Bycycle tour
-
మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు
న్యూఢిల్లీ: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ వయనాడ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టగా.. ఆయన బావ (ప్రియాంకగాంధీ భర్త) రాబర్ట్ వాద్రా సైకిల్ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నిరసనల్లో భాగంగా సోమవారం బావబామరుదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బామ్మర్దికి పోటీగా బావా వాద్రా సైకిల్‌పై వేగంగా వెళ్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సుజన్‌సింగ్ పార్క్ నుంచి తన కార్యాలయం సుఖ్‌దేవ్ విహార్ ఆఫీస్ వరకు సైకిల్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏసీ కార్ల నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు చూడాలి’ అని పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చురకలంటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ ఇప్పుడు ఏం చెబుతారు’ అని ప్రశ్నించారు. ఏదైనా సమస్యలు తలెత్తితే ఎప్పుడు ఇతరులపై బురద జల్లడం మోదీకి అలవాటే’ అని ఎద్దేవా చేశారు. సూటుబూటు వేసుకుని సైకిల్‌పై రావడం అందరినీ ఆకట్టుకుంది. ఒకవిధంగా రాహుల్ కన్నా రాబర్ట్‌కే ఎక్కువ గుర్తింపు వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా రైతుల సమస్యలపై స్పందిస్తుంటే మోదీ ప్రభుత్వం మాత్రం కళ్లుండి చూడలేకపోతుంది’ అని తెలిపారు. వెంటనే కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘22 మంది ప్రజల జేబులు ఖాళీ చేస్తూ తమ స్నేహితుల జేబులు నింపుతున్నట్లు’ అభివర్ణించారు. ధరల పెంపుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ పెట్రోల్ దోపిడీ’ అని కొత్తగా హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి ట్వీట్ చేశారు. पेट्रोल पम्प पर गाड़ी में तेल डालते समय जब आपकी नज़र तेज़ी से बढ़ते मीटर पर पड़े, तब ये ज़रूर याद रखिएगा कि कच्चे तेल का दाम बढ़ा नहीं, बल्कि कम हुआ है। पेट्रोल 100 रुपय/लीटर है। आपकी जेब ख़ाली करके ‘मित्रों’ को देने का महान काम मोदी सरकार मुफ़्त में कर रही है!#FuelLootByBJP — Rahul Gandhi (@RahulGandhi) February 22, 2021 చదవండి: కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి చదవండి: నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత -
సైకిల్‌పై చెన్నై టు జర్మనీ
సురేష్ కుమార్ ఉన్నత విద్యను అభ్యసించాడు. విదేశాల్లో ఉన్నతోద్యోగం కూడా సాధించాడు. అయినా లోలోన ఏదో అసంతృప్తి. చదువు, ఉద్యోగం, వివాహం... ఇంతేనా జీవితం! దేశం కోసం, ఈ సమాజం కోసం ఏదైనా సాధించాలి అనే ఆలోచన, తపన ఆ యువకుడిని నింపాదిగా ఉండనీయలేదు. ఉద్యోగాన్ని వదిలేయమని చెప్పి సైకిలెక్కించింది. ఆ రెండు చక్రాలపైనే పదమూడు దేశాలు చుట్టివచ్చేలా చేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన కొండూరు నరేష్కుమార్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ట్రిబుల్ఈ పూర్తి చేశాడు. మూడేళ్ల పాటు బెంగళూరులో, ఆరేళ్లు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశాడు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలన్న తపనతో సామాజిక సేవా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. వారాంతపు రోజుల్లో యూనివర్సిటీలు, కాలేజీలు, ఐటీ కంపెనీల్లో యువతలో వ్యక్తిత్వ వికాసం, సామాజిక ప్రేరణ కలిగించే తరగతులు నిర్వహించడం ప్రారంభించాడు. ఐదేళ్ల నుంచీ పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా మారిపోయాడు. ఆలోచన రేకెత్తించిన అనుభవాలు ‘‘వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు నా గుండెను పిండేశాయి. నేపాల్ పర్యటనకు వెళ్లినపుడు సెక్స్ ట్రాఫికింగ్ నా కళ్లెదురుగా జరిగింది. ఈ నేరాల బారినపడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొదటిసారిగా న్యూజిలాండ్‌లో 3 వేల కిలోమీటర్లు పరుగెత్తాను. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు భారత్ టూ జర్మనీకి సైకిల్ పర్యటన చేయాల్సిందిగా గత ఏడాది జరిగిన ఒక రోటరీ సమావేశంలో సభ్యులు కోరినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. ఎంజీఆర్ యూనివర్సిటీ వారు ఈ యాత్రను స్పాన్సర్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన 13 దేశాల పర్యటనకు బయలుదేరాను. మొత్తం 85 రోజులు పట్టింది. చెన్నై నుంచి ముంబయికి సైకిల్ మీద, ముంబయి నుంచి మస్కట్‌కు విమానంలో, షార్జా నుంచి ఇరాన్‌కు నౌకలో మినహా మొత్తం ప్రయాణం అంతా సైకిల్లోనే సాగింది. ఇస్తాంబుల్ వద్ద ఆసియా ఖండం నుంచి యూరోప్లోకి ప్రవేశించాను. మొత్తం అన్ని రోజులూ ప్రయాణించి నా గమ్యం అయిన జర్మనీలోని హ్యాంబర్గ్కు చేరుకున్నాను. ప్రయాణానికి ముందు ‘‘న్యూజిలాండ్‌కు చెందిన ఒక స్నేహితుడు పన్నెండు అడుగుల పొడవున్న ఒక సైకిల్‌ను ప్రత్యేకంగా తయారుచేసి చెన్నైకి పంపాడు. సైకిల్‌కు వెనుక భాగంలో దుస్తులు, మధ్యలో చాప, అత్యవసర మరమ్మత్తు సామగ్రి, ముందుభాగాన జీపీఎస్ సిస్టమ్, సోలార్ సెల్‌ఫోన్ చార్జర్, ఒకరోజుకు సరిపడా ఆహారం ఉంటుంది. యాత్ర మొత్తంలో 34 సార్లు పంక్చర్లు పడ్డాయి. మొత్తం 8646 కిలోమీటర్ల ప్రయాణంలో 50 వేల మీటర్లు పైకి ఎక్కి దిగాల్సి వచ్చింది. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఐదుసార్లు ఎక్కి దిగినదానితో సమానం’’ .– నరేష్ అడ్డంకులు.. అవాంతరాలు తమిళనాడు రాష్ట్రం వేలూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటుకుని ప్రయాణిస్తూ టర్కీలో మైనస్ 6 డిగ్రీని కూడా చవి చూసాను. ఎదురుగాలులు, పూర్తిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు సవాలుగా మారాయి. టర్కీలో భారీ మంచును ఎదుర్కొవాల్సి రావడంతో రెండురోజులు నిలబడి పోయాను. మంచులో సైకిల్ చక్రం తిరగలేదు. ఆస్ట్రియా దేశం వియన్నాలో వైరల్ జ్వరం, జలుబు, దగ్గు సోకడంతో రెండురోజులు ఇన్‌పేషెంట్‌గా ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. ‘ఎండ్ స్లేవరీ నౌ’ (నేటి నుంచే బానిసత్వ నిర్మూలన) పేరున ఈ ఏడాది జూన్ 1వ తేదీన జర్మనీలో రోటరీ అంతర్జాతీయ సమావేశం జరిగింది. సైకిల్‌పై పర్యటిస్తూ ఆ సమావేశం తేదీకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే నేను మే 25వ తేదీ నాటికే.. అంటే ఐదురోజులు ముందుగానే జర్మనీకి చేరుకున్నాను.ఒకే కుమారుడిని కావడంతో సైకిల్ పర్యటనకు తొలుత తల్లిదండ్రులు బాధపడ్డారు. ఆ తరువాత వారే మద్దతు పలుకుతూ ధైర్యం చెప్పారు. యూరోప్ టూ అమెరికా పర్యటించాలని నా తదుపరి లక్ష్యం. ఇందుకు 12 వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
‘మొక్క’వోని దీక్ష
భగభగ మండుతున్న సూరీడు ఆ యువకుడి సంకల్పం ముందు చిన్నబోయాడు. మండుతున్న ఎండలు కూడా అతడి లక్ష్య సాధనను అడ్డుకోలేకపోతన్నాయి. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలనే తపనతో మండే ఎండను ఎదురిస్తూ..ఆశయం కోసం సైకిల్ యాత్ర చేపట్టాడు హరియాణకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు. కంటికి సరైన నిద్రలేదు.. తినడానికి తిండి లేకపోయినా ‘మొక్క’వోని దీక్షతో ముందుకెళుతూ ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాలను చుట్టాడు. మరో 20 రోజుల్లో తన ఆశయంతో ఢిల్లీ ఎర్రకోటను చేరబోతున్నాడు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. హిమాయత్‌నగర్ :హర్యానా రాష్ట్రం రేవాడి జిల్లా, నిగానియావాస్ గ్రామానికి చెందిన జయపాల్సింగ్ యాదవ్, నీలందేవి దంపతుల కుమారుడు చంద్రప్రకాశ్. ప్రస్తుతం ఇతడు రేవాడిలోని కేఎల్పీ కాలేజీలో బిఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పర్యావరణంపై చిన్నప్పటి నుంచి ఎనలేని ప్రేమను పెంచుకున్న చంద్ర ప్రకాష్.. ఆ ప్రేమతోనే పర్యావరణ కోసం ప్రజల్లో అవగాహన పెంచాలని దేశవ్యాప్తంగా పర్యటించాలని లక్ష్యంగా ఎంచుకున్నాడు. అందులో భాగంగా జేబులో రూ.300 వేసుకుని ఫిబ్రవరి 11న తన స్వగ్రామం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. అలా యాత్రలో భాగంగా 86 రోజుల్లో తొమ్మిది రాష్ట్రాలు చుట్టొచ్చాడు. జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా.. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. దాదాపు అన్నిచోట్లా 40 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. ఇంత ఎండలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రకాశ్ తన సైకిల్‌యాత్రను కొనసాగిస్తున్నాడు. వెంటతెచ్చుకున్న రూ.300 అయిపోయి తినడానికి చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ తను ఎంచుకున్న ఆశయం కోసం ఆరాటపడుతూ ఆకలిమంటను చంపుకుంటున్నాడు. మూడు రోజులుగా జ్వరం వచ్చినప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా కేవలం మాత్రలు వేసుకుని తన యాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. ‘పర్యావరణ సంరక్షణ, బేటీ బచావో–బేటీ పడావో, నాసాముక్తి, అవినీతి నిర్మూలన, జాతీయవాదం పెంపు, దేశ పౌరులందరూ సోదరభావంతో మెలగాలని, ప్రతి గ్రామంలో పర్యారవరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటాలని’ తాను బస చేసిన ప్రతిచోటా అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాడు. మరో 20 రోజుల్లో ఢిల్లీలోని ఎర్రకోటకు చేరుకుని తన సైకిల్‌యాత్ర విజయాన్ని ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు అంకితం చేస్తానంటూ ముగించాడు. -
ఓటుకు నోటుపై వినూత్న సమరం
నేతల తలరాతను, ప్రభుత్వాల మనుగడను శాసించే ఓటుకు ఇటీవలి కాలంలో విలువ కడుతున్నారు. ప్రజాస్వామ్యానికి.. తద్వారా సమాజానికి చేటు చేసే ఈ దుస్సంప్రదాయాన్ని రాజకీయ నేతల నుంచి ప్రజలు కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఎవరు ఎక్కువిస్తే వారికే ఓటు వేస్తామన్న స్థాయికి పరిస్థితి దిగజారింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడేలా పౌరులను చైతన్యపరచడమే లక్ష్యంగా విశాఖ నగరానికి చెందిన ఓ సామాన్యుడు.. అసామాన్య ప్రయత్నం చేపట్టాడు. ‘ఓటుకు నోటు వద్దు’ అన్న నినాదంతో గురువారం రాష్ట్రవ్యాప్త సైకిల్ యాత్ర ప్రారంభించాడు. విశాఖసిటీ: భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోంది. అవినీతి మకిలి పట్టిన రాజకీయ వ్యవస్థను డబ్బు శాసిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డబ్బును వెదజల్లి.. మళ్లీ ఆ డబ్బు సంపాదనకు రాజకీయం ఆసరాగా మారి.. మొత్తానికి వ్యవస్థ భ్రష్టు పడుతోంది. ఎవరు ఎక్కువ మొత్తం ముట్టజెప్పితే.. వారికే ఓటు అనే రాజకీయ పాచికలాటలో సామాన్యుడి ఓటు నగదు నోటులా రూపాంతరం చెందుతోంది. దాంతో రాజకీయం నోట్ల కట్టల మీద నిలబడింది. సామాన్యుడి ఘోష అరణ్య రోదన అవుతోంది. ఇలా ఎన్నేళ్లు? ఇలా ఎన్నాళ్లు? ఈ ప్రశ్న ఆ యువకుడిని వెంటాడింది. ఈ దురవస్థను అంతం చేసేందుకు ప్రజలను చైతన్యపరచాలన్న బాధ్యత అతడి మనసులో మెదిలింది. నోటు తీసుకోకుండా జనం ఓటు వేసినప్పుడే ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ అవుతారన్న విషయం అతడికి అవగతమైంది. ఈ విషయాన్ని పదిమందికీ తెలియజెప్పి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు సామాన్యుడి వాహనమైన సైకిల్ శరణ్యమన్న ఆలోచన అతడి మదిలో కదిలింది. దాంతో ఓటుకు నోటు వైపరీత్యానికి వ్యతిరేకంగా వినూత్నంగా సైకిల్ యాత్ర ప్రారంభమైంది. అవినీతి రాజకీయాలకు చరమ గీతం పాడేలా.. నోటుకు ఓటు అమ్మవద్దని ప్రచారం చేస్తూ ఆరిలోవకు చెందిన చింతకాయల శ్రీను అనే యువకుడి సైకిల్ యాత్ర గురువారం నగరం నుంచి ప్రారంభమైంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర 13 జిల్లాల్లో కొనసాగనుంది. పీపుల్స్ ఫోరం ఫర్ ఇండియా వైస్ చైర్మన్ బీఎల్ నారాయణ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా యాత్రను ప్రారంభించానని చెప్పారు. అవినీతి రాజకీయాలకు అంతా స్వస్తి చెప్పి.. కొత్త శకానికి నాంది పలికేలా నడుం బిగించాలని పిలు పునిచ్చారు. ‘‘ఓటుకు నోటు వద్దు’’ అనే నినాదంతో నెల పాటు సాగే సైకిల్ యాత్ర కర్నూలులో ముగియనుందని చింతకాయల శ్రీను తెలిపారు. యాత్ర ప్రారంభంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, యూఎస్‌ఎన్ రాజు, సురేష్, గణేష్‌లు పాల్గొని మద్దతు పలికారు. -
సైకిల్‌పై మూడు దేశాలు చుట్టేశాడు
మారేడుపల్లి: సైకిల్ ప్రయాణం హాబీగా మార్చుకున్న ఓ యువకుడు మూడు దేశాలను 118 రోజుల్లో 5 వేల కిలోమీటర్ల ప్రయాణం చేశాడు. యాత్ర ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న ఆ యువకుడికి కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ విజయనగర్ పికెట్ కు చెందిన అవినాష్(23) డిగ్రీ పూర్తి చేశారు. అందరిలా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకోవాలన్న తపన అతనిది. కౌచ్ సర్ఫింగ్ సభ్యుల సహకారంతో సైకిల్ పై దేశం మొత్తం తిరుగుతూ అక్కడి పరిస్థితులు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాడు. మే 20 న సికింద్రాబాద్ పికెట్‌లోని నివాసం వద్ద నుండి సైకిల్ పై బయలుదేరాడు. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం మీదుగా కోల్కత్తా చేరుకున్నాడు. అక్కడనుండి థాయ్‌లాండ్‌కు ఫ్లైట్ లో వెళ్ళాడు. థాయ్‌లాండ్ నుండి కంబోడియా, వియత్నాం దేశాల్లో సైకిల్ పై ప్రయాణించాడు. భారత దేశంతో పాటు మూడు దేశాల్లో రోడ్డు మార్గాన సైకిల్ యాత్రను విజయవంతంగా కొనసాగించాడు. ఈ నెల 20 న హైద్రాబాద్ కు చేరుకున్నాడు. తల్లి దండ్రులు గిరిధర్, ఉషాగిరిధర్‌లు కుటుంబసభ్యులు అవినాష్ ను అభినందించారు. -
బహుదూరపు బాటసారి!
ప్రత్తిపాడు: సైకిల్‌పై దేశాన్ని చుట్టేస్తున్నాడు ఈ బహుదూరపు బాటసారి. రాజస్థాన్ నుంచి బయల్దేరిన 28 ఏళ్ల యువకుడు విద్యావ్యవస్థపై డాక్యుమెంటరీ తయారు చేస్తూ, 21 వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు సమీపంలోని అజ్మీర్ దర్గాకు చెందిన అంకిత్ అరోరా (28) సైకిల్‌పై దేశ పర్యటన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎక్కాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. అంతే 2017 ఆగస్టు 27న తన స్వగ్రామమైన అజ్మీర్ దర్గా నుంచి సైకిల్‌పై దేశ పర్యటనకు బయల్దేరాడు. పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాలు పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాచుర్యం పొందిన పాఠశాలల్లో విద్యార్థులతో మమేకమవుతున్నాడు. స్థానికంగా ఉన్న విద్యా వ్యవస్థల్లోని ప్రాముఖ్యతలు, అమలవుతున్న విద్యా విధానం.. వంటి పలు విద్యా సంబంధ అంశాలపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు. దేశ పర్యటనలో భాగంగా 306వ రోజైన మంగళవారం ప్రత్తిపాడు మీదుగా గుంటూరు వైపు వెళుతున్న అకింత్ ఆరోరాను ‘సాక్షి’ పలకరించింది. 21,000 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నానని చెప్పారు. ఈ ప్రాంతమంతా చాలా బాగుందని, ప్రజల స్పందన కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వైపు వెళతానని తెలిపాడు. సైకిల్‌పై దేశ పర్యటన చేస్తున్న అంకిత్‌ను స్థానికులు ఆప్యాయంగా పలకరించారు. యోగ క్షేమాలు, ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. విద్యావ్యవస్థపై చేస్తున్న డాక్యుమెంటరీ వలన ప్రయోజనాలను అంకిత్ తెలియడంతో వారంతా అభినందనలు తెలిపారు. -
రాజకీయ మనుగడ కోసమే..
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాజకీయ మనుగడ కోసమే టీడీపీ నాయకులు సైకిల్ యాత్రలు చేస్తున్నారని బీజేపీ విశాఖ జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడా కృష్ణమోహన్ విమర్శించారు. కాకినాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే జైల్లో పెట్టించిన టీడీపీ నాయకులు ప్రస్తుతం ఏ ముఖం పెట్టుకొని ప్రత్యేక హోదా కోసం యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకే బీజేపీ రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదంటూ టీడీపీ నాయకులు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇస్తామన్న నిధులు తీసుకోకుండా ప్రత్యేక హోదా కావాలని ఉద్యమాలు చేయడం వెనుక ఆంతర్యమేమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులు ఇస్తోందని, కానీ రాష్ట్ర నిధులతో నిర్మిస్తున్నట్లు చంద్రబాబునాయుడు గొప్పలకు పోతున్నారని దుయ్యబట్టారు. బీజేపీని తిట్టడం వలన రాజకీయ లబ్ధి చేకూరుతుందన్న భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారన్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని టీడీపీని ప్రజలు నమ్మడంలేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమేర నిధులు విడుదల చేశారో తెలియజేసేందుకు ప్రతి జిల్లాలోనూ కేంద్ర బీజేపీ మంత్రులు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణమోహన్ చెప్పారు. విలేకర్ల సమావేశంలో బీజేపీ నగర మాజీ ప్రధాన కార్యదర్శి బండారు భాస్కర్ పాల్గొన్నారు. -
పూణే నుంచి అజ్మీర్‌కు సైకిల్ యాత్ర
మానవాళి క్షేమంగా ఉండాలి: కౌసర్‌షాహ ధారూరు : ప్రపంచంలోని మానవులు, పశుపక్షాదులు, ఇతర జీవకోటి క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూణెకు చెందిన కౌసర్‌షాహ (75) సైకిల్ యాత్ర చేపట్టాడు. మహారాష్ట్రలోని పూణే నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం ధారూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 20 ఏళ్లుగా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు సైకిల్ యాత్ర చేస్తున్నానని, అందులో భాగంగానే 13 రోజుల క్రితం పూణే నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు బయలుదేరినట్లు తెలిపారు. 20 రోజుల్లో అజ్మీర్‌దర్గాకు చేరుకోవాలన్నది తనలక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు (13 రోజులు) 450 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. మరో 7 రోజుల్లో అజ్మీర్‌దర్గాకు చేరుకుంటానని దీమా వ్యక్తం చేశారు. నేడు ప్రపంచంలోని దేశాలన్నీ ఆదిపత్యం కోసం అలజడులు, హింసలు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతితో పాటు, భారతదేశంలోని ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలన్నది తన యాత్ర ఉద్దేశమన్నారు.