వైఎస్ స్వప్న సాకారం హైదరాబాద్ ‘బిట్స్’
సందర్భం
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్.. దివంగతు లైన డాక్టర్ కృష్ణకుమార్ బిర్లా, వైఎస్ రాజశేఖర రెడ్డిల స్వప్న సాకారం. 2005 జూలైలో నాటి ముఖ్య మంత్రి వైఎస్‌ని ఆయన ఆఫీసులో యాథృచ్చికంగా నేను కలుసుకున్నప్పుడు అది పురుడుపోసుకుంది. నేను ప్రస్తావించిన వెంటనే ఆయన హైదరాబాద్‌కు బిట్స్ పిలానీని తీసుకురావాలని అభ్యర్థించారు.
బిట్స్ పిలానీపై తొలిసారిగా ప్రారంభమైన చర్చ డాక్టర్ కేకే బిర్లాతో వైఎస్ నిర్విరామ ప్రయ త్నాల ద్వారా ఆరునెలల్లోపే వాస్తవరూపం దాల్చింది. రాజ్యసభలో ఒకేదఫా ఎంపీలుగా డాక్టర్ బిర్లా, వైఎస్ సుపరిచితులే. అప్పటికే గోవా క్యాంపస్ కోసం నిధులు కేటాయించినందున హైదరాబాద్‌లో మరొక క్యాంపస్ ప్రారం భానికి బిర్లా ఇష్టపడలేదు. ఈ విషయంలో తన అశక్తతను కూడా ఆయన ైవైఎస్‌కి తెలియజేశారు. కానీ హైదరాబాద్‌లో క్యాంపస్‌ను ప్రారంభించేలా డాక్టర్ బిర్లాకు నచ్చచెప్పేందుకు వైఎస్ తనదైన మార్గంలో ప్రయత్నించారు.
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు 2007 ఏప్రిల్ నెలలో శంకుస్థా పన జరిగింది. క్యాంపస్ భవనం ప్లాన్ రుసుమును దాని ప్రారంభ సమా వేశంలోనే మాఫీ చేస్తున్నట్లు వైఎస్ ప్రకటించడమే కాకుండా, క్యాంపస్‌కు నిరంతరాయంగా నీరు, విద్యుత్తును సరఫరా చేయగలమని హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలోనైనా ఐఐఎంల స్థాయిలో ఒక మేనేజ్ మెంట్ స్కూల్‌ని ప్రారంభించాల్సిందిగా ఆయన బిర్లాను అభ్యర్థించారు. దానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని కూడా వాగ్దానం చేశారు. 14 నెలల్లోపే క్యాంపస్‌ను ప్రారంభించాలన్న డాక్టర్ బిర్లా కలను సాకారం చేయడానికి, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్‌గా ఉన్న నాకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికా రులకు వైఎస్ ఆదేశాలిచ్చారు. నేను తలపెట్టిన ఏ పనిలోనైనా 24 గంటలు దాటి జాప్యం జరిగినట్లయితే వెంటనే వచ్చి తనను కలుసుకోవలసిందిగా కూడా వైఎస్ నాకు సూచించారు. కానీ నేను అలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదుర్కో లేదనుకోండి.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ద్వారా మద్దతును వైఎస్ అందించనట్లయితే, ఎంఓఈఎఫ్, ఇతర క్లియరెన్సులు సాధ్యమై, 2008లో బిర్లా క్యాంపస్‌లో విద్యా కార్యక్రమాలు మొదలయ్యేవి కావు. శంకుస్థాపన జరిగిన రోజు బహిరంగసభలో పేర్కొన్నట్లుగా 2008 ఆగస్టులో క్యాంపస్‌ను ప్రారంభించాలని బిర్లా కలగన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న ప్రత్యేక ఆసక్తి వల్లే బిర్లా కల సాకారమైంది.
నేడు, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ హైదరాబాద్‌కు ఆభరణంగా గుర్తింపు పొందింది. 200 ఎకరాలలో విస్తరించి, 20 వేల చదరపుటడుగులలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ క్యాంపస్‌లో ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యు యేట్, పీహెచ్.డి ప్రోగ్రామ్‌లను చేపడుతున్నారు. 2021 నాటికి హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థుల సంఖ్యను 5,200కు తీసుకుపోవాలని ప్రస్తుతం ఈ విద్యా సంస్థ విస్తరణ పథకాలు చేపడుతోంది. ఈ క్యాంపస్‌లోని విద్యార్థు లలో 60 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రాంతాలకు చెందినవారే. బిట్స్ పిలానీ క్యాంపస్‌ని అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలకు వైఎస్ రాజ శేఖరరెడ్డి అందించిన వరం అని చెప్పవచ్చు.
వ్యాసకర్త యాక్టింగ్ వైస్ ఛాన్సలర్, బిట్స్ పిలానీ
vsr@hyderabad.bits-pilani.ac.in
ప్రొ॥వి.ఎస్.రావు