ప్రత్తిపాడు మీదుగా సైకిల్‌పై దేశయాత్ర చేస్తున్న రాజస్థానీ యువకుడు అంకిత్
ప్రత్తిపాడు: సైకిల్‌పై దేశాన్ని చుట్టేస్తున్నాడు ఈ బహుదూరపు బాటసారి. రాజస్థాన్ నుంచి బయల్దేరిన 28 ఏళ్ల యువకుడు విద్యావ్యవస్థపై డాక్యుమెంటరీ తయారు చేస్తూ, 21 వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి... రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌కు సమీపంలోని అజ్మీర్ దర్గాకు చెందిన అంకిత్ అరోరా (28) సైకిల్‌పై దేశ పర్యటన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు ఎక్కాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు. అంతే 2017 ఆగస్టు 27న తన స్వగ్రామమైన అజ్మీర్ దర్గా నుంచి సైకిల్‌పై దేశ పర్యటనకు బయల్దేరాడు. పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాలు పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రాచుర్యం పొందిన పాఠశాలల్లో విద్యార్థులతో మమేకమవుతున్నాడు. స్థానికంగా ఉన్న విద్యా వ్యవస్థల్లోని ప్రాముఖ్యతలు, అమలవుతున్న విద్యా విధానం.. వంటి పలు విద్యా సంబంధ అంశాలపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్నాడు. దేశ పర్యటనలో భాగంగా 306వ రోజైన మంగళవారం ప్రత్తిపాడు మీదుగా గుంటూరు వైపు వెళుతున్న అకింత్ ఆరోరాను ‘సాక్షి’ పలకరించింది.
21,000 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నానని చెప్పారు. ఈ ప్రాంతమంతా చాలా బాగుందని, ప్రజల స్పందన కూడా సానుకూలంగా ఉందని చెప్పారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా వైపు వెళతానని తెలిపాడు. సైకిల్‌పై దేశ పర్యటన చేస్తున్న అంకిత్‌ను స్థానికులు ఆప్యాయంగా పలకరించారు. యోగ క్షేమాలు, ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. విద్యావ్యవస్థపై చేస్తున్న డాక్యుమెంటరీ వలన ప్రయోజనాలను అంకిత్ తెలియడంతో వారంతా అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment