గోండు జీవితమే నిఘంటువు | gondu lifestyly by jayadeer tirumalarao | Sakshi
Sakshi News home page

గోండు జీవితమే నిఘంటువు

Published Sun, Jul 30 2017 1:11 AM | Last Updated on Tue, Sep 5 2017 5:10 PM

గోండు జీవితమే నిఘంటువు

గోండు జీవితమే నిఘంటువు

సందర్భం
నేటి ఆదివారం ప్రత్యేకమైనది. రోజులా ఇంట్లో కాకుండా ఉదయం ఆరు గంట లకు ఆదిలాబాద్‌ జిల్లా నార్నూరు మండలం సంజాల గోండు గూడెంలో వేకువ రేకలు చూస్తాం. ఆది, సోమ, మంగళవారాలూ అక్కడే. గోండు గిరిజన మిత్రుల మధ్యే గడుపుతాం. మొదటి రోజు సేకరించిన 22 వేల గోండు భాషా పదాల మీద చర్చిస్తాం. లోగడ 3 వేల పదాలతో ఒకటీ అరా పదకోశాలు వెలు వడ్డాయి. కానీ ఒక్క నార్నూరు మండలంలోనే 15 మంది ఇన్‌స్ట్రక్టర్లు అలవోకగా సేక రించిన పదాల స్వరూపాన్ని మొదట పరిశీలిస్తాం. పద సేకర్తలలో తప్పనిసరిగా నలుగురు మహిళలను నియమించాం. ఎందుకంటే స్త్రీలకు చెందిన సగం గోండు పదాలు వెలుగు చూడాలి.

సాధారణంగా నిఘంటువులు పురుష ప్రాధాన్య భాషా ప్రధా నమే. వారి ఆటపాటలు, వినోదాలు, విందులు, వ్యక్తీకరణలు అన్నీ పురుషులవే. స్త్రీలకి సంబంధించి ప్రసవం, సమర్త, పెళ్లి, గర్భ సమస్యలు, దేశీ మందులు, వారి విశ్వాసాలు, పూజలకు సంబంధించిన పదాలు తక్కువ చోటు చేసుకుంటాయి. అంత రించిపోవడానికి అనుగుణమైన ఒక ఆదివాసీ భాషలో ఉన్న పదాలు సేకరించడం అత్యవసరం. ఇప్పుడు కాకపోతే మరె ప్పుడూ సాధ్యం కాదు. ఇలా సేకరించిన పదాలలో ఉన్న డూప్లికేట్లను ఏరివేయాలి. ఆ పదాల ఉచ్ఛారణ ఎలా ఉంటుందో కోట్నక్‌ జయకాంతరావు, అర్కమానిక్‌రావు, మెస్తం మనోహర్, కోట్నక్‌ జంగు, విఠల్, వినాయక్, టి. దేవురావు వంటి వారితో చర్చిస్తాం. నిజానికి ఈ రోజు గోండీ భాషా నిఘంటు నిర్మాణ సమస్యలపై చర్చ, శిక్షణా శిబిరం జరుగుతుంది.

ఒక వృద్ధ మహిళ వేసుకున్న, జీవితకాలం వాడిన నగలు, ఇంటిలోని పాత్రలు, వంటలు, పీడించిన జబ్బులు, దంపుడు, రోకలి, విసురుడు వంటి పనులలోని పదాలని పట్టిక వేయడానికి ఇద్దరు పనిచేస్తారు. వ్యవసాయం, పర్యావరణం, చెట్లు, ధాన్యం, వైద్యం, ఆకులు, మూలికలు వంటి రంగాలకి సంబంధించిన పద జాలం ఎంత ఉంది? ఇంకా ఎన్ని పదాలు సేకరించవచ్చో కూడా అంచనాకు వస్తాం. గోండి కోయతుర్‌ భాష మూల ద్రావిడ భాష. తమిళం, కన్నడం, మలయాళం, తుళు, తెలంగాణ, తెలుగు భాషల మూల పదాలు ఇందులో కనిపిస్తాయి. వాటి రూపాలు ఒక్కో రాష్ట్రంలో, ప్రాంతంలో ఎలా ఉచ్చరిస్తారు? ఎలా రాస్తారు? ఆ పదాల మూల రూపం ఏమిటి? ప్రస్తుత అర్థం ఏమిటి అని తరచి చూస్తాం. ఇప్పటికీ తెలుగు బాషలో కోయతూర్‌ భాషా పదాలు చాలా ఎక్కువ. గోండు ప్రజలు వాడే భాషని గోండు భాష అంటారు. కానీ గోండులు, కోయలు తమ భాషని తాము కోయ తుర్‌ భాష, సంస్కృతి అని పిలుచుకుంటారు. గోండీని కోయ భాషకు సోదర బంధమే. విడదీయరాని కవలలు భౌగోళికంగా విడిపడ్డాయి. కానీ రెంటిలో పారేది ఒకే భాషా రక్తమే. గోండీ భాషా నిఘంటువు నిర్మాణం, తదుపరి కోయ భాష పదకోశం తయారు కావడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు.

రెండో రోజు సంజాల గోండీ లిపిలో విద్యార్థుల కోసం మూడో వాచకం రచనా ప్రణాళికని తయారు చేస్తాం. ఒక అత్యంత ప్రాచీన భాషా లిపులకు సంబంధించిన వాచకం తయారు చేయడం క్లిష్టమైన పని. ఐతే మేం ఆ లిపిని ఐదారేళ్ల నుండి నేర్పిన యువకులు అక్కడ ఉన్నారు. వారి సహాయంతో గోండి పరి సరాలను, జీవితాలను, సంస్కృతిని, పండుగలు, జాతరలను అందులో పాఠాల రూపంలో చేరుస్తాం. వారి జీవితాలు మెరుగు పడటానికి, వారి హక్కులు తెలుసుకోవడానికి వీలుగా కొన్ని పాఠాలు ఉంటాయి. కేవలం అక్షరాలు నేర్పడం సరిపోదు. అక్షరం వారి బతుక్కి ఆసరా కావాలి. ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తూ, చట్టాల సమాచారాన్ని పొందుపరుస్తూ, అందుకోవలసిన పథకాల సమాచారాన్ని వాచకాలలో ఉండాలి. లేకపోతే నిరుపయోగాలు.

వర్షాలు మైదాన, పట్టణ ప్రాంత వాసులకు జీవనాధారం. కానీ ఆ వర్షాలే ఆదివాసుల బతుకులకు అంతిమయాత్రలు. ఈ రుతువు చావుడప్పుతో సమానం. అనారోగ్యం ఆ గూడేలకు పట్టిన శాపం. వైద్య శాఖ ఎన్ని చర్యలు చేపట్టినా ఏదో ఓ రూపంలో రోగాలు వారిని కబళించివేస్తున్నాయి. గత ఏడాది చెంచు గూడే లకు తరలివెళ్లాం. ఆహారంకన్నా ఈ కాలంలో ఆరోగ్యం ముఖ్యం. వెంటనే అందాల్సిన వైద్యం అందకపోతే కళ్లముందే జీవితం మాయం. అందుకే వారి కోసం ఆగస్టు ఒకటో తేదీన ఆర్థోపెడిక్‌ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం.

హైదరాబాద్‌ నుండి డాక్టర్‌ బి. రాజగోపాలరావు సహాయ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో వైద్య బృందం మందు లతోపాటు అక్కడికి వస్తారు. వారి వెంట డాక్టర్‌ కొల్లు రంగారావు, కెమిస్ట్‌ గుండవరపు పద్మ, ఫ్రెంచి ఆంత్రపాలొజిస్టు డాక్టర్‌ డేనియల్‌ నేజర్స్‌ మాతో జత కలుస్తారు. గుంజాల కోయతూర్‌ లిపి భాష అధ్యయన వేదిక సమన్వయకర్త డాక్టర్‌ గూడూరు మనోజ పరి శోధన పర్యవేక్షణ చేస్తారు. ఉట్నూరు ఐటీడీఏ పీవో, అధ్యక్షులు కనక లఖేరావు, వారి సిబ్బంది సహకారంతో ఈ కార్య క్రమం జరుగుతుంది. దీనిలో రచయితలు, కవులు వలంటీర్లుగా పనిచేస్తారు. ఆదివాసీలను ఆత్మీయ బంధువులుగా చూసే సాహిత్యం, కళలు వెల్లివిరియాలని, వారితో ఆదానప్రదానాలు కొనసాగాలని ఆశిస్తున్నాం.

వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక ‘ 9951942242
జయధీర్‌ తిరుమలరావు

Advertisement
Advertisement