ్మకు పదేళ్ల వయసులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్లి అయింది. 1985 సెప్టెం బర్ 10న కన్నుమూసింది. కానీ, పాలకుల వివక్ష కార ణంగా ఇప్పుడు ఆమె క్రమేణా విస్మృతిలోకి జారుకుం టోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆమెను విస్మరిస్తోందని కొన్ని ఘటనల ఆధారంగా పీడిత, తాడిత సమాజం నిర్ధారణకు వస్తోంది. హైదరాబాద్ శివారులో, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఆమె విగ్రహాలను కూల్చివేసిన దుండగులను ప్రభుత్వం ఇప్పటివరకు పట్టుకోలేదు. హైదరాబాద్‌లో ఐలమ్మ స్మృతి చిహ్నంలేదు. ఆమె విగ్రహంలేదు. ఆర్థి కంగా ఇబ్బందులు పడుతున్న ఆమె కుటుంబాన్ని ఆదు కోవాలన్న ధ్యాసేలేదు ఈ ప్రభుత్వానికి. ప్రతి ఏటా సద్దుల బతుకమ్మనాడు ఆమె జయంతిని, సెప్టెంబర్ 10న వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సి ఉంది.
 
 కాని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో వామపక్షపార్టీలు, ఇతర ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో పాలకుర్తిలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని ఆమె వర్ధంతినాడు ప్రతిష్టిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆమె పేరు చెప్పుకొని రణనినా దాన్ని రక్తి కట్టించారు నేటి పాలకులు. తమది ఐలమ్మ వారసత్వమని ఘనంగా చాటుకొని స్వరాష్ట్రాన్ని సాధిం చుకున్నారు. ఇప్పుడు ఆమె ఎవరో తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. ‘ఏరు దాటే వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్లుగా ఉంది టీఆర్‌ఎస్ నేతల తీరు. ఐలమ్మ పోరాటం ఇచ్చిన సందేశం ఏమిటీ? నడి చిన దారి పొడవునా ఆమె వెదజల్లిన విలువలేమిటి? ఇవేవీ పాలకులకు తెలియదా? సమ్మక్క, సారమ్మల అనం తర కాలంలో తెలంగాణలో ఆధిపత్యాన్ని, రాచరికాన్ని, పీడనను, అణచివేతను ఎదిరించిన ధీరవనిత ఐలమ్మ. మహిళలు ఇంటి గడప దాటడమే గగనమైన ఈ సమాజంలో కిందివర్గం, చాకలి కులంలో పుట్టిన ఒక అతి సామాన్యమైన మహిళ భూస్వాములను, జమీందారు లను సవాల్ చేయడం ఊహకందని విషయం. మీజాన్ ఉర్దూ, తెలుగు దినపత్రికలో సంపాదకులు అడివి బాపి రాజు ఆమె పోరాటాన్ని ప్రముఖంగా ప్రచురించారు.
 
  పుచ్చలపల్లి సుందరయ్య రాసిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నా అనుభవాలు అనే పుస్తకాన్ని చైనా ప్రభుత్వం చైనీస్ భాషలో అనువదించింది. అందులోనూ ఐలమ్మ వీరోచిత పాత్రను విశేషంగా పేర్కొన్నారు. అలాంటి ఒక వీరనారి జయంతిని, వర్ధంతులను ఘనం గా నిర్వహించాలి. ఇప్పటికైనా పాలకుల తీరు మారకుంటే ‘కాలంబు రాగానే కాటేసి తీరాలన్న’ కాళోజీ మాటలను నిజం చేస్తారేమో ఈ ప్రాంత ప్రజలు.
(సెప్టెంబర్ 10న వీరనారి ఐలమ్మ 30వ వర్ధంతి. ఈ రోజున పాలకుర్తిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంగా...)
 నీలం వెంకన్న, మొబైల్: 9705346084

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement