కొత్త పుస్తకాలు
భారతంలో బంధాలు
రచన: డాక్టర్ కడియాల జగన్నాథశర్మ; పేజీలు: 214; వెల: 150; ప్రతులకు: రచయిత, 12-11-1346/ఎ, బౌద్ధ నగర్, సికింద్రాబాద్- 61; ఫోన్: 9949353846
మహాభారతంలోని సమాజశాస్త్రంపై 35 ఏళ్ల క్రితం రచయిత పరిశోధన చేసి, డాక్టరేట్ డిగ్రీ పొందిన సిద్ధాంత వ్యాసానికి ‘ప్రధాన ఆవిష్కరణలకు భంగం కలగకుండా అనేక మార్పులు’ చేసి వెలువరించిన పుస్తకం ఇది. ‘ఈ గ్రంథంలో మహాభారత కాలంనాటి వివాహాచారాల్నీ, సామాజిక జీవనాన్నీ గురించి విశ్లేషించి వివరించడం జరిగింది’.
మార్క్సే నా టీచరు!
రచన: రంగనాయకమ్మ; పేజీలు: 184; వెల: 50; ప్రతులకు: అరుణా పబ్లిషింగ్ హౌస్, ఏలూరు రోడ్డు, విజయవాడ-520002; ఫోన్: 0866-2431181
‘నేను రాసేవి ‘‘మార్క్సిజం’’ నించి నేర్చుకున్న భావాలతోనే’, ‘మార్క్సు గ్రహించినది, హేతుబద్దమైనది. దానినే నేర్చుకుని, దానిని తేలికగా చెప్పాలనేది, నా ప్రయత్నం’ అంటున్నారు రంగనాయకమ్మ. అలా ఆ కోణంలో రాసిన 17 వ్యాసాల సంపుటం ఇది. తరిమెల నాగిరెడ్డి మీద వేసిన పుస్తకం గురించీ, ‘గర్భాల్ని అద్దెల కోసం కొనే-అమ్మే మహిళామణు’ల గురించీ రాసిన వ్యాసాలూ, ‘అంబేద్కరిస్టుల భ్రమలు’, ‘బహుజన బూర్జువా రాజ్యాధికారం వల్ల పేదరికాల-కుల విధానాల విముక్తి కల్ల’ వంటి వ్యాసాలూ ఇందులో ఉన్నాయి.
ప్రతాపరుద్రుడు
రచన: ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు; పేజీలు: 246; వెల: 150; ప్రచురణ: విజ్ఞాన సరోవర ప్రచురణలు; ప్రతులకు: రచయిత, 9-14/1, రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ, హైదరాబాద్-7;
ఫోన్: 8008950101
ఈ ‘చారిత్రక నవల’లో రచయిత ‘కాకతీయ రాజ్య వైభవాన్ని ఉద్విగ్న హృదయంతో వర్ణించారు. కాకతీయుల ఐశ్వర్యం, వారి పాలనలోని జనరంజకత, అనేక కళల వికాసం- నాట్యము, శిల్పము, చిత్రకళ, దేశీనృత్యరీతులు, జానపదుల వినోదాలు అన్నీ ప్రతాపరుద్రుని పట్టాభిషేక సందర్భంలో కళ్లకు కట్టినట్టు వర్ణించారు’.
కృష్ణార్పణం
రచన: వరిగొండ కాంతారావు; పేజీలు: 156; వెల: 130; ప్రచురణ: శ్రీలేఖ సాహితి; ప్రతులకు: వరిగొండ సూర్యప్రభ, 35-5-220, జీవన్ మిత్ర నగర్, విద్యారణ్యపురి, హనుమకొండ-506009; ఫోన్: 9441886824
ఈ పది కథల సంపుటి ‘అధిక్షేప భావజాల, సున్నిత హాస్యచతురోక్తులతో వెలువడినది’. కథల్లో ‘సింహభాగం మధ్యతరగతి సంసారాల చుట్టూ అల్లబడ్డాయి. వాటిలోనూ ముఖ్యంగా క్షమ, గయాశ్రాద్ధం, అంతిమం కథలు అత్తాకోడళ్ల సంబంధాలపై కేంద్రీకరించబడ్డాయి’.