గాంధీ విగ్రహం వద్ద యాత్ర ప్రారంభించిన శ్రీను, సంఘీభావం తెలుపుతున్న డీవైఎఫ్‌ఐ ప్రతినిధులు
నేతల తలరాతను, ప్రభుత్వాల మనుగడను శాసించే ఓటుకు ఇటీవలి కాలంలో విలువ కడుతున్నారు. ప్రజాస్వామ్యానికి.. తద్వారా సమాజానికి చేటు చేసే ఈ దుస్సంప్రదాయాన్ని రాజకీయ నేతల నుంచి ప్రజలు కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఎవరు ఎక్కువిస్తే వారికే ఓటు వేస్తామన్న స్థాయికి పరిస్థితి దిగజారింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఈ దుష్ట సంస్కృతికి చరమగీతం పాడేలా పౌరులను చైతన్యపరచడమే లక్ష్యంగా విశాఖ నగరానికి చెందిన ఓ సామాన్యుడు.. అసామాన్య ప్రయత్నం చేపట్టాడు. ‘ఓటుకు నోటు వద్దు’ అన్న నినాదంతో గురువారం రాష్ట్రవ్యాప్త సైకిల్ యాత్ర ప్రారంభించాడు.
విశాఖసిటీ: భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే రాజకీయం డబ్బు చుట్టూ తిరుగుతోంది. అవినీతి మకిలి పట్టిన రాజకీయ వ్యవస్థను డబ్బు శాసిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డబ్బును వెదజల్లి.. మళ్లీ ఆ డబ్బు సంపాదనకు రాజకీయం ఆసరాగా మారి.. మొత్తానికి వ్యవస్థ భ్రష్టు పడుతోంది. ఎవరు ఎక్కువ మొత్తం ముట్టజెప్పితే.. వారికే ఓటు అనే రాజకీయ పాచికలాటలో సామాన్యుడి ఓటు నగదు నోటులా రూపాంతరం చెందుతోంది. దాంతో రాజకీయం నోట్ల కట్టల మీద నిలబడింది. సామాన్యుడి ఘోష అరణ్య రోదన అవుతోంది. ఇలా ఎన్నేళ్లు? ఇలా ఎన్నాళ్లు? ఈ ప్రశ్న ఆ యువకుడిని వెంటాడింది. ఈ దురవస్థను అంతం చేసేందుకు ప్రజలను చైతన్యపరచాలన్న బాధ్యత అతడి మనసులో మెదిలింది. నోటు తీసుకోకుండా జనం ఓటు వేసినప్పుడే ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ అవుతారన్న విషయం అతడికి అవగతమైంది.
ఈ విషయాన్ని పదిమందికీ తెలియజెప్పి వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు సామాన్యుడి వాహనమైన సైకిల్ శరణ్యమన్న ఆలోచన అతడి మదిలో కదిలింది. దాంతో ఓటుకు నోటు వైపరీత్యానికి వ్యతిరేకంగా వినూత్నంగా సైకిల్ యాత్ర ప్రారంభమైంది. అవినీతి రాజకీయాలకు చరమ గీతం పాడేలా.. నోటుకు ఓటు అమ్మవద్దని ప్రచారం చేస్తూ ఆరిలోవకు చెందిన చింతకాయల శ్రీను అనే యువకుడి సైకిల్ యాత్ర గురువారం నగరం నుంచి ప్రారంభమైంది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర 13 జిల్లాల్లో కొనసాగనుంది. పీపుల్స్ ఫోరం ఫర్ ఇండియా వైస్ చైర్మన్ బీఎల్ నారాయణ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా యాత్రను ప్రారంభించానని చెప్పారు. అవినీతి రాజకీయాలకు అంతా స్వస్తి చెప్పి.. కొత్త శకానికి నాంది పలికేలా నడుం బిగించాలని పిలు పునిచ్చారు. ‘‘ఓటుకు నోటు వద్దు’’ అనే నినాదంతో నెల పాటు సాగే సైకిల్ యాత్ర కర్నూలులో ముగియనుందని చింతకాయల శ్రీను తెలిపారు. యాత్ర ప్రారంభంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, యూఎస్‌ఎన్ రాజు, సురేష్, గణేష్‌లు పాల్గొని మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment