తెలంగాణ తిరుపతిగా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏటా శ్రీరామనవమి తరువాత దశమి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం సాయంత్రం సెల్వర్ కూత్తుతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఆర్‌టీసీ అదనపు బస్సులు నడపనుంది.
బ్రహ్మోత్సవాలపై కరువు ఎఫెక్ట్
కరువు ప్రభావం చిలుకూరు బాలాజీపై పడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రతీర్థం రోజు 23న స్వామివారి అభిషేకం చేసేందుకు నీళ్లు లేని పరిస్థితి నెలకొంది. బాలాజీ ఆలయం ముందు ఉన్న కోనేరులో బ్రహ్మోత్సవాల ముగింపు రోజు చక్రతీర్థం కార్యక్రమం చేపడతారు. ఆరోజు స్వామివారికి కోనేరులో అభిషేకం చేస్తారు. అందుకోసం కోనేరులో నీళ్లులేకపోతే బోరుబావుల నుంచి, ట్యాంకర్ల ద్వారా తెచ్చి కోనేరును నింపేవారు.
అయితే ఈ సారి పరిస్థితి మారింది. ప్రస్తుతం కరువు పరిస్థితులతో నీళ్లు దొరకడంలేదు. ఆలయ సమీపంలో ఉన్న గండిపేట జలాశయం పూర్తిగా ఎండిపోయింది. గ్రామాల్లో ప్రజలు తాగేందుకే నీళ్లు దొరకని ఈ పరిస్థితుల్లో స్వామివారి అభిషేకం కోసం సుమారు 150 ట్యాంకర్ల నీటితో కోనేటిని నింపి ఆ తరువాత ఆ నీటిని వృధా చేయడం సరికాదని ఆలయ అర్చకులు భావిస్తున్నారు.
కోనేటికి బదులు ప్రత్యేకంగా ఓ తొట్టిని ఏర్పాటు చేసి అందులో స్వామివారి అభిషేకం చేస్తామని ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్, తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు, ఆలయ అర్చకుడు రంగరాజన్ తెలిపారు.