విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న పైడా కృష్ణమోహన్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాజకీయ మనుగడ కోసమే టీడీపీ నాయకులు సైకిల్ యాత్రలు చేస్తున్నారని బీజేపీ విశాఖ జిల్లా ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్ విమర్శించారు. కాకినాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే జైల్లో పెట్టించిన టీడీపీ నాయకులు ప్రస్తుతం ఏ ముఖం పెట్టుకొని ప్రత్యేక హోదా కోసం యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకే బీజేపీ రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదంటూ టీడీపీ నాయకులు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇస్తామన్న నిధులు తీసుకోకుండా ప్రత్యేక హోదా కావాలని ఉద్యమాలు చేయడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు.
పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇస్తోందని, కానీ రాష్ట్ర నిధులతో నిర్మిస్తున్నట్లు చంద్రబాబునాయుడు గొప్పలకు పోతున్నారని దుయ్యబట్టారు. బీజేపీని తిట్టడం వలన రాజకీయ లబ్ధి చేకూరుతుందన్న భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని టీడీపీని ప్రజలు నమ్మడంలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమేర నిధులు విడుదల చేశారో తెలియజేసేందుకు ప్రతి జిల్లాలోనూ కేంద్ర బీజేపీ మంత్రులు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణమోహన్ చెప్పారు. విలేకర్ల సమావేశంలో బీజేపీ నగర మాజీ ప్రధాన కార్యదర్శి బండారు భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment