సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులకు నిధులు, విభజన హామీల సాధనే ఎజెండాగా సీఎం జగన్ బుధవారం సాయంత్రం ప్రధానితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా తాను లేఖలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించారు.
అలాగే ఈ ఏడాది మార్చి 25న ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాల పంపిణీ చేపడుతున్నామని, ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధానమంత్రి మోదీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టినట్లు సీఎం తెలిపారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా ప్రధానిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన అంచనాలు రూ. 55,549 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3320 కోట్లును విడుదల చేసేలా జల వనరుల శాఖను ఆదేశించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపాలని ప్రధాని మోదీని కోరారు. ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్ అంచనా వేసిందని, ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించాలనిన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ ఏడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని దృష్టికి తెచ్చారు. పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కడప స్టీల్ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని విన్నవిస్తూ, కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.
రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే... కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలన్నారు. గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని, రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలన్నారు. అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి తెలిపారు.
హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వివరించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని వివరించారు.
అలాగే శాసనమండలి రద్దు అంశాన్ని విజ్ఞాపన పత్రంలో పేర్కొన్న ముఖ్యమంత్రి గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తేమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్ చేసిందన్న ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తదనంతర చర్యల కోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ప్రధానికి విజ్ఞాపన చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాలని, మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి సీఎం జగన్ వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధాని మోదీని కోరారు.
కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, నందిగం సురేష్, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, చింతా అనురాధ, వంగా గీత, భీశెట్టి వెంకట సత్యవతి తదితరులు ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ బయల్దేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment