సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్వచ్ఛ సత్తెనపల్లిలో భాగంగా సోమవారం 1410 మంది విద్యార్థులు వేగంగా చేతులు శుభ్రం చేసుకుని గిన్నిస్‌బుక్ రికార్డు నమోదు చేశారు. గతంలో జార్ఖండ్ రాష్ట్రంలోని జంషడ్‌పూర్‌లో 991 మంది విద్యార్థులు వేగంగా చేతులు శుభ్రం చేసుకుని రికార్డు నమోదు కాగా, దానిని సత్తెనపల్లి విద్యార్థులు అధిగమించారు. ఈ కార్యక్రమంలో 3.40 గంటల్లో (మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 6.10 వరకు)1410 మంది విద్యార్థులు సామూహికంగా చేతులు శుభ్రం చేసుకున్నారు.
గిన్నిస్‌బుక్ ప్రతినిధి లూసియానా 1410 మందితో జరిగిన కార్యక్రమంతో సత్తెనపల్లి గిన్నిస్‌బుక్ రికార్డులో నమోదైనట్లు ప్రకటించి, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పత్రం అందజేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచ రికార్డు నమోదు కావడం సంతోషకరమన్నారు. అరుదైన రికార్డు లభించిన సందర్భంగా కోడెలను ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించారు. సభలో స్పీకర్ ఓఎస్‌డీ గురుమూర్తి, డీఆర్వో నాగబాబు, యునెసఫ్ ప్రతినిధి ప్రమోద్‌సేన్, మున్సిపల్ చైర్మన్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.