
గుంటూరు వెస్ట్ ( క్రీడలు): పేదరికం వెన్నాడుతున్నా.. వెరవకుండా కఠోర సాధనతో స్కేటింగ్‌లో మెరిశాడు ఆ యువకుడు. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యు అంచుల వరకూ వెళ్లినా అజేయుడై కోలుకుని మళ్లీ స్కేటింగ్ రింక్‌లోకి ప్రవేశించాడు. ఇప్పుడు గిన్నిస్ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు. అతడే గుంటూరుకు చెందిన పెండ్యాల హనుమంత్ అజయ్‌కుమార్.
ఇదీ కుటుంబ నేపథ్యం
గుంటూరుకు చెందిన అజయ్ తండ్రి వెంకట గిరిధర్. చిల్లర కొట్టులో గుమాస్తా. తల్లి శ్రీనుకాదేవి గృహిణి. అజయ్ తొలినుంచి స్కేటింగ్‌లో సత్తాచాటాడు. గత ఫిబ్రవరిలో స్థానిక కలెక్టరేట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 20 రోజులు కోమాలోనే ఉన్నాడు. వైద్యుల కృషితో ఎట్టకేలకు 3 నెలల తర్వాత కోలుకున్నాడు. ఇక స్కేటింగ్‌కు పనికిరాడన్న డాక్టర్ల మాటలను చాలెంజ్‌గా తీసుకుని మళ్ళీ సాధన మొదలెట్టి పట్టు సాధించాడు.
గిన్నిస్ రికార్డు కోసం తపన
స్కేటింగ్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం అజయ్ ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. వారి అనుమతి మేరకు ఆదివారం గుంటూరులోని బి.ఆర్.స్టేడియంలో 128 మీటర్ల సర్కిల్‌ను ఒక్క గంటలో 120 సార్లు అంటే సుమారు 15 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాడు. గిన్నిస్ రికార్డు నిర్వాహకులు ఇచ్చిన 14 కిలోమీటర్ల దూరం కంటే ఒక కిలోమీటరు ఎక్కు అధిగమించాడు. దీనిని వీడియోగా రికార్డు చేసి పంపించాడు.
అజయ్ గత విజయాలు
►2010లో చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన నేషనల్ మీట్‌లో అండర్–17, మిక్సిడ్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు.
►2015–16లో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 2వ స్టూడెంట్ ఒలింపిక్స్‌లో 100, 500, 1000 మీటర్ల రింక్ విభాగాల్లో 3 బంగారు పతకాలు
►2016–17లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన 3వ స్టూడెంట్ ఒలింపిక్స్‌లోనూ 100, 500, 1000 మీటర్ల రింక్ విభాగాల్లో 3 బంగారు పతకాలు.
8 రాష్ట్ర స్థాయి బంగారు పతకాలు సాధించాడు.
చాలా మందికి రుణ పడి ఉన్నా
ఈ రికార్డు చేరుకునే వరకు నాకు చాలా మంది అన్ని విధాలుగా సహకరించారు. వారి రుణం తీర్చుకోలేనిది. నేను పోటీల్లో పాల్గొంటూనే యువతకు శిక్షణనిస్తున్నా. జాతీయ స్థాయిలో శిక్షకుడిగా స్థిరపడాలనేది నా కోరిక. అప్పుడప్పుడు ఆరోగ్యం కొంత ఇబ్బందిపెడుతున్నా. ఏదైనా సాధించాలనే తపనే నన్ను ఈస్థాయికి చేర్చింది.
– పెండ్యాల హనుమంత్ అజయ్ కుమార్, నేషనల్ స్కేటర్
Comments
Please login to add a commentAdd a comment