మరపురాని సూపర్‌ పోలీస్‌ | Unforgettable super police | Sakshi
Sakshi News home page

మరపురాని సూపర్‌ పోలీస్‌

Published Sat, May 27 2017 3:41 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

మరపురాని సూపర్‌ పోలీస్‌

మరపురాని సూపర్‌ పోలీస్‌

జాతిహితం
స్థానిక పోలీసులు మాత్రమే ఉగ్రవాదంతో పోరాడగలరని గిల్‌ సిద్ధాంతం. సైన్యం, కేంద్ర బలగాలు దిగ్బంధనాలవంటి పనులకు సహాయపడతాయి. కశ్మీర్‌లో రాళ్లు రువ్వుతున్న వారితో సీఆర్‌పీఎఫ్‌ వ్యవహరిస్తున్న తీరుపై వారం క్రితం గిల్‌ విమర్శనాత్మకంగా మాట్లా డారు. ‘రాళ్లు రువ్వే గుంపులపై కాల్పులు జరపడానికి వీల్లేదు, మీరు వినూత్నంగా ఆలో చించాలి, కొన్ని సార్లు రక్షణాత్మకంగా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది’ అన్నారు. మీరు అంగీకరించినా, లేకున్నా ఆయనది సాంప్రదాయకమైన పద్ధతి మాత్రం కాదు.
 
కన్వర్‌ పాల్‌ సింగ్‌ (కేపీఎస్‌) గిల్, అత్యంత విశిష్టమైన తన సుదీర్ఘ జీవి తంలోలాగే మరణంలోనూ మన జ్ఞానానికి, స్థిరపడ్డ మన భావనలకు సవాలు విసురుతూనే ఉన్నారు. ఉదాహరణకు, సంస్మరణ కథనాన్ని రాసేటప్పడు కాలానుగత వివరాలతో మొదలెట్టి, వాటితోనే ముగించరాదనేదే ఏ జర్న లిజం పాఠశాలలోనైనా బోధించే మొట్టమొదటి సూత్రం. గిల్‌ గురించి రాసేట ప్పుడు ఆ సూత్రానికి కట్టుబడి ఉండటం ఎలాగో నాకు తోచడం లేదు. మేమంతా గిల్‌ సాబ్‌గా పిలిచే ఆయనను నేను మొదటిసారిగా కలుసుకున్న సన్నివేశం నా మదిలో ముద్రితమై అలాగే ఉండిపోయింది. ఎన్నటికీ నిలిచి పోయే ఆయన జ్ఞాపకాలలో అది కూడా ఒకటి. 1981 మొదట్లో ‘‘మండు తున్న’’ ఈశాన్యాన్ని గురించి రాయడానికి నేను గువాహతికి వెళ్లాను. అప్ప టికాయన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీ) కారు, పలువురు ఐజీలలో ఒకరుగా శాంతి భద్రతల విభాగానికి అధిపతిగా ఉండేవారు. 
 
పాత ‘‘అస్సాం తరహా’’ బంగ్లాలో యూనిఫాం ధరించి ఉన్న ఆయన తన మేజా బల్ల మీంచి చూపు పైకి మరల్చి, కొలుస్తున్నట్టు  ఎగా దిగా చూస్తూ  ‘‘ఓ, శేఖర్‌ గుప్తా నువ్వేనా?’’ అన్నారు. అప్పుడాయన చూసిన చూపు ఆసక్తితో కూడినదో లేక అవహేళనతో నిండినదో నేటికీ కనిపెట్టలేకపోయాను. ‘‘కూర్చోండి, మీరు ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిల్‌ మీద బాగా తిరుగుతున్నారని విన్నాను.’’ నేనింకా సర్దుకుని కూచోక ముందే, ‘‘లైసెన్స్‌ ఉందా?’’ అన్నట్టు చూశారు. ఆ తర్వాత 36 ఏళ్లూ ఆ చూపుకు అలవాటుపడ్డాను. ఓ క్షణం పాటూ నేను మ్రాన్పడి పోయాను, తర్వాత ఇద్దరమూ నవ్వుకున్నాం. ఆయన నవ్వులో ‘‘బోల్తా కొట్టించా’’ అన్న భావన ఉందనేది స్పష్టమే.
 
విడదీయరాని అనుబంధం
మా ఇద్దరి మధ్య అలా మొదలైన వృత్తిపరమైన అనుబంధం... అస్సాం, పంజాబ్‌ల మధ్య సమాంతరంగా సాగిన మా వృత్తిపరమైన పురోగతితో పాటూ పెంపొందింది. నేను పుట్టిన 1957లోనే ఆయన ఐపీఎస్‌ ఉత్తీర్ణులై అస్సాం క్యాడర్‌లో చేరారనేది మా అనుబంధం పెంపొందడానికి ఆటంకం కాలేదు. మా అందరిలోకీ ఎప్పుడూ ఆయనే ‘‘నవ యువకుని’’గా, శారీర కంగా దృఢంగా ఉండేవారు. ఆయనలా మద్యాన్ని తట్టుకోగల మనిషిని ఎవ రినీ చూడలేదు. 1995లో ఆయన పదవీ విరమణ చేశాక మా మ«ధ్య అను బంధం,  వ్యక్తిగత స్నేహంగానే ఎక్కువగా ఉండేది. మేం ఎక్కువగా మంచి సంగతులు పంచుకుంటుండేవాళ్లం.

అప్పుడప్పుడూ కొద్దిగా పోట్లాడుకునే  వాళ్లం కూడా. హాకీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు నాయకత్వం వహిస్తూ ‘‘బందీలను పట్టుకునే ప్రశ్నే లేదు’’ అనే తన వైఖరితో గిల్‌ ఆ క్రీడను నాశనం చేస్తున్నారని నా అభిప్రాయం. హాకీ, ఆయన నియంత్రణలోంచి బయటపడ్డ ప్పటి నుంచి మరింత మెరుగ్గా రాణించింది. రెండు వారాల క్రితం ‘‘వాక్‌ ద టాక్‌’’ ఇంటర్వూ్య కోసం కలుసుకున్నప్పుడు కూడా ఆయన.. మన హాకీ నేడు పునరుజ్జీవితం అవుతోందని రాసినందుకు నాకు చీవాట్లు పెట్టారు. స్నేహపూరితంగా మరోసారి మేం గొడవ పడ్డాం.
 
అస్సాంలో ఆయన గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని మంచివి, ఎక్కువ చెడ్డవి. అస్సాం ఆందోళనకారుడు ఖర్గేశ్వర్‌ తాలూకుదార్‌ను కొట్టి చంపేశారని ఆయనపై ఆరోపణ ఉండేది. ఆ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసింది. కాలక్రమేణా గిల్‌కు సంబంధిం చిన కథనాలలోని ఒక ప్రత్యేకాంశాన్ని గుర్తించాను. ఆయన ఎన్నడూ ఎవరి పైనా హింసకు పాల్పడలేదు, ఎన్నడూ తుపాకీ పట్టలేదు. చేతిలో ఊగుతుండే పోలీసు అధికారుల పేము బెత్తం (బ్యాటన్‌) మాత్రం ఉండేది. ఆయన నిర్భయ, ప్రశాంత చిత్తాన్నీ, సంక్షోభ పరిస్థితిని నియంత్రించడాన్నీ మేం దగ్గర నుంచి చూసినప్పుడు సైతం ఆయన చేతిలో ఆ పేము బెత్తమే ఉంది. మహా దురదృష్టకరంగా పరిణమించిన ఫిబ్రవరి 1983 అస్సాం ఎన్నికల సమ యంలోనే ఆ రాష్ట్రంలో మొదటి జాతి మారణకాండ సాగింది. బ్రహ్మపుత్రకు అవతల, గువాహతి నుంచి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న మంగల్‌దా య్‌లో ఆ «ఘటన జరిగింది. గిల్‌ అప్పుడు, సైనిక జీఓసీ (ఒక మేజర్‌ జన రల్‌)తో కలసి ఆఘటనపై ఉన్నత స్థాయి సమీక్ష చేస్తున్నారు. 
 
ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ పుణ్యమాని నేను, నా తోటి విలేకరి సీమా గుహతో కలసి దిగ్బం«ధించిన రహదారిని తప్పించుకుని అక్కడికి చేరుకున్నాం. అస్సాంలో త్వరగా çసూర్యా స్తమయం అవుతుంది. ఆ భేటీ ముగిసేసరికే చీకట్లు ముసురుకుంటున్నాయి. జీఓసీ, గిల్‌ తమ రక్షక బృందాలతో కలసి గువాహతికి బయలు దేరారు. మేం వారిని అనుసరించాం. హిమాలయాల్లోని ఒక నది ఒడ్డుకు చేరే సరికి ఆందోళ నకారులు వంతెనకు నిప్పు పెట్టడంతో ఆగాల్సి వచ్చింది. ఏం జరుగుతుందో మాకు అర్థమయ్యేసరికే అవతలి ఒడ్డు నుంచి రణగొణధ్వని చేస్తున్న గుంపు కనిపించింది, మలి సంధ్య వెలుతురులో కొన్ని కత్తులు, బల్లేలు తళుక్కున మెరిశాయి. అంత చిన్న రక్షణ బృందంతో వచ్చి నందుకు ఆ జనరల్‌ ఆగ్ర హంతో, ఎవర్నీ అని కాకుండా తిట్లు లంకించుకున్నారు. గిల్‌ మాత్రం ప్రశాం తంగా ఉన్నారు. తమ రక్షణ బృందాలను రక్షణ స్థానాల్లో మోహరించమని ఆదేశించారు, వారి వద్ద ఉన్న ఒకే ఒక్క ఎల్‌ఎమ్‌జీ (లైట్‌ మెషీన్‌ గన్‌) వైపు చూపారు. అప్పుడు కూడా ఆయన చేతిలో ఉన్నది ఆ పేము బెత్తమే.
 
చచ్చే టంతగా భయపడ్డ నేను ఆయన దగ్గరకు వెళ్లి సమస్య ఏమిటి అని అడిగాను. ఆయన నవ్వారు... అది ఆత్మవిశ్వాసమో, ఆసక్తో లేక అవహేళనో ఇప్పటికీ చెప్పలేను. ‘‘మీరు ఇక్కడ ఉండటమే సమస్య’’ అన్నారు. అంత కంటే వివ రించడానికి నిరాకరించి, మరెప్పుడైనా చెబుతాలే అనేశారు.  
 
నిరాయుధంగా, నిబ్బరంగా...
ఆ సాహసం, అద్భుతమైన అనే అర్థంలో తక్కువ నాటకీయంగా ముగి సింది. పొగలు వస్తున్న వంతెనను గిల్‌ బాగా పరిశీలనగా చూసి, జీపులోకి దూకి, డ్రైవర్‌ను పోనియ్యమన్నారు. సురక్షితంగా వంతెనను దాటేశారు. వంతెన మీద ఎక్కువ బరువు పడకుండా  మిగతావాళ్లం అంతా ఒకరి తర్వాత ఒకరం దాటాం... జనరల్‌ మొదట, మేం చివర. ఆ సాయంత్రం మేమంతా నోట్సు తీసుకోడానికి ఆయన ఇంటికి చేరాం. ఎప్పటిలాగే ఓల్డ్‌ మాంక్‌ రమ్‌ సేవిస్తూ మాట్లాడిన గిల్‌... మేం ఉండటమే సమస్య ఎలా అయ్యిందో అప్పుడు కూడా చెప్పలేదు. ఆ విషయాన్ని ఆయన చాలా కాలం తర్వాత పంజాబ్‌లో సీఆర్‌ పీఎఫ్‌కు ఐజీగా పనిచేస్తుండగా అమృత్‌సర్‌ సర్కూట్‌  హౌస్‌లో  చెప్పారు.

‘‘వేలాది సాయుధుల గుంపు నా ముందుంది. వాళ్లు ఒక ఐజీపీని, మేజర్‌ జనరల్‌ను చంపగలిగేతే ఏమౌతుందో మీరే ఊహించుకోవచ్చు. మా వద్ద ఉన్నదల్లా ఏడు రైఫిళ్లు, ఒక ఎల్‌ఎమ్‌జీ. మేం కాల్పులు జరపాల్సి వచ్చి ఉంటే వందల్లో కాకపోయినా పదుల్లో చనిపోతారు. ఇద్దరు పాత్రికేయులు దాన్ని చూడాలని నేను కోరుకుంటానా?’’ నిజంగా అదే ఆనాటి సమస్య అన్నారు. వారం క్రితం ‘‘వాక్‌ ద టాక్‌’’ ఇంటర్వూ్య కోసం కలుసుకున్నప్పుడు ఆయన కశ్మీర్‌లో రాళ్లు రువ్వుతున్న వారితో సీఆర్‌పీఎఫ్‌ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శనాత్మకంగా మాట్లాడారు. ‘‘రాళ్లు రువ్వే గుంపులపై కాల్పులు జరపడా నికి లేదు,’’ మీరు వినూత్నంగా ఆలోచించాలి, కొన్నిసార్లు రక్షణాత్మకంగా కూడా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. మీరు అంగీకరించొచ్చు లేదా కాదని వాదించొచ్చు గానీ, ఆయనది సాప్రదాయకమైన పద్ధతి మాత్రం కాదు.
 
ఉగ్రవాద పోరులో విలక్షణ శైలి
సిక్కులను విచక్షణారహితంగా చంపారని ఆయన విమర్శకులు అంటుం టారు. కానీ అది గిల్‌ శైలి కాదు. నిజానికి, 1991–94 మధ్య జరిగిన అంతిమ పోరాటంలో ఆయన నాయకత్వంలో లేని సాధారణ మిలిటెంట్లను విడిచి పెట్టారు. వారు కొత్త గుర్తింపులతో స్థిరపడటానికి, తరచుగా కొత్త గుర్తింపు లతో సుదూర రాష్ట్రాలలో వ్యాపారాలు పెట్టుకోడానికి సహాయ పడ్డారు. సత్నామ్‌ సింగ్, సంతోష్‌ సింగ్‌గా మారాడు. అయితే అది వాళ్లు తమ కమాం డర్లను పట్టుకోడానికి సహకరించినంత వరకే. ఆయన పోలీసులు ఉగ్రవాదు లను ఏ నుంచి డీ వరకు నాలుగు వర్గాలుగా విభజించారు. మా ‘‘ఏ’’  వర్గం జాబితాకు ఎక్కిన వారు ఆరు నెల్లకు మించి బతికి  బట్టకట్టలేరని ఉగ్రవాదులు నమ్మేట్టు చేయగలిగితే చాలు, ఉగ్రవాదం అంతమైపోతుంది. అదే జరిగింది. 
 
ఎవరైనా మరణించినప్పుడు నివాళి అర్పించే రోజున ఆయన తన పనిని ఎలా చేశారనే దానిపై లోతైన విశ్లేషణ సముచితం కాదు. సుదూరంలోని అస్సాంలో ఆయన పని చేసిన కాలానికి భిన్నంగా, ఆ తర్వాత పంజాబ్‌లో పని చేసిన కాలం డాక్యుమెంట్లుగా మరింత ఎక్కువ భద్రంగా ఉంది. స్థానిక పోలీసులు మాత్రమే ఉగ్రవాదంతో పోరాడగలరనేది ఆయన సిద్ధాంతం. సైన్యం, కేంద్ర బలగాలు వెలుపల దిగ్బంధనాలను చేయడం వంటి పనులకు సహాయపడతాయి. ‘‘నా పోలీసుల్లో ఎక్కువ మంది జాట్లే. మంచి జాట్లు చెడ్డ జాట్లతో పోరాడకపోతే’’ పంజాబ్‌లో మనం గెలవగలిగేవాళ్లం కాం.

ఆయన వారిని ఉత్తేజితం చేయగా, రాజేష్‌ పైలట్‌ (నాటి అంతర్గత భద్రత శాఖ సహాయ మంత్రి) ద్వారా పీవీ నరసింహారావు ప్రభుత్వం తగినన్ని వన రులను సమకూర్చింది. గిల్‌ వందలాది ‘సమాచార వనరులు, అస్తుల’ (ఇన్‌ ఫార్మర్ల్ల) పునరావాసానికి సహాయపడటమే కాదు, తన కీలక అధికారులు తర్వాతి కాలంలో మానవ హక్కుల కేసులను ఎదుర్కోవడానికి అవసర మయ్యే లీగల్‌ డిఫెన్స్‌ కోసం తగినన్ని నిధులను పొదుపు చేశారు కూడా. ఆయన మనకు ‘‘కండోమ్‌’’ సిద్ధాంతాన్ని బోధించారు. ‘‘చూడు తమ్ముడూ, ప్రభుత్వానికి మనం కండోమ్‌లంతే ఉపయోగకరం. పని అయిపోయిన వెంటనే తీసి అవతల పారేస్తారు’’ అనే వారాయన.
 
ఒక మందు పార్టీలో ఒక మహిళా ఐఏఎస్‌ అధికారితో అభ్యంతరకరంగా వ్యవహరించినందుకు ఐపీసీ 354 సెక్షన్‌ (ఒక మహిళ గౌరవానికి భంగ కరంగా ప్రవర్తించడం) కింద ఆయన నేరారోపణకు, శిక్షకు గురయ్యారు. చివరకు సుప్రీంకోర్టు ఆయన శిక్షను జరిమానాకు, మద్య నిషేధంపైనా, పార్టీలలో మద్యం సేవించడంపైనా ఒక ఉపన్యాసానికి తగ్గించి, క్షమించింది. ఆయన ఆ సలహాను పాటించారా? ఆయన జీవించి ఉండగా ఏదైనా న్యాయ స్థానంలో నన్నీ ప్రశ్న అడిగి ఉంటే నిజంగానే సందిగ్ధంలో పడి ఉండే వాడినే. కానీ ఇప్పడు నేను ఆయన బాగా తాగి మొదటిసారిగా నాతో చెప్పిన విష యాన్ని గుర్తు చేసుకుంటాను ‘‘ఒక్క చుక్క బౌద్ధ సన్యాసిని ఇలా సిప్పు చేసి ఇష్ట దైవ ప్రార్థన చేయడంతోనే అలా నీ సందేహాలు, భయాలు, సందిగ్ధాలు అన్నీ మటుమాయం అయిపోతాయి.’’ గిల్‌ ప్రస్తావించినది ఓల్డ్‌ మాంక్‌ రమ్మేనని మీకు ఎలాగూ అర్థమవుతుంది.
శేఖర్‌ గుప్తా
twitter@shekargupta 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement