
సౌభ్రాతృత్వం తోటే ఉగ్రవాద నిర్మూలన
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ దాడిలో కన్నుమూసి రేపటికి పాతికేళ్లు. 1991 మే 21న విశాఖపట్నంలో సార్వత్రిక ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని అందరికీ వీడ్కోలు చెప్పి విమానాశ్రయం నుంచి మద్రాసుకు వెళ్లి అక్కడినుంచి రోడ్డుమార్గాన శ్రీపెరంబుదూరు ఎన్నికల సభకు వెళ్లిన రాజీవ్.. వేలాది ప్రజల సమక్షంలో దారుణ హత్యకు గురి కావడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి పర్చింది. వేదికపైకి వెళ్ళ డానికి ముందు అందరికీ గౌరవ సూచకంగా నమస్కారాలు పెడుతున్న సమయంలో ఎల్టీటీఈ ఆత్మాహుతి సభ్యురాలు రాజీవ్ గాంధీ కాళ్ళకు మొక్కి, ఆర్‌డీఎక్స్ బెల్ట్ బాంబును పేల్చింది.
ఒక్కసారిగా విస్ఫోటనం, హాహాకారాలు, ఆర్తనాదాలు, గాలిలో ఎగిరిపడిన శరీర భాగాలూ.. తునాతునకలుగా మారిన రాజీవ్ శరీరం. దేశమంతా విషాదం. ఆ ఆత్మాహుతి దాడిలో మరో 26 మంది చని పోగా, పలువురు గాయపడ్డారు. అది దేశం మొత్తం స్తంభించిన సమయం. తల్లి ఇందిరాగాంధీ మరణించిన తర్వాత ప్రధానిగా బాధ్య తలు స్వీకరించిన యువకుడు, మాజీ పైలట్, అందరూ అభిమానించే రాజీవ్ దుర్మరణం చెందారు. నాటి నుంచి మే 21ని దేశవ్యాప్తంగా ఉగ్ర వాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు.
ఉగ్రవాద మూకల దాడులు యావత్ ప్రపంచాన్ని నేడు మరింతగా అల్లకల్లోలం చేస్తున్నాయి. ఛాందసవాదులు, ఫ్యాక్షనిస్టులు, రకరకాల మతోన్మాదులు చేసే దాడుల్లో వేలాది గా మరణిస్తున్నారు. ఒకరిపై కక్ష, మరో దేశంపై పగ, కుల వివక్ష, మత విద్వేషం, సంచలనాలు సృష్టించడా నికి బాంబులు పెట్టడం, ఆధునిక మరతుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం. వంతెనలను కూల్చివేయడం, విమానాలను దారి మళ్లించడం, పాఠశాలల్లో పిల్లలను బంధించి పాశవికంగా చంపటం, ఎందరో అమాయకులు బలికావడం మనం రోజూ చూస్తున్నాం.
సైనికులు, పోలీసులు, ప్రజలు, పిల్లలు ఎవరినీ ఉగ్రవాదులు ఉపేక్షించటం లేదు. స్వర్ణదేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదుల తూటా లకు డజన్ల కొద్దీ భారత సైనికులు బలయ్యారు. 2008లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబై నగరంలో సాగించిన నరమేథం ప్రపం చాన్ని నివ్వెరపరిచింది. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంభినీ పార్క్‌లో, కోఠీలోని గోకుల్ చాట్ బండార్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 45మంది చనిపోగా ఎందరో అంగవికలురయ్యారు. చార్మి నార్ వద్ద మక్కా మసీదులో పేలిన బాంబులు ఎందరినో బలిగొ న్నాయి. ఇలాంటి దాడుల్లో క్షతగాత్రులు అనుదినం ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. మరోవైపు నిజాల్ని నిర్భయంగా రాసే జర్నలిస్టులను వధిస్తున్నారు. ఒకప్పుడు ఢిల్లీ వెళ్లాలంటే భయం వేసేది. ఎవరు ఎక్కడ టిఫిన్ బాక్సు బాంబులు పెడతారోనని భయం భయంగా ఉండేది.
దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా యువత ఎక్కువగా ఉగ్ర వాదానికి ఆకర్షితులవుతున్నారు. సరైన ఉపాధి లేకపోవటం, కుల తత్వం, అంటరానితనం, వివక్ష, అధికారుల అలసత్వం, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం, లంచగొండితనం, ఆకలి, అప్పులు, అవినీతి, అవిద్య, పేదరికం, అన్యాయాలు, మత ఛాందసవాదుల రెచ్చగొట్టే ప్రసంగాలు. రాజకీయనేతల స్వార్థం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి.
యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా చేయాలంటే ప్రభుత్వం అందరిదీ అనే భావన కల్పించాలి. ప్రభుత్వాలు పారదర్శ కంగా పనిచేయాలి. ఎడ్యుకేషన్ యాక్ట్ విధిగా అమలు చేయాలి. గుమాస్తా గిరికి దారి చూపుతున్న విద్యా వ్యవస్థను తీసివేసి స్వయం ఉపాధి కల్పించే విద్యను నేర్పాలి. బాల్యం నుంచే తరగతుల్లో అన్ని కులాలు, మతాలు ఒకటేనని బోధించాలి. నైతిక తరగతులను నిర్వహించాలి. ఎన్ని నిఘాలు, నిరోధక చర్యలు తీసుకున్నా ప్రపంచంలో ఉగ్రవాద చర్యలు ఇసుమంతయినా తగ్గని నేపథ్యంలో ప్రజల్లో సాభ్రాతృత్వాన్ని, సోదరభావాన్ని పెంచేలా సమాజ జీవనం మారాలి. అదే ఉగ్రవాదాన్ని అడ్డుకోగలదు. ఉగ్రవాద దాడుల్లో అసువులు బాసిన వారందరికీ అదే మనం ఇచ్చే ఘనమైన నివాళి.
(మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా)
ఏవీ పటేల్ ఈమెయిల్ : patel_vallabai@yahoo.co.in