భగవత్సంకల్పం
భగవంతుడు దయామయుడు. ఆయన సేవలో, ఆయన కార్యంలో మనం నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తే ఏ కష్టాలనుంచి అయినా గట్టెక్కిస్తాడు. ఇందుకు ఎవరో కాదు... నేనే ఉదాహరణ.
అది 2009 మార్చి 3వ తేదీ. ముందురోజు రాత్రి అప్పుడే వచ్చిన మాసపత్రిక ‘వాక్’ను పరికించి చూశాను. అది అన్నివిధాలా అనుకున్నట్టే వచ్చిందన్న తృప్తితో నిద్రపోయాను. చిత్రం... తెల్లారేసరికల్లా నేను మంచంపైనుంచి లేవలేని స్థితి. నా ఎడమ కాలు, ఎడమ చెయ్యి స్వాధీనం తప్పాయి. అతి కష్టంమీద హైదరాబాద్‌లో ఉన్న నా కుమారుడికి ఫోన్ చేశాను. భగవంతుడికి జరగాల్సిన నిత్య ఆరాధనం కోసం వెంటనే బయలుదేరి రావాలని కోరాను. తను చిలుకూరుకు వెంటనే వచ్చేశాడు. భగవదారాధనకు సమాయత్తమయ్యాడు.
నా అనారోగ్యానికి సంబంధించినంత వరకూ అందరమూ అలసటవల్ల కలిగిన నీరసమే అనుకున్నాం. కానీ, సమయం గడిచేకొద్దీ అదింకా క్షీణించడం మొదలుపెట్టింది. ఇక ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలని అందరూ నిర్ణయించారు. నాకు సెరెబ్రల్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తేల్చారు. నేను హతాశుడినయ్యాను. నడవలేని స్థితి ఏర్పడింది. మనసు నిండా ఎన్నో ఆలోచనలు. దేవాలయ పరిరక్షణ ఉద్యమాన్ని ఆరంభించి ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొంటున్నా దాన్ని కొనసాగించాను. దేవాల యాన్ని వ్యాపారీకరణవైపు తిప్పాలని శతధా ప్రయత్నిస్తున్న శక్తులను ఎదిరించాము. మా ఉద్యమం అర్థంతరంగా ముగిసిపోతుందా? మెల్లగా నిస్సత్తువ ఆవరించసాగింది. నా జీవితంలో ఇంత నిస్సహాయత ఎప్పుడూ అనుభవించలేదు. చిలుకూరు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు తొలి దశలో ఎందరో నన్ను నిందించారు. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ...ఇప్పుడేమిటిలా? లోలోపల కుమిలిపోసాగాను. ఆలోచిస్తూనే నిద్రపోయాను.
ఇంతలో ఎవరో లేపినట్టయి చూస్తే ఎదురుగా నా రెండో కుమారుడు. అతడిని చూడగానే కలిగిన సంతోషంలో అతి కష్టంమీద కూర్చోగలిగాను. ఒక కార్డియాలజిస్టు ‘స్వామీ...ఇలాంటి స్ట్రోక్ వచ్చాక కూడా మీరు కూర్చున్నారా? ఇది నిజంగా మహిమ’ అన్నాడు సంతోషంగా. మరోపక్క చిలుకూరు గ్రామంలో ఉన్న భక్తులంతా నా కోసం ప్రార్థనలు చేశారు. ఎందరో భక్తులు నన్ను చూడటానికి కూడా వచ్చారు. వచ్చినవారందరూ నాలో ధైర్యాన్ని నింపారు. అందరి ఆశయమూ ఒకటే.... నేను మళ్లీ కోలుకుని ఆలయాలకు స్వయంప్రతిపత్తి, వాటి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం లేకుండా చేయడం, వ్యాపారీకరణ పారదోలడం వంటి లక్ష్యాలను సాధించాలని. అటు ఆస్పత్రి సిబ్బంది కూడా చాలా శ్రమించి నన్ను మామూలు మనిషిని చేయడానికి కృషి చేశారు. నేను నడవకూడదని వైద్యులు సూచించారు.
కానీ, ఏదో అదృశ్యశక్తి నాలోని శక్తిని పరీక్షించుకోమంది. ఎంత ఇబ్బందిగా అనిపించినా అతి కష్టంపై లేవగలిగాను. క్రమేపీ కోలుకుని ఎవరి సాయమూ అవసరం లేకుండా నడిచే స్థితికి చేరాను. ఇంతటి అనారోగ్యం వచ్చినా శరీరానికి శాశ్వతంగా నష్టం కలగకపోవడం అదృష్టమే తప్ప మరేదీ కాదని వైద్యులందరూ చెప్పారు. అందరిపైనా నాకు కృతజ్ఞతాభావం ఏర్పడింది. భగవంతుడు కాపాడాడు గనుక భవిష్యత్తులో కూడా దైవకార్యాన్ని ద్విగుణీకృత ఉత్సాహంతో కొనసాగించాలని నిశ్చయించుకున్నాను. ముం దుగా చెప్పినట్టు ఆ స్వామికి నిస్వార్థంగా సేవచేస్తే ఆయనే మనల్ని కాపాడతాడు. ఇందుకు నా చిన్న అనుభవమే పెద్ద దృష్టాంతం.
-ఎం.వి.సౌందర్‌రాజన్,
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు