బాధితులను పరామర్శిస్తున్న నందిగాం, టెక్కలి మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్
శ్రీకాకుళం, టెక్కలి/టెక్కలిరూరల్: ఓటమి భయంతో పోలింగ్ రోజున తన కార్యకర్తలతో ఈవీఎంలను ధ్వంసం చేయించిన మంత్రి అచ్చెన్నాయుడు తాజాగా కక్షసాధింపు చర్యలకు దిగాడు. ఎవరైతే తనకు ఓటు వేయలేదో తెలుసుకుని, ప్రధానంగా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు ఉసిగొల్పుతున్నాడు. శుక్రవారం టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ పరిధి నీలాపురం గ్రామంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. గ్రామంలో దళితుల పక్షాన ఉంటూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా ఉన్నారనే కక్షతో టీడీపీ మద్దతుదారులు రెచ్చిపోయారు. ఈ మేరకు దాసరి బారికయ్య, దాసరి ఆదినారాయణ ఇంట్లోకి దాసరి తిరుపతి, రాంబాబు, ఉమాపతితోపాటు 16 మంది టీడీపీ మద్దతుదారులు దౌర్జన్యంగా చొరబడి కర్రలు, మారణాయుధాలతో విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు దాసరి మల్లేష్, దాసరి వరలక్ష్మి, పిట్ట సంతుతోపాటు దాసరి లక్ష్మి అనే గర్భిణి తీవ్రంగా గాయపడ్డారు. అంతేగాకుండా వీరికి చెందిన ఓ ద్విచక్రవాహనం ధ్వంసం కాగా, ఇంట్లో తలుపులు, వరండాల్లో పెద్ద పెద్ద రాళ్లతో విధ్వంసం సృష్టించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పహారా కాస్తున్నారు. క్షతగాత్రులంతా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టీడీపీ మద్దతుదారుల దాడిలో తీవ్రంగా గాయపడిన గర్భిణి లక్ష్మి
ఓటమి భయంతో దాడులు చేస్తున్నారు: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి పూర్తిగా ఓటమి ఖాయమని తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలంతా జీర్ణించుకోలేక తమ కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేరాడ తిలక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తల దాడుల్లో గాయపడిన టెక్కలి మండలం నీలాపురం, నందిగాం మండలం దిమిడిజోల, నరేంద్రపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అచ్చెన్నాయుడుకు ఓటమి ఖాయమనే విషయం స్పష్టంగా తెలిసిపోవడంతో గ్రామాల్లో అరాచకాలు సృష్టించాలని వారి కార్యకర్తలకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రజలంతా వైఎస్సార్‌సీపీకి పూర్తిస్థాయిలో ఓట్లు వేస్తారనే భయంతో ఎన్నికల రోజున సైతం పోలింగ్ కేంద్రాల వద్ద అరాచకాలు చేయాలని చూశారని, దీన్ని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమ ప్రాణాలు పెట్టి అడ్డుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామని ఎటువంటి అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. ఈయన వెంట నాయకులు యర్ర చక్రవర్తి, జే జయరాం, టీ కిరణ్, ఎం సంజీవరావు, యర్రన్న, ఎల్ వైకుంఠరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment