శివారెడ్డి కవిత్వ తత్త్వదర్శనం
రచన: డాక్టర్ ఎ.వి.వీరభద్రాచారి; పేజీలు: 350; వెల: 400; ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు; రచయిత ఫోన్: 9391310886
‘శివారెడ్డి కవిత్వాన్ని ఎంతగా ప్రేమించాడో, శివారెడ్డి వ్యక్తిత్వాన్ని అంతగా అభిమానించిన’ వీరభద్రాచారి డి.లిట్. పట్టా కోసం సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది. ఇది 5 అధ్యాయాలుగా సాగింది. ‘శివారెడ్డికున్న మార్క్సిస్టు విశ్వాసాలను, స్వాభావికంగా ప్రకృతిపట్ల ప్రేమానురాగాలను, ప్రాణగతంగా మానవ సంబంధాల మాధుర్యాలను వీరభద్రాచారి వింగడించాడు’. ‘శివారెడ్డిని వ్యక్తిగా అర్థం చేసుకోవటానికి, కవిగా అనుభూతి విస్తృతిని ఆకళింపు చేసుకోవటానికి, తాత్వికుడుగా జీవన సారాన్ని ఆస్వాదించడానికి వీరభద్రాచారి రచన తోడ్పడుతుంది’.
కలలతో ప్రయాణం
కవి: ఆశారాజు; పేజీలు: 166; వెల: 200; ప్రచురణ: ఝరి పొయెట్రీ సర్కిల్; ప్రతులకు: విశాలాంధ్ర, నవచేతన. కవి ఫోన్: 9392302245
‘హైద్రాబాదు సంస్కృతినీ, సంస్కారాన్నీ ఒక కాస్మాపాలిటన్ కల్చర్‌ని’ యింతగా పీల్చి కవిత్వంగా పలుకుతున్న ఆశారాజు 18వ కవితాసంపుటి ఇది. ‘సరళంగానే, గాఢంగానే, సాంద్రంగానే, సస్టెయిన్డ్‌గానే సాగిన కావ్యమిది. ఒక థీమ్ వుంది. అది కొనసాగిన పద్ధతి సమ్మోహనంగా వుంటుంది. ఆశారాజు ఎప్పుడూ లిరికల్ పోయెట్. యిందులోనూ ఆ లిరికల్ క్వాలిటీ తగ్గకుండా, అన్నింటినీ మంత్రించి కవిత్వం ముద్దచేసి మనకందించాడు’.
పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభ
రచన: డాక్టర్ పూసపాటి శంకరరావు; పేజీలు: 532; వెల: 350; ప్రతులకు: పూసపాటి జయలక్ష్మి, 103ఎ, అట్లాంటిక్ సిటీ అపార్ట్‌మెంట్స్, దీప్తిశ్రీ నగర్, మియాపూర్, హైదరాబాద్-49. ఫోన్: 040-40215873
అవధాని, ప్రౌఢపద్యకవి అయిన పూసపాటి నాగేశ్వరరావు ‘శిల్ప సుందరి’, ‘ఆదర్శ పద్మిని’, ‘శ్రీ వీరబ్రహ్మేంద్ర చరిత్రము’, ‘శ్రీ వాసవీ కన్యకా చరిత్ర’ అను పద్యకావ్యాలను వెలువరించారు. ‘విశ్వబ్రాహ్మణ సంస్కృతి- సాహిత్య చరిత్ర’, ‘దేవాలయాలు బూతు కొంపలా?’ అను పరిశోధిత గ్రంథ రచనలు చేశారు. ‘శంకర శతకం’, శ్రీ వీరబ్రహ్మసర్వేశ్వర శతకం, క్రీస్తు శతకాలకు పండిత పరిష్కారం చేశారు. ‘గుఱ్ఱం వీర గోపాల కృష్ణారెడ్ల చరిత్ర’ ఆయన వచన రచన. ‘మడికి సింగన’ ఆయన నాటిక. పేరుకు తగ్గట్టే, పూసపాటి నాగేశ్వరరావు బహుముఖీన ప్రతిభకు ఈ పీహెచ్‌డీ గ్రంథం అద్దం పడుతుంది. ‘శంకరరావుగారు నాగేశ్వరరావుగారి కవిత గోదావరిలో తాను మునిగి, మనతోనూ పుష్కర పవిత్రస్నానం చేయించారు. నాగేశ్వరరావుగారి కవిత్వంలోని జీవనాడిని పట్టుకున్నారు, దాని చైతన్యాన్ని మనకు పట్టిచూపించారు’.
మీ అభిప్రాయాలనూ, రచనలనూ స్వాగతిస్తున్నాం. రచనలు పంపవలసిన చిరునామా: సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34; ఫోన్: 040-23256000; మెయిల్: sakshisahityam@gmail.com