విజయవాడ పై ఒక ‘వైతాళిక’ రచన | Vijayawada is one of the 'Pioneer' writing | Sakshi
Sakshi News home page

విజయవాడ పై ఒక ‘వైతాళిక’ రచన

Published Sun, Oct 4 2015 4:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:23 AM

విజయవాడ  పై ఒక ‘వైతాళిక’ రచన

విజయవాడ పై ఒక ‘వైతాళిక’ రచన

రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసిక పార్శ్వం కూడా ఉంటుంది.
రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం ఉంటుంది. రాజధాని సుందరికి దేహపుష్టితో పాటు చక్కని నడక, నాజూకు కూడా అవసరమే.
కానీ మీడియా, ఇతర మేధావి వర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు.

 
 ‘మొన్నటివరకూ తెలుగువాళ్లకు తమదంటూ చెప్పుకోదగిన ఓ మహానగరం లేదు. నగరం లేకపోతే నాగరికత ఎలా వస్తుంది?’ అనేవారు రాంభట్ల కృష్ణమూర్తి. ఇప్పుడు తెలుగువాళ్లకు రాజధాని రూపంలో మరో మహానగరం రాబోతోంది. దానిని ‘అమరావతి’ అనే అందమైన, చారిత్రక స్ఫురణ కలిగిన పేరుతో పిలవబోతున్నా దానికి విశాలమైన దేహాన్ని కల్పించబోయేది మాత్రం విజయవాడే. ఇక్కడో విచిత్రం ఉంది. ‘అమరావతి’ అనే రాజధానిలో విజయవాడ వెళ్లి కలసిపోవడం లేదు. రాజధాని నగరమే విజయవాడలో కలసిపోబోతోంది. ఈవిధంగా విజయవాడ రెండు ‘త్యాగాలు’ చేయబోతోంది. మొదటిది, ‘రాజధాని’ అని ఘనంగా చెప్పుకునే అవకాశాన్ని అది అమరావతికి ధారపోస్తోంది. రెండోది, ఇంద్రుడికి ఆయుధం కావడం కోసం దధీచి వెన్నెముకను అర్పించినట్టుగా, రాజధాని కోసం విజయవాడ తన దేహాన్ని అర్పిస్తోంది.

 అయితే, తను చేయబోతున్న త్యాగాల గురించీ, రాజధాని ప్రాంతంగా తను సరికొత్త రూపురేఖల్ని తెచ్చుకోబోవడం గురించీ విజయవాడ నగరానికి ఇప్పటికీ తెలిసినట్టు లేదు. పూర్వం బాల్యవివాహాలు చేసేవారు. పెళ్లన్నా, పెళ్లికూతురు ముస్తాబన్నా ఏమీ తెలియని వయసు కనుక; అలంకారానికి యాంత్రికంగా ఒళ్లు అప్పగించడం తప్ప రేపు తన రూపు ఎలా మారుతుందో, పెళ్లి తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో బాలవధువుకు ఏమీ తెలియదు. పైగా మన పెళ్లిళ్లు చాలావరకూ అర్ధరాత్రి ముహూర్తాల్లోనే కనుక ఆ చిన్నారి  నిద్రలో జోగుతూ ఉంటుంది. రాజధానీ అవతరణ పూర్వ సంధ్యలో ఇప్పుడు విజయవాడ కూడా అలాగే జోగుతున్నట్టుంది.

 ఏ జాతి చరిత్రలోనైనా రాజధాని నిర్మాణం ఒక ఉజ్వలఘట్టం. ఒక ఉత్తేజకర సందర్భం. ఎన్నో కలలు, ఊహలు, ప్రణాళికలతో మనసులు కిక్కిరిసిపోయి తబ్బిబ్బు పడాల్సిన సమయం. రాజధాని నిర్మాణమంటే కేవలం భూసేకరణ కాదు; రియల్ ఎస్టేట్ పుంజాలు తెంచుకోవడం కాదు; ప్రభుత్వం ఏదో చేసేస్తుంటే జనం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిన ఘట్టం అసలే కాదు; సమాజం తాలూకు సర్వాంగాలూ కొత్త రక్తం నింపుకుని సరికొత్త ఉత్సాహంతో పాలుపంచుకోవలసిన సన్నివేశం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ సందడి కనిపించడం లేదు. రాజధాని కేవలం భౌతికం కాదు, దానికో మానసికపార్శ్వం కూడా ఉంటుంది. రాజధాని కేవలం రాజకీయ సంబంధి కాదు, దానికి సాంస్కృతిక కోణం ఉంటుంది. రాజధాని సుందరికి దేహపుష్టితో పాటు చక్కని నడక, నాజూకు కూడా అవసరమే. కానీ మీడియా, ఇతర మేధావి వర్గాలకు సైతం ఇది పూర్తిగా అర్థమైనట్టులేదు.

 అర్థమయ్యుంటే ఈ వర్గాల దృష్టి ఇప్పటికే విజయవాడ మీద ఫ్లడ్ లైట్ కాంతితో పడి ఉండేది. ఈ నగర చరిత్రేమిటి, దీని కథేమిటి, దీని ప్రస్తుత స్థితిగతులు ఏమిటి, దీనికున్న హంగులూ, అవకాశాలూ ఎలాంటివి, రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి దీనికి ఇంకా ఏమేం కావాలి సహా అనేక ప్రశ్నల్లోకి ఇప్పటికే లోతుగా తలదూర్చి ఉండేవి. కనీసం విజయవాడ మీద చిన్నవో, పెద్దవో పుస్తకాలైనా ఈపాటికి మార్కెట్‌ను ముంచెత్తి ఉండాలి. ఆ దాఖలాలు లేవు. అయితే, ఇంత ఎడారిలోనూ ఒక ఒయాసిస్... అది, జాన్సన్ చోరగుడి వెలువరించిన ‘మన విజయవాడ’.

 తెలుగునాట అభివృద్ధి - సామాజిక అంశాలను ‘కాలికస్పృహ’తో విశ్లేషించి వ్యాఖ్యానించే కొద్దిమంది సీరియస్ రచయితల్లో జాన్సన్ చోరగుడి ఒకరు. విజయవాడపై తను చేసిన రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ ‘మన విజయవాడ’ పేరుతో తొలి ముద్రణను ఆయన 2000 సంవత్సరంలోనే ప్రచురించారు. ప్రస్తుత రాజధాని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని, దానికే మరికొన్ని అంశాలు జోడిస్తూ పునర్ముద్రించారు. ఆవిధంగా ఈ పుస్తకానికి ఒక ‘వైతాళిక’ (మేలుకొలుపు) స్వభావం వచ్చింది.

 విజయవాడను ‘కలర్‌ఫుల్’గా కాకుండా ‘బ్లాక్ అండ్ వైట్’లో చూపించడానికి జాన్సన్ ప్రయత్నించారు. నేటి తీరుతెన్నులను ఎత్తిచూపుతూ మెత్తని వాతలూ పెట్టారు. నైసర్గికంగా విజయవాడ ఉత్తర, దక్షిణాలకు కూడలి అవడం వల్ల మొదటినుంచీ వర్తక కేంద్రంగానే ఉంటూ వచ్చిందనీ, ఆ విధంగా ‘వెచ్చాలవాడ’ అయి, క్రమంగా ‘వెచ్చవాడ’, ‘బెజవాడ’ అయిందని ఆయన అంటారు. క్రీ.శ. 10-11 శతాబ్దులలో విజయవాడ వేంగీ చాళుక్యుల ఏలుబడిలో ఉన్నప్పుడు రాష్ట్రకూటులు, వారి వత్తాసుతో రెండవ యుద్ధమల్లుడు జరిపిన దండయాత్రలతో విజయవాడ ఓ పెద్ద రణరంగంగా మారి అరాచక శక్తులకు ఆటపట్టు అయిందనీ; అప్పటినుంచీ ఆ అరాచక స్వభావం కొనసాగుతూ ఉండడం విజయవాడ ప్రత్యేకత అనీ అంటారు.

పంచాయతీగా ఉన్నప్పుడు విజయవాడ రూపురేఖలేమిటి, అది ఎప్పుడు మునిసిపాలిటీ అయింది, విజయవాడకు ఎప్పుడు రైలొచ్చింది-- మొదలైన వివరాలను ఎంతో ఆసక్తిభరితంగా అందిస్తూనే; వ్యవసాయ ఆర్థికత నుంచి సినిమా, ఆటోమొబైల్ రంగాలకు; రకరకాల మోసాలతో సహా డబ్బు సంబంధ వ్యాపారాలకూ ఎలా పరివర్తన చెందుతూ వచ్చిందో ఒక సామాజిక శాస్త్రవేత్తకు ఉండే లోచూపుతో విశ్లేషించారు. సామాజిక వర్గాల అమరికను, ఊర్ధ్వచలనాన్ని స్పృశించారు. విజయవాడ పుస్తక ప్రచురణ కేంద్రంగా మారిన నేపథ్యాన్నీ తడిమారు.

నాణ్యమైన చదువుల స్పృహ ఫలితంగా  విస్తరించిన విద్యాసంస్థలతో, మేధోవలసలతో విజయవాడ ‘గ్లోబలైజేషన్’లో భాగమవుతున్నా; ‘ఇప్పటికీ వెరపు లేకుండా బహిరంగంగా బూతులు (సెక్సు కాదు, తిట్లు) మాట్లాడటం బెజవాడలో సహజ దృశ్యశ్రవణ’మనీ, ‘పొలం నగరంలోకి రావడం అంటే ఇదే’ననీ అంటూ చిన్న వ్యాఖ్యా దర్పణంలోనే కొండంత బెజవాడను చూపించారు. ‘మానసిక కాలుష్యం లేని ఒక తరం కనుక ఆవిర్భవిస్తే... ఇక్కడ అన్ని విధాల ఆరోగ్యవంతమైన రాష్ట్ర రాజధాని రూపు దిద్దుకోవడం ఇప్పటికీ సాధ్యమే’నన్న చారిత్రక ఆశాభావాన్నీ వ్యక్తం చేశారు.

 76 పేజీల ఈ సచిత్ర రచన పరిమాణంలో చిన్నదే కానీ విషయ వైశాల్యంలో, లోతులో చిన్నది కాదు. రేపు ఒక సమగ్ర రచనకు అవకాశమిచ్చే అన్ని రకాల ప్రాతిపదికలూ ఇందులో ఉన్నాయి.
భాస్కరం కల్లూరి 9703445985

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement