చదువుకున్నవాళ్ల మేధావితనం | Kathasaram About Vattikota Alwar Swamy Pathituni Hrudayam | Sakshi
Sakshi News home page

చదువుకున్నవాళ్ల మేధావితనం

Published Sun, May 24 2020 11:30 PM | Last Updated on Sun, May 24 2020 11:32 PM

Kathasaram About Vattikota Alwar Swamy Pathituni Hrudayam - Sakshi

‘‘అంతా వచ్చారా? ఏం, మగ్గాల చప్పుడు కావడం లేదే’’ అంటూ అధికార ధ్వనిలో డఫేదారు తిరుపతయ్య నేతశాలలో ప్రవేశించి లోపలనున్న ఖైదీలను లెక్కించసాగాడు.
అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, ఆనాడు ఉదయం ఉరి తీయబడ్డ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న ఖైదీలు తిరుపతయ్య రాగానే తమ స్థానాలలోకి వెళ్లి కూర్చున్నారు.
‘‘గండయ్య రానట్టుందే?’’ తిరుపతయ్య ప్రశ్నించాడు.

‘‘రాలేదు సార్‌’’ ఒక ఖైదీ జవాబిచ్చాడు.
‘‘ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదు; ఎప్పుడూ ఎక్కడో తిరుగుతుంటాడు. ఎక్కువ శిక్షవాడని నేను కొంచెం చనువుగా మెదులుతుంటుంటే అధికారులతో నాకు మాట తెచ్చే లాగున్నాడు,’’ అంటూ నేతశాల వదిలి ‘‘మగ్గాలు ఆడనివ్వండి’’ అని ఆజ్ఞాపించి గండయ్య కొరకు బయలుదేరాడు తిరుపతయ్య.

తిరుపతయ్య అటుపోగానే ఖైదీలు మళ్లీ మాటల్లో పడ్డారు.
‘‘చూచావుర! తిరుపతయ్య ముఖంలో ఇంతన్నా విచారముందో!’’
‘‘విచార మెందుకుర? వాడెవడు, వీడెవడు?’’
‘‘పాపము! ఉరితీసిన సంగతి అతని వాండ్లకు తెలుపుతారో, లేదో’’
‘‘తెలిసికొని మాత్రము ఎవరు ఏం చేస్తారు? వచ్చిన దగ్గరకు చేరుకున్నాడు.’’
‘‘అది కాదు కాని, ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి, ఉరిపెట్టి వేలాడతీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్తూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్లకెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి కూడ మనసొప్పలేదురా!’’
‘‘ఏమి వగలమారి మొగోడివిరా. రేపు నీకు జవాను కొలువిచ్చి ఉరి తీయమంటె తీయక ఏం చేస్తావు? ఖానూను ప్రకారం ఎవరైనా చేయాల్సి వస్తుందోయ్‌. ఖానూనంటే ఏం పిలకాయలాటనుకున్నావా?’’

ఈ విధంగా ఖైదీలు చర్చించుకుంటుండగా తిరుపతయ్య గండయ్యను వెంటబెట్టుకొని నేతశాలకు వచ్చి, మగ్గాల పని ఆగి ఉండుటను చూచి ‘‘మీకేమైంది ఈరోజు పని బొత్తిగా చేయడం లేదు. చెప్తున్నాను బాగా వినండి, మీ అందరిని దొర దగ్గరకు తీసికెళ్లి నిలబెడ్త,’’ హెచ్చరించాడు తిరుపతయ్య.
తిరుపతయ్య వెనుక నిలబడి విచారంతో తల నేలకు వేసివున్న గండయ్య ‘‘దొర దగ్గరికెందుకు? ఉరి దగ్గరికి తీసుకెళ్లరాదు?’’ అంటూ కండ్లనీరు తుడుచుకున్నాడు.
గండయ్య కంటినీరు చూడగానే తిరుపతయ్య చలించిపోయాడు. ‘‘ఈవాళ గండయ్య నాటక మాడుతున్నాడే. ఆడదానిలాగ ఏడ్వటం మొదలుపెట్టాడు. ఒకసారైనా వాడి ముఖం చూచావో లేదో వాడు చస్తే చుట్టం చచ్చినట్టు ఏడుస్తావెందుకు?’’ తిరుపతయ్య టోపీ కిందబెట్టి బీడీ కాలుస్తూ అడిగాడు.

‘‘మా ఖైదీలకు చుట్టాలము మేము కాకపోతే నీవవుతావా? తిరుపతయ్య, పిల్లలు గలవాడివి, సంసారం చేస్తున్నావు కూడా. 25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లికొడుకోలె పట్టుకెళ్లి స్తంభాని కేలాడదీయడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీకు కోపమొస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!’’ అని గండయ్య గంభీరంగా అన్నాడు.
‘‘పిచ్చోడా, నేను కాకపోతే ఇంకోడు తయారవుతాడు ఈ పనికి. ఉరితీయడానికి మనుషులు లేక ఉరితీయడం ఆగిపోతుందనుకున్నావా?’’ తిరుపతయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ముసిముసిగా నవ్వుతూ.

‘‘నీ సంగతే కాదు నేను అనేది, ఉరితీసే వాండ్ల గురించే అడుగుతున్నాననుకో. ఎవడు తీశాడో ఈ పద్ధతిగాని ఉరి తీసిందానికంటే 50 ఏండ్లో 60 ఏండ్లో జైల్లో ఉంచింది మంచిది,’’ గండయ్య అన్నాడు.
‘‘లేకుంటే నీ పద్ధతి అంటే, నీ గ్యాంగు పద్ధతితో చేస్తే యింకా బాగుంటుందిరా?’’ అంటూ హేళనగా నవ్వాడు తిరుపతయ్య.
‘‘తిరుపతయ్య సార్‌! మాకంటే నీవు మెరుగని సంతోషిస్తున్నావ్‌. నీవేమైనా అనుకో, మనసు మండి అనేస్తున్నాను. మేము తప్పు చేస్తే జైలుశిక్ష వేసిన వాండ్లు ఒక మనిషిని ఉరి తీసినవాడికి కూడా కఠినశిక్ష వేస్తే బాగుంటుంది’’ గండయ్య కోపంతో అన్నాడు.

‘‘నేను ఖానూను ప్రకారము ప్రభుత్వ ఆజ్ఞతో ఉరితీశాను తెలుసా! నన్నెవరు శిక్షిస్తారు? సరే కాని, మాటలు చాలా అయినవి. యిక పోయి మగ్గము మీద కూర్చోపో. దొర వచ్చే వేళైంది,’’ అంటూ తిరుపతయ్య డ్రెస్‌ సదురుకొంటూ గేటు వద్ద నిలుచున్నాడు.

‘‘నేను ఇవాళ దొరను కూడా అడుగుతా, ఏమైనాగాని ఇంత అన్యాయంగా ఉరి తీయడం బాగాలేదని,’’ అని గండయ్య కూడా తిరుపతయ్య పక్కన నిలుచున్నాడు.
తిరుపతయ్య కోపంగా నటిస్తూ ‘‘ఒరే! నీకు సిగ్గెందుకు లేదు? నీవు, మీ గ్యాంగువాళ్లు కలిసి ఎంతమంది ప్రాణాలు తీసారురా? ఎంతమంది పెండ్లిండ్లను ఎత్తగొట్టారురా? ఎన్ని కొంపల్ను నాశనం చేశారురా? అటువంటి నీవు ఎవరినో ఉరి తీసినందుకు ఏడుస్తున్నావు? ఏమేమో వాదిస్తున్నావా? పైగా దొరను అడుగుతాడట దొరను. ఎప్పుడైతివి పత్తిత్తువు’’ అని గట్టిగా మందలించాడు తిరుపతయ్య.

గండయ్య కడుపులోని దుఃఖము ఇప్పుడు రౌద్ర రూపము దాల్చింది. తానొక ఖైదీనని, అధికార సిబ్బందిలోని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాననే సంగతే మరిచిపోయాడు. ఉగ్రుడై ‘‘మాటిమాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప తాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారు ముండలతో కాలము గడిపే మేము ఒళ్లు మరిచి ప్రాణాలు తీశాం. దార్లు కొట్టి పెండ్లి పిల్లలపై నగలు అపహరించాం, ఇండ్లలో జొరబడి దోచుకున్నాం, మత్తు దిగిం తర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాప పడ్తాం. మేము చదువురాని మొద్దులం, మాలో చదివినోడుగాని, మంచి చెడ్డ తెలిసినోడుగాని ఒకడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం, వాండ్లలో తిరిగాం, అవే బుద్ధులు, అదే బతుకు.

ఇప్పటికైనా మమ్ముల ఈ పనినుండి మాన్పించి, మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తయారు చేయడానికెవరైనా ముందుకొస్తే మా గ్యాంగు మాటేమోగాని నా వరకు నేను సిద్ధంగా ఉన్నాను.
మరి నీ సంగతేమంటావు? ఏదో ఖానూను ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగు చేయ తలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్ల నుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది? తిరుపతయ్య సార్‌!’’ గండయ్య గుడ్లెర్రజేసి గట్టిగా అడిగాడు.

తిరుపతయ్య వింతగా గండయ్య వైపు చూస్తూ, ‘‘ఒరే! నీకు పిచ్చి లేసేటట్టున్నదిరా పో! లోపలికి పో! దొర వస్తున్నాడు’’ అంటూ తిరుపతయ్య క్రమశిక్షణతో నించున్నాడు. గండయ్య కూడా దూరంగా నిలుచొని జేలరు వచ్చే వైపు చూస్తున్నాడు.
జేలర్, జేలర్‌ వెంట జమేదార్‌ గేటు లోపలికి ప్రవేశించగానే జమేదారు రౌద్రముతో గండయ్య నుద్దేశించి, ‘‘ఏమిరా? నీవు ఈ రోజు గంజి తీసుకోలేదేం?’’
గండయ్య జేలరుకు దండం పెట్టి ‘‘అయ్యా! ఉరితీసినప్పటి నుండి నాకు కడుపులో ఎట్లాగో వుంది. నాకెటు తోచడం లేదు. మీరు చదువుకున్నోరు కూడా ఇటువంటి పనులు చేస్తే ఇక మా సంగతి ఎవరు అడుగాలె’’ అని గండయ్య ప్రశ్నించాడు.
జమేదారు అధికార ధ్వనితో ‘‘నీవు గంజి త్రాగుతావా లేదా?’’ అని గర్జించుచూ ఓరకంటితో జేలరు వైపు చూచాడు.
జేలర్‌ అయోమయ స్థితిలో కపట బింకంతో తలనాడించాడు.
‘‘తాగను సార్‌!’’ గండయ్య నిర్భయంగా జవాబిచ్చాడు.
‘‘ఒంటిగదిలో మూసేసి తర్వాత నా వద్దకు తీసుకొని రండి. వాడికి మంచి బుద్ధి చెప్పితే రోగం కుదురుతుంది. గంజి తాగుతాడు. చదువుకున్నోళ్ల సంగతి తెలుస్తుంది’’ అంటూ వెళ్లిపోయాడు జేలరు.

వట్టికోట ఆళ్వారు స్వామి
వట్టికోట ఆళ్వారు స్వామి (1915–1960) కథ ‘పతితుని హృదయం’ ఇది. 1952 నాటి ఆయన జైలు కథల్లో సంకలనమైంది. ఉరితీసే శిక్షాస్మృతి స్వభావాన్ని ప్రశ్నించే కథ. తెలంగాణ వైతాళికుడు వట్టికోట. నైజాం పాలనను వ్యతిరేకించి జైలు జీవితం గడిపినవారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ప్రజల మనిషి, గంగు ఆయన ప్రసిద్ధ నవలలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement