
లక్నో : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో పాటు ఎన్‌ఆర్‌సీ చట్టాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో పదిమందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులపై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఉక్కుపాదం మోపారు. అల్లర్ల కారణంగా ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులన.. ఆందోళకారుల నుంచే వాసూలు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని బిజ్‌నోర్ జిల్లా న్యాయస్థానం సమర్థించడంతో పాటు వెంటనే నగదు చెల్లించాలని ఆరుగురు ఆందోళనకారులకు నోటీసులు జారీచేసింది.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఉద్యమకారులు.. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టులో సవాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వారి పిటిషన్ల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం స్థానిక కోర్టు ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని హైకోర్టు తెలిపింది. దీంతో సీఎం యోగి నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.