chilukuru Balaji
-
8 నుంచి కూడా భక్తులకు అనుమతిలేదు
మొయినాబాద్: ఈ నెల 8 నుంచి దేవాలయా లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సడలి ంపు ఇచ్చినా చిలుకూరు బాలాజీ దేవాలయం మాత్రం తెరుచుకోదని ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోవిడ్–19 కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌కు ముందు నుంచే చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తుల రాకను నిలిపివేశామన్నారు. లాక్డౌన్లో స్వామివారికి రోజువారి పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులు మాత్రం ఎవరూ ఆలయానికి రాలేదని చెప్పారు. జూన్ 8 నుంచి ఆలయాల్లోకి భక్తులు వెళ్లేందుకు ప్రభుత్వం సడలింపు ఇచ్చినా కరోనా కట్టడికోసం చిలుకూరులో మాత్రం భక్తులను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. బాలాజీ దర్శనం కోసం భక్తులెవరూ రావద్దని కోరారు. భక్తులను ఎప్పటి నుంచి అనుమతించాలనే విషయాన్ని పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని రంగరాజన్ చెప్పారు. -
ట్రంప్ మనసు మార్చవా..!
► వీసాల దేవుడికి వేడుకోలు ► చిలుకూరు బాలాజీని కోరుకుంటున్న అమెరికాలో ఉన్నవారి బంధువులు ► ప్రదక్షణలు చేసి మొక్కుతున్న వైనం మొయినాబాద్: వీసాల దేవుడా.. ట్రంప్ మనసు మార్చవా అంటూ చిలుకూరు బాలాజీకి భక్తులు మొరపెట్టుకుంటున్నారు. అమెరికాలో ఉన్న తమవారు క్షేమంగా ఉండాలని పూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా వెళ్లినవారి కోసం వీసాల దేవుడు బాలాజీకి మొక్కుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలు, భారతీయులపై జరుగుతున్న దాడులతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో అమెరికాలో ఉన్నవారి క్షేమం పట్ల ఇక్కడున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. బాలాజీ కృపతో వీసాలు పొంది అమెరికా వెళ్లినవారిని ఆ బాలాజీనే కాపాడాలని.. ట్రంప్ మనసు మారాలని నిత్యం భక్తులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పు చిలుకూరు బాలాజీకి వీసాల దేవుడిగా పేరొచ్చింది. వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రతిరోజు వందల మంది బాలాజీని దర్శించుకుంటారు. 20 ఏళ్లుగా చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో ఎంతోమంది వీసాలు పొంది విదేశాలకు వెళ్లారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు, అక్కడ మనవారిపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అమెరికాలో నివాసం ఉంటున్న వారి బంధువులు, కుటుంబ సభ్యులు నిత్యం బాలాజీ దేవాలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు. ట్రంప్ శాశ్వతం కాదు.. బాలాజీనే శాశ్వతం: ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తుల కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ ఎప్పుడూ తన భక్తులకు అన్యాయం చేయరని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు రంగరాజన్ భక్తులకు వివరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాశ్వతం కాదని.. చిలుకూరు బాలాజీనే శాశ్వతమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ మనవారిపై జరుగుతున్న దాడులతో చాలామంది భయపడుతున్నారని.. బాలాజీ దేవాలయానికి వచ్చి ప్రదక్షణలు చేసి పూజలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పుడు వీసాలు రావడం ఆగలేదని.. వీసాలు పొందినవారు అమెరికాకు వెళ్తూనే ఉన్నారని చెప్పారు. అమెరికాలో ఉన్నవారి కోసం ఆందోళన చెందుతున్నవారు బాలాజీ సన్నిధికి వచ్చి ట్రంపు మనసు మార్చి మంచి నిర్ణయాలు తీసుకునేలా చూడాలని బాలాజీని కోరుకుంటున్నారన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే బాలాజీ ఈ కోర్కెను కూడా తీరుస్తారని.. అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు. -
రేపటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా శ్రీరామనవమి తరువాత దశమి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సాయంత్రం సెల్వర్ కూత్తుతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ అదనపు బస్సులు నడపనుంది. బ్రహ్మోత్సవాలపై కరువు ఎఫెక్ట్ కరువు ప్రభావం చిలుకూరు బాలాజీపై పడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థం రోజు 23న స్వామివారి అభిషేకం చేసేందుకు నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. బాలాజీ ఆలయం ముందు ఉన్న కోనేరులో బ్రహ్మోత్సవాల ముగింపు రోజు చక్రతీర్థం కార్యక్రమం చేపడతారు. ఆరోజు స్వామివారికి కోనేరులో అభిషేకం చేస్తారు. అందుకోసం కోనేరులో నీళ్లులేకపోతే బోరుబావుల నుంచి, ట్యాంకర్ల ద్వారా తెచ్చి కోనేరును నింపేవారు. అయితే ఈ సారి పరిస్థితి మారింది. ప్రస్తుతం కరువు పరిస్థితులతో నీళ్లు దొరకడంలేదు. ఆలయ సమీపంలో ఉన్న గండిపేట జలాశయం పూర్తిగా ఎండిపోయింది. గ్రామాల్లో ప్రజలు తాగేందుకే నీళ్లు దొరకని ఈ పరిస్థితుల్లో స్వామివారి అభిషేకం కోసం సుమారు 150 ట్యాంకర్ల నీటితో కోనేటిని నింపి ఆ తరువాత ఆ నీటిని వృధా చేయడం సరికాదని ఆలయ అర్చకులు భావిస్తున్నారు. కోనేటికి బదులు ప్రత్యేకంగా ఓ తొట్టిని ఏర్పాటు చేసి అందులో స్వామివారి అభిషేకం చేస్తామని ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు, ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు. -
భగవత్సంకల్పం
భగవంతుడు దయామయుడు. ఆయన సేవలో, ఆయన కార్యంలో మనం నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేస్తే ఏ కష్టాలనుంచి అయినా గట్టెక్కిస్తాడు. ఇందుకు ఎవరో కాదు... నేనే ఉదాహరణ. అది 2009 మార్చి 3వ తేదీ. ముందురోజు రాత్రి అప్పుడే వచ్చిన మాసపత్రిక ‘వాక్’ను పరికించి చూశాను. అది అన్నివిధాలా అనుకున్నట్టే వచ్చిందన్న తృప్తితో నిద్రపోయాను. చిత్రం... తెల్లారేసరికల్లా నేను మంచంపైనుంచి లేవలేని స్థితి. నా ఎడమ కాలు, ఎడమ చెయ్యి స్వాధీనం తప్పాయి. అతి కష్టంమీద హైదరాబాద్‌లో ఉన్న నా కుమారుడికి ఫోన్ చేశాను. భగవంతుడికి జరగాల్సిన నిత్య ఆరాధనం కోసం వెంటనే బయలుదేరి రావాలని కోరాను. తను చిలుకూరుకు వెంటనే వచ్చేశాడు. భగవదారాధనకు సమాయత్తమయ్యాడు. నా అనారోగ్యానికి సంబంధించినంత వరకూ అందరమూ అలసటవల్ల కలిగిన నీరసమే అనుకున్నాం. కానీ, సమయం గడిచేకొద్దీ అదింకా క్షీణించడం మొదలుపెట్టింది. ఇక ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించాలని అందరూ నిర్ణయించారు. నాకు సెరెబ్రల్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు తేల్చారు. నేను హతాశుడినయ్యాను. నడవలేని స్థితి ఏర్పడింది. మనసు నిండా ఎన్నో ఆలోచనలు. దేవాలయ పరిరక్షణ ఉద్యమాన్ని ఆరంభించి ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొంటున్నా దాన్ని కొనసాగించాను. దేవాల యాన్ని వ్యాపారీకరణవైపు తిప్పాలని శతధా ప్రయత్నిస్తున్న శక్తులను ఎదిరించాము. మా ఉద్యమం అర్థంతరంగా ముగిసిపోతుందా? మెల్లగా నిస్సత్తువ ఆవరించసాగింది. నా జీవితంలో ఇంత నిస్సహాయత ఎప్పుడూ అనుభవించలేదు. చిలుకూరు ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు తొలి దశలో ఎందరో నన్ను నిందించారు. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ...ఇప్పుడేమిటిలా? లోలోపల కుమిలిపోసాగాను. ఆలోచిస్తూనే నిద్రపోయాను. ఇంతలో ఎవరో లేపినట్టయి చూస్తే ఎదురుగా నా రెండో కుమారుడు. అతడిని చూడగానే కలిగిన సంతోషంలో అతి కష్టంమీద కూర్చోగలిగాను. ఒక కార్డియాలజిస్టు ‘స్వామీ...ఇలాంటి స్ట్రోక్ వచ్చాక కూడా మీరు కూర్చున్నారా? ఇది నిజంగా మహిమ’ అన్నాడు సంతోషంగా. మరోపక్క చిలుకూరు గ్రామంలో ఉన్న భక్తులంతా నా కోసం ప్రార్థనలు చేశారు. ఎందరో భక్తులు నన్ను చూడటానికి కూడా వచ్చారు. వచ్చినవారందరూ నాలో ధైర్యాన్ని నింపారు. అందరి ఆశయమూ ఒకటే.... నేను మళ్లీ కోలుకుని ఆలయాలకు స్వయంప్రతిపత్తి, వాటి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం లేకుండా చేయడం, వ్యాపారీకరణ పారదోలడం వంటి లక్ష్యాలను సాధించాలని. అటు ఆస్పత్రి సిబ్బంది కూడా చాలా శ్రమించి నన్ను మామూలు మనిషిని చేయడానికి కృషి చేశారు. నేను నడవకూడదని వైద్యులు సూచించారు. కానీ, ఏదో అదృశ్యశక్తి నాలోని శక్తిని పరీక్షించుకోమంది. ఎంత ఇబ్బందిగా అనిపించినా అతి కష్టంపై లేవగలిగాను. క్రమేపీ కోలుకుని ఎవరి సాయమూ అవసరం లేకుండా నడిచే స్థితికి చేరాను. ఇంతటి అనారోగ్యం వచ్చినా శరీరానికి శాశ్వతంగా నష్టం కలగకపోవడం అదృష్టమే తప్ప మరేదీ కాదని వైద్యులందరూ చెప్పారు. అందరిపైనా నాకు కృతజ్ఞతాభావం ఏర్పడింది. భగవంతుడు కాపాడాడు గనుక భవిష్యత్తులో కూడా దైవకార్యాన్ని ద్విగుణీకృత ఉత్సాహంతో కొనసాగించాలని నిశ్చయించుకున్నాను. ముం దుగా చెప్పినట్టు ఆ స్వామికి నిస్వార్థంగా సేవచేస్తే ఆయనే మనల్ని కాపాడతాడు. ఇందుకు నా చిన్న అనుభవమే పెద్ద దృష్టాంతం. -ఎం.వి.సౌందర్‌రాజన్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు -
దృష్టిని మలిచేది!
ఆడవాళ్లూ, అమ్మాయిలూ అమ్మవారి ప్రతిరూపాలు. ‘యత్రాహం తత్ర పుణ్యాని యత్రాహం తత్ర కేశవః వనితాయాం అహం తస్మాత్ నారీ సర్వ జగన్మయీ’ అంటున్నది అమ్మవారు, ‘లక్ష్మీతంత్రం’లో. అంటే, ‘నేను ఎక్కడ ఉంటే అక్కడ పుణ్యం. నేను ఎక్కడ ఉంటే అక్కడ కేశవుడు (భగవంతుడు) ఉంటారు. నేను ఆడవాళ్లందరిలో ఉన్నాను. కాబట్టి వారిని నా రూపంగా గౌరవించండి!’ అని. ఈ దేశంలో రోజు రోజుకీ ఆడవాళ్ల పట్ల హింస పెరిగిపోతున్నది. మనందరం ఆలోచించే ధోరణి మారాలి. ధనుర్మాసంలో ఒక అమ్మాయి తెల్లవారుజామున తల్లిదండ్రులతో కలిసి చిలుకూరు ఆలయానికి వచ్చింది. ఏడెనిమిదేళ్లుంటాయి. దర్శనం కోసం బారులు తీరిన జనంలో పట్టు లంగా, జాకెట్టు, నిం డుగా గాజులు, జడలో కనకాంబరాలు ధరించి వెళుతోంది- గోదా అమ్మవారిలా. నేను దగ్గరగా పిలిచాను. నవ్వుకుంటూ వచ్చింది. రెండొందల వరకు ఉన్న భక్తులను ఉద్దేశించి మైక్‌లో అడిగాను. ‘‘ఈ అమ్మాయిని చూస్తే గోదాదేవిలా ఉందా? లేదా?!’’ అవునని ఆమోదించారంతా. ఆ అమ్మాయిని అడిగాను, ‘‘ఈ డ్రెస్సు వేసుకోమని ఎవరన్నారు?’’ వాళ్లమ్మను చూపిస్తూ అంది, ఆ అమ్మాయి, ‘‘మా అమ్మ చెప్పిం ది!’’ ఆ అమ్మాయి తల్లికి ముప్పయ్యేళ్లు ఉండవచ్చు. ఈ గుర్తింపుకి కొంచెం బెదిరినా, మన స్సులో ఆనందించినట్టే ఉంది. ఆ చిన్న అమ్మాయిని అభినందించిన విషయాన్ని గమనిస్తూ కొంచెం వెనకాలే ఉన్న జీన్స్ ప్యాంటు ధరించిన అమ్మాయి ‘నేనూ అలా తయారవుతానంటే ఎందుకు వద్దన్నావు?’ అంటూ తన నాన్నగారితో పోట్లాడడం విన్నాను. ఒక విధంగా ఆనందం. కొంచెం బాధ కూడా. దేశంలో విలువలు ఇంకా దిగజారకుండా ఉండాలంటే ఈ వయస్సులో పిల్లలకు జాగ్రత్తగా, అర్ధమయ్యేలా చెప్పాలి. ఒక అమ్మాయి నన్ను అడిగింది, ‘‘మీకు నచ్చిన దుస్తులే వేసుకోవాలా?!’’ అని. ఈ ప్రశ్నకూ నవ్వుకుంటూ సమాధానం ఇచ్చాను. ‘‘జీన్స్‌ప్యాంటు వేసుకున్నా నీవు అమ్మవారే... ఆఫీసుకో, విహారానికో ఎలా వెళ్లినా ఫర్వాలేదు. దేవాలయానికి ఒక దేవతలా తయారయి రామ్మా!’’ అన్నాను. ‘సరే’ అని మళ్లీ వచ్చినపుడు పరికిణీతో వచ్చింది. ఇదంతా గుర్తు చేసింది. జోత్స్నామివ స్త్రియం దృష్ట్వా యస్య చిత్తం ప్రసీదతి నాపధ్యాయతి యత్కించిత్ సమే ప్రియతమః మతః ‘ఎవరైతే లక్షణంగా ఉన్న అమ్మాయినిచూసి నన్నుగుర్తుకు తెచ్చుకుంటారో వారే నాకు ప్రియమైనవారు’ అన్నారు అమ్మవారు. ఎంతముఖ్యమైన సందేశం! మనపిల్లలకు పరిచయం చేయాలి కదా! మత్ తనుః వనితా సాక్షాత్ యోగీ కస్మాన్న పూజయేత్ నకుర్యాత్ వృజినం నార్యాః కువృత్తం నస్మరేత్ స్త్రియాః ‘ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాదు, వికారంగా ఆలోచించడం కూడా సహించను’ అంటున్నారు అమ్మవారు. ఆడవాళ్లను గౌరవించని దేశం ఎంత భయంకరంగా ఉంటుందో, అమ్మవారికి ఆగ్రహం కలిగితే ఎలా ఉంటుందో చెప్పి పెంచారు మా పెద్దలు. మనం కూడా పిల్లలకు అదే చెబుదాం. ఆడవాళ్లుగా ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడేలా స్త్రీలను గౌరవిద్దాం! సౌందర్ రాజన్ (చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు)