
వట్టికోట ఆళ్వారుస్వామి
పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి బాల్యం లోనే భిక్షాటనతో బతుకు కష్టాలను వడపోసి తెలుగు నేల గర్వించదగిన రచయితగా ఉన్నత శిఖ రాలకు చేరుకున్న వట్టికోట ఆళ్వారు స్వామి 1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా, సూర్యాపేట సమీ పంలోని చెరువు మాధవరం అనే కుగ్రామంలో నిరు పేద కుటుంబంలో జన్మించారు. బాల్యంలోనే వంట పని, ఇంటి పని చేస్తూ తెలుగు చదవడం, రాయడం నేర్చుకున్నారు. యుక్తవయసు రాగానే విజయవాడ చేరి హోటల్ కార్మికునిగా పనిచేస్తూ సమీపంలోని గ్రంథాలయాల ద్వారా ఎనలేని విజ్ఞానాన్ని సంపా దించారు. అదీ ఎక్కువ రోజులు సాగక పొట్ట చేతబ ట్టుకుని 1933లో హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అక్కడ గోల్కొండ పత్రికలో చేరడం ఆయన జీవి తంలో అనుకోని మలుపు. ఆ పత్రికలో ప్రూఫ్ రీడ ర్‌గా పనిచేస్తున్నప్పుడే బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప రెడ్డి వంటి ఎందరో ఉద్దండులతో పరిచయాలు కలిగి వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై ఇష్టా గోష్టులతో గడపటం సాధ్యమైంది. ప్రూఫ్ రీడర్ నుంచి పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, కథ, నవలా రచయితగా, గ్రంథాల యోద్యమ నిర్మాతగా తెలుగు భాష, సాంస్కృతికో ద్యమాల విస్తృతికి ఊపిరులూదారు. అన్ని వాదా లను తన సాహిత్యంలో ఇముడ్చుకుని మానవతా వాద రచయితగా బహిరంగంగా హెచ్చరించిన ప్రథమ వ్యక్తి ఆళ్వార్ స్వామి.
ఆ రోజుల్లో నిజాం నవాబు అకారణంగా రిక్షాలను నిషేధించడంతో, రిక్షా కార్మికోద్యమాన్ని నిర్మించి సమస్యను సామర స్యంగా పరిష్కరించారు. కుటుంబంలో స్త్రీ అను భవించే కష్టాలపై వట్టికోటకు స్పష్టమైన అవగాహన ఉందనడానికి ఆయన రచించిన ‘ఆలు కూలి’ అన్న కథ అద్దం పడుతుంది. జంట నగరాల్లో ఎలాంటి వసతులు లేకుండా నెలకు ఒక్కరోజు సెలవుతో అష్ట కష్టాలు పడుతున్న గుమాస్తాలను సమైక్యపరచి సం ఘాన్ని స్థాపించడమే కాక వారికోరోజు సెలవును కూడా సాధించిన ఘనత ఆళ్వారు స్వామికే దక్కు తుంది. అదేకాలంలో ‘గుమాస్తా’ అన్న పత్రికను కూడా నడిపారు. తెలంగాణలో దోపిడీకి గురవుతు న్న ప్రజలను చైతన్యపరచడానికి ‘ప్రజల మనిషి’ అన్న నవల రాశారు. తెలంగాణ పోరాటంపై ఈ నవల ప్రభావం ఎనలేనిది. 1942లో కాంగ్రెస్ కార్య కర్తగా జైలుకెళ్ళిన వట్టికోట, 1946 నుంచి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా జైలు జీవితం అనుభవించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం. జైలు అనుభవాన్ని అనేక కథలుగా మలచి, ఒక సం పుటాన్ని ప్రచురించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య హత్యోదం తంపై ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పరిశోధనాత్మక నివేదికను వెలువరించారు. గద్వాల్ దర్బార్‌లో మహారాణి సమక్షంలో ప్రజల ఇక్కట్లను, పాలకుల దురాగతాలను కళ్లకు కట్టేలా వివరించారు. మీజాన్ పత్రిక ద్వారా విసునూరు దేశ్‌ముఖ్‌ను తూర్పార పట్టారు. ప్రతి ఒక్కరిలోనూ ఆత్మీయతానురాగా లతో నవసమాజ నిర్మాణానికై తపించిన విప్లవ వైతాళికుడు వట్టికోట 1961 ఫిబ్రవరి 5న కన్ను మూశారు. అణగారిన జనం సంక్షేమానికి జీవితాన్ని అర్పించిన మానవతావాది ఆయన. హైదరాబాద్ లో సెంట్రల్ లైబ్రరీకి, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు ఆళ్వారు స్వామి పేరుపెట్టడం సమంజసం, ప్రభుత్వం ఆయ న పేరిట ఫ్రీలాన్స్ జర్నలిస్టు అవార్డును ఏర్పాటు చేయాలి. నేటి ఆళ్వారుస్వామి శత జయంతి ఉత్సవ సభలను తెలుగు రాష్ట్రాలలో అన్ని మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలి. తద్వారా నేటి యువతలో దేశభక్తి, జాతీయభావం వెల్లివిరు స్తుంది.
(నేడు వట్టికోట ఆళ్వారుస్వామి 54వ వర్ధంతి)
డా॥శ్రీనివాస్ కంకటపాలెం, బాపట్ల Email: drsskkp@gmail.com