నల్ల పిడికిళ్ల నవ సందేశం | Republican party black national people | Sakshi
Sakshi News home page

నల్ల పిడికిళ్ల నవ సందేశం

Published Thu, Jul 14 2016 1:38 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

నల్ల పిడికిళ్ల నవ సందేశం

నల్ల పిడికిళ్ల నవ సందేశం

ఈ ఉద్యమం అక్కడ మరొక నూతన కోణాన్ని ఆవిష్కరించింది. నల్లజాతి ప్రజలపైన  సాగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపైన రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను బహిరంగంగా సభల్లో నిలదీసి వాళ్ల వైఖరిని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థులను కూడా నిలదీస్తున్నారు. అందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపు తుండగా, రిపబ్లికన్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు.
 
 ‘అమెరికాలో ఏటా వందల మంది నిరాయుధులైన నల్లజాతి యువతీ యువకులను పోలీసులు కాల్చి చంపుతున్నారు. ఎంతమంది పోలీసుల చేతిలో చనిపోతున్నారో నిర్ధారించే నిర్దిష్టమైన లెక్కలు లేవు. శాంతిభద్రతల పేరుతో నల్లజాతి యువతీయువకులను పోలీసులు పొట్టన పెట్టుకుంటు న్నారు.’ 2015 జూన్‌లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిని నివేదించింది.
 
 పోలీసులు ఆయుధాలను విచ్చలవిడిగా వినియోగించడం వల్ల మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు, మనుషుల ప్రాణాలకు కనీస భద్రత, రక్షణ కరువయ్యాయని ఆమ్నెస్టీ ఆక్రోశించింది. స్వదేశీ చట్టాలనూ, ఐక్యరాజ్య సమితి నిబంధనలనూ కూడా అమెరికా పోలీసులు ఖాతరు చేయడంలేదనీ, వర్ణవివక్ష వల్లనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయనీ నివేదిక పేర్కొ న్నది. పోలీసు విధులకు సంబంధించి అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో అంత ర్జాతీయ నిబంధనలను అమలు చేయాలి.
 
 కానీ వాషింగ్టన్ (డిసి) సహా తొమ్మిది రాష్ట్రాల్లో విధి నిర్వహణలో పోలీసులు ఆయుధాలను వినియో గించడం పైన నిబంధనలు లేవు. పదమూడు రాష్ట్రాల్లో చట్టాలూ, శాసనాలూ చాలా లోపభూయిష్టంగానే ఉన్నాయి. ఇటీవల అమెరికాలో జరిగిన ఘటన లను ఇదే నేపథ్యం నుంచి పరిశీలించాలి. గత బుధవారం మినిసాంటాలో 32 సంవత్సరాల ఫిలాండో కాస్టిలె అనే నల్లజాతి యువకుడిని పోలీసులు కాల్చి చంపినట్టు తెలిపే వీడియోను ఆయన స్నేహితురాలు డైమండ్ రెనాల్డ్స్  సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఇది అమెరికాను కలచివేసింది. ఇందుకు నిరసనగా నల్లజాతీయులు వీధుల్లోకి వచ్చారు. ఇందులో భాగం గానే డాలస్ నగరంలో జరిగిన ప్రదర్శనలో ఒక నల్లజాతి యువకుడు ఐదుగురు పోలీసు అధికారులను కాల్చివేసాడు. ఇది అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ కాల్పులు జరిపిన ఇరవై అయిదు సంవత్సరాల యువకుడు మికా జాన్సన్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ ‘ఇటీవల జరిగిన పోలీసు హత్యలు నన్ను కలవరపరిచాయి. ఇది చేసింది శ్వేత జాతికి చెందిన పోలీసు అధికారులు. అందుకే ఆ తెగకు చెందిన అధికారులను లక్ష్యంగా ఎంచుకున్నాను.’ అని చెప్పారు. అయితే ఆ తరువాత పోలీసులు మికా జాన్సన్‌ను కూడా రోబోట్ ద్వారా కాల్చి చంపారు.
 
 నల్లజాతి యువతీయువకులపై జరుగుతున్న దాడులు, హత్యలకు నిరస నగా గత కొద్దిరోజులుగా అమెరికాలోని అన్ని నగరాల్లో ప్రదర్శనలు జరుగు తున్నాయి. ఈ ప్రదర్శనల్లో అనేక నినాదాలతో పాటు, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అన్న నినాదం ప్రత్యేకంగా కనిపిస్తున్నది. నిజానికి అది నినాదం కాదు, సంస్థ పేరు. ఇటీవలి కాలంలో విస్తృతంగా కొనసాగుతున్న పోలీసు హత్యలను నిరసిస్తూ అమెరికాలో వెల్లువెత్తిన ఉద్యమాలు గత అనుభవాలనుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపిస్తున్నది. అమెరికాలోని నల్లజాతి హక్కుల ఉద్యమకారులు ఈ ఉద్యమంలో సోషల్ మీడియాను చాలా శక్తిమంతంగా ఉపయోగించుకున్నారు.
 
 ఆ మీడియాని ఆయుధంగా వాడుకున్నారు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ను సంక్షిప్తంగా బి.ఎల్.ఎమ్. అని ప్రచారంలోకి తెచ్చారు. 2013 జూలైలో ఉద్యమం మొదలైనప్పటికీ, 2014 వేసవిలో ఇది ఊపం దుకున్నది. ఫెర్గుసన్‌లో మైఖేల్ బ్రౌన్, న్యూయార్క్ సిటీలో ఎరిక్ గార్నర్‌లను పోలీసులు కాల్చి చంపిన ఘటనలపై బి.ఎల్.ఎమ్. దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.  జార్జి జిమ్మర్ మాన్ అనే అధికారిని, నల్ల జాతీయుడైన ట్రేవాన్ మార్టిన్ హత్యకేసులో నిర్దోషిగా ప్రకటించడంతో బి.ఎల్.ఎమ్. ప్రస్థానం మొదలైంది. ‘నల్లజాతీయుల ప్రాణాలు కూడా ప్రాణాలే’ అనే సందేశంతో సోషల్ మీడియా అట్టుడికిపోయింది. అలిసియా గార్జా, పాట్రిస్సె కుల్లర్స్, వోపల్ టొమెటె అనే ముగ్గురు ఈ ఉద్యమ వ్యవస్థాపకులు. నల్ల జాతిలో నాయకత్వ లక్షణాలను, ఆత్మగౌరవాన్ని వృద్ధి చేయడానికి పని చేస్తున్న ‘బోల్డ్’ అనే సంస్థలో వీరంతా కలిశారు. ఆఫ్రికన్ - అమెరికన్ పౌరహక్కుల ఉద్యమం, బ్లాక్ పవర్ మూవ్ మెంట్, 1980 బ్లాక్ ఫెమినిస్ట్ ఉద్యమం, వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం, హిప్ హాప్, వాల్‌స్ట్రీట్ స్వాధీన ఉద్యమాల నుంచి తాము స్ఫూర్తి పొందినట్టు బి.ఎల్.ఎమ్. వ్యవస్థాపకులు ప్రకటించుకున్నారు.
 
 ఈ బృందంలో ఒకరైన అలిసియా గార్జా మొదటగా సోషల్ మీడియాలో పోస్ట్‌చేసిన నినాదాలలో ‘అవర్ లైవ్స్ మ్యాటర్-బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ కూడా ఒకటి. 2014 ఆగస్టులో ఫెర్గుసన్‌లో మైఖేల్‌బ్రౌన్‌ను కాల్చి చంపిన సంఘటనకు నిరసనగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఫ్రీడం రైడ్’ ప్రదర్శనను మొదటిసారిగా నిర్వహించారు. ఆ విధంగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే నినాదం ఉద్యమ నాదమైంది. దాదాపు అయిదు వందల మందికి పైగా పాల్గొన్న ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. 2014 నవంబర్‌లో అమెరికాలోని అన్ని రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో ఉన్న పెద్ద దుకాణాలు, మాల్స్ ఎదుట చేపట్టిన నిరసనలు కూడా అమెరికా ప్రజల్లో ప్రభావాన్ని కలుగజేసాయి.
 
 2015లో మేరిలాండ్‌లోని బాల్టిమోల్‌లో ఫ్రెడ్డిగ్రే హత్యానంతరం మరింత శక్తిమంతంగా ఈ ఉద్యమాన్ని నిర్వహించడానికి ఉద్యమకారులు పథకాలను రూపొందించారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రస్తావించుకోవాలి. పాత తరం నల్లజాతి ఉద్యమ నాయకులతో వీళ్లు తెగతెంపులు చేసుకున్నారు. ఉద్యమంలో చర్చి ప్రభావాన్ని  తగ్గించారు. రాజకీయ పార్టీలకు విధేయంగా ఉండే విధానాలను తిరస్కరించారు. మరొక ముఖ్య అంశం ఉద్యమాన్ని ప్రభావితం చేసే సాధనంగా సంగీతాన్ని ఎంచుకున్నారు. కెండ్రిక్ లామర్ అనే ప్రముఖ సంగీతకారుడు ఈ ఉద్యమానికి వెన్ను దన్నుగా ఉన్నారు. ఎన్నో సంఘటనలను వాళ్లు వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నల్లజాతి అనగానే నేరగాళ్లనే దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టడానికి సాంస్కృతిక రంగాన్ని ఉపయోగించుకుంటున్నారు.
 
 బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమ తాత్వికతను గురించి వ్యవస్థాప కులలో ఒకరైన అలిసియా గార్జా మాట్లాడుతూ, ‘నల్లజాతి ప్రజలు మానవ హక్కులను, పరువు, గౌరవాన్ని కోల్పోతున్న విధానాన్ని బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఎత్తిచూపుతున్నది. నల్లజాతిపైన జరుగుతున్న నరమేధాన్ని, వారు అనుభ విస్తున్న పేదరికాన్ని సమాజం ముందు ఉంచుతున్నది. దాదాపు పది లక్షల మంది నల్లజాతి ప్రజలు ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న క్రూర నిర్బంధం పిల్లలను, మహిళలను సైతం వెంటాడుతున్నది. వేటాడుతున్నది. వీటన్నింటిపైన నిరసనగానే ఈ ఉద్యమాన్ని నడుపుతు న్నాం’ అని వివరించారు.
 
 ఈ ఉద్యమం అక్కడ మరొక నూతన కోణాన్ని ఆవిష్కరించింది. నల్ల జాతి ప్రజలపైన  సాగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలపైన రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులను బహిరంగంగా సభల్లో నిలదీసి వాళ్ల వైఖరిని వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం పోటీపడుతున్న అభ్యర్థులను కూడా నిలదీస్తున్నారు. అందులో డెమో క్రటిక్ పార్టీ అభ్యర్థులు ఈ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతుండగా, రిప బ్లికన్ పార్టీ నాయకులు వ్యతిరేకంగా ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయ కులు, శ్వేతజాతి నాయకులు ఈ ఉద్యమాన్ని అతివాద ఉద్యమంగా ముద్ర వేసి విమర్శిస్తున్నారు. కేవలం నల్లజాతి ప్రజల జీవితాల గురించే మాట్లాడు తారా? మిగతా వాళ్లు మనుషులు కారా అని ప్రశ్నిస్తున్నారు.
 
 జాత్యహం కారంతో మాట్లాడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ప్రశ్నించిన బి.ఎల్.ఎమ్. కార్యకర్తపైన రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు భౌతిక దాడికి దిగారు. దానికి నిరసనగా మరొక చోట బి.ఎల్.ఎమ్. కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శనతో డొనాల్డ్ ట్రంప్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విమర్శ లన్నింటి కీ బి.ఎల్.ఎమ్. సమాధానం ఇచ్చింది. ‘నల్లజాతి ప్రజల జీవితాలు విలువైనవంటే, ఇతరులవి కావని కాదు. నల్లజాతిపై శ్వేతజాతీయుల ఆధి పత్యం, అధికారం కింద నలిగిపోకుండా ఉండాలని మేము కోరుకుంటు న్నాం’ అని స్పష్టం చేసింది.
 
అమెరికా నల్లజాతి ఉద్యమం ఒక నూతన పంథాలో పయనిస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవకాశాలను వాడుకోవడంలో విజయ వంతమైంది. సంఘటనలు జరిగిన వెంటనే స్పందించే విధంగా ఒక నెట్ వర్క్‌ను కూడా వృద్ధి చేసుకోగలిగింది. రాజకీయ నాయకత్వాన్ని నిలదీయడం వల్ల విధాన నిర్ణయాల వైపు, పాలనారంగంలో మార్పుల వైపు సరైన మార్పులు జరగడానికి అవకాశం చిక్కింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాతి నిధ్యం వహిస్తున్న పార్టీలు, అభ్యర్థులు అధికారులు ఎవరైనా ఆ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు, అణచివేతలకు బాధ్యత వహించాలని ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం మరొకసారి రుజువు చేసింది. ప్రపంచ దేశాల్లో వివక్షకు వ్యతిరేకంగా సాగుతోన్న వేనవేల ఉద్యమాలకు ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఒక నూతనోత్తేజాన్ని అందిస్తుంది.
 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు 97055 66213
 - మల్లెపల్లి లక్ష్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement