
ఒమ¯Œ లో ఓ కుగ్రామంలో ఆతిథ్యం ఇచ్చిన ఓ కుటుంబీకులు, ఆ గ్రామంలో చిన్నారులతో నరేష్
సురేష్ కుమార్ ఉన్నత విద్యను అభ్యసించాడు. విదేశాల్లో ఉన్నతోద్యోగం కూడా సాధించాడు. అయినా లోలోన ఏదో అసంతృప్తి. చదువు, ఉద్యోగం, వివాహం... ఇంతేనా జీవితం! దేశం కోసం, ఈ సమాజం కోసం ఏదైనా సాధించాలి అనే ఆలోచన, తపన ఆ యువకుడిని నింపాదిగా ఉండనీయలేదు. ఉద్యోగాన్ని వదిలేయమని చెప్పి సైకిలెక్కించింది. ఆ రెండు చక్రాలపైనే పదమూడు దేశాలు చుట్టివచ్చేలా చేసింది.
చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన కొండూరు నరేష్‌కుమార్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ట్రిబుల్‌ఈ పూర్తి చేశాడు. మూడేళ్ల పాటు బెంగళూరులో, ఆరేళ్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేశాడు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలన్న తపనతో సామాజిక సేవా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. వారాంతపు రోజుల్లో యూనివర్సిటీలు, కాలేజీలు, ఐటీ కంపెనీల్లో యువతలో వ్యక్తిత్వ వికాసం, సామాజిక ప్రేరణ కలిగించే తరగతులు నిర్వహించడం ప్రారంభించాడు. ఐదేళ్ల నుంచీ పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా మారిపోయాడు.
ఆలోచన రేకెత్తించిన అనుభవాలు
‘‘వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు నా గుండెను పిండేశాయి. నేపాల్ పర్యటనకు వెళ్లినపుడు సెక్స్ ట్రాఫికింగ్ నా కళ్లెదురుగా జరిగింది. ఈ నేరాల బారినపడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొదటిసారిగా న్యూజిలాండ్‌లో 3 వేల కిలోమీటర్లు పరుగెత్తాను. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు భారత్ టూ జర్మనీకి సైకిల్ పర్యటన చేయాల్సిందిగా గత ఏడాది జరిగిన ఒక రోటరీ సమావేశంలో సభ్యులు కోరినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. ఎంజీఆర్ యూనివర్సిటీ వారు ఈ యాత్రను స్పాన్సర్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన 13 దేశాల పర్యటనకు బయలుదేరాను. మొత్తం 85 రోజులు పట్టింది. చెన్నై నుంచి ముంబయికి సైకిల్ మీద, ముంబయి నుంచి మస్కట్‌కు విమానంలో, షార్జా నుంచి ఇరాన్‌కు నౌకలో మినహా మొత్తం ప్రయాణం అంతా సైకిల్‌లోనే సాగింది. ఇస్తాంబుల్ వద్ద ఆసియా ఖండం నుంచి యూరోప్‌లోకి ప్రవేశించాను. మొత్తం అన్ని రోజులూ ప్రయాణించి నా గమ్యం అయిన జర్మనీలోని హ్యాంబర్గ్‌కు చేరుకున్నాను.
ప్రయాణానికి ముందు
‘‘న్యూజిలాండ్‌కు చెందిన ఒక స్నేహితుడు పన్నెండు అడుగుల పొడవున్న ఒక సైకిల్‌ను ప్రత్యేకంగా తయారుచేసి చెన్నైకి పంపాడు. సైకిల్‌కు వెనుక భాగంలో దుస్తులు, మధ్యలో చాప, అత్యవసర మరమ్మత్తు సామగ్రి, ముందుభాగాన జీపీఎస్ సిస్టమ్, సోలార్ సెల్‌ఫోన్ చార్జర్, ఒకరోజుకు సరిపడా ఆహారం ఉంటుంది. యాత్ర మొత్తంలో 34 సార్లు పంక్చర్లు పడ్డాయి. మొత్తం 8646 కిలోమీటర్ల ప్రయాణంలో 50 వేల మీటర్లు పైకి ఎక్కి దిగాల్సి వచ్చింది. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఐదుసార్లు ఎక్కి దిగినదానితో సమానం’’ .– నరేష్
అడ్డంకులు.. అవాంతరాలు
తమిళనాడు రాష్ట్రం వేలూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటుకుని ప్రయాణిస్తూ టర్కీలో మైనస్ 6 డిగ్రీని కూడా చవి చూసాను. ఎదురుగాలులు, పూర్తిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు సవాలుగా మారాయి. టర్కీలో భారీ మంచును ఎదుర్కొవాల్సి రావడంతో రెండురోజులు నిలబడి పోయాను. మంచులో సైకిల్ చక్రం తిరగలేదు. ఆస్ట్రియా దేశం వియన్నాలో వైరల్ జ్వరం, జలుబు, దగ్గు సోకడంతో రెండురోజులు ఇన్‌పేషెంట్‌గా ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. ‘ఎండ్ స్లేవరీ నౌ’ (నేటి నుంచే బానిసత్వ నిర్మూలన) పేరున ఈ ఏడాది జూన్ 1వ తేదీన జర్మనీలో రోటరీ అంతర్జాతీయ సమావేశం జరిగింది. సైకిల్‌పై పర్యటిస్తూ ఆ సమావేశం తేదీకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే నేను మే 25వ తేదీ నాటికే.. అంటే ఐదురోజులు ముందుగానే జర్మనీకి చేరుకున్నాను.ఒకే కుమారుడిని కావడంతో సైకిల్ పర్యటనకు తొలుత తల్లిదండ్రులు బాధపడ్డారు. ఆ తరువాత వారే మద్దతు పలుకుతూ ధైర్యం చెప్పారు. యూరోప్ టూ అమెరికా పర్యటించాలని నా తదుపరి లక్ష్యం. ఇందుకు 12 వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై
Comments
Please login to add a commentAdd a comment