భగభగ మండుతున్న సూరీడు ఆ యువకుడి సంకల్పం ముందు చిన్నబోయాడు. మండుతున్న ఎండలు కూడా అతడి లక్ష్య సాధనను అడ్డుకోలేకపోతన్నాయి. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలనే తపనతో మండే ఎండను ఎదురిస్తూ..ఆశయం కోసం సైకిల్ యాత్ర చేపట్టాడు హరియాణకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు. కంటికి సరైన నిద్రలేదు.. తినడానికి తిండి లేకపోయినా ‘మొక్క’వోని దీక్షతో ముందుకెళుతూ ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాలను చుట్టాడు. మరో 20 రోజుల్లో తన ఆశయంతో ఢిల్లీ ఎర్రకోటను చేరబోతున్నాడు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన చంద్రప్రకాశ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించాడు.
హిమాయత్‌నగర్ :హర్యానా రాష్ట్రం రేవాడి జిల్లా, నిగానియావాస్ గ్రామానికి చెందిన జయపాల్‌సింగ్ యాదవ్, నీలందేవి దంపతుల కుమారుడు చంద్రప్రకాశ్. ప్రస్తుతం ఇతడు రేవాడిలోని కేఎల్‌పీ కాలేజీలో బిఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పర్యావరణంపై చిన్నప్పటి నుంచి ఎనలేని ప్రేమను పెంచుకున్న చంద్ర ప్రకాష్.. ఆ ప్రేమతోనే పర్యావరణ కోసం ప్రజల్లో అవగాహన పెంచాలని దేశవ్యాప్తంగా పర్యటించాలని లక్ష్యంగా ఎంచుకున్నాడు. అందులో భాగంగా జేబులో రూ.300 వేసుకుని ఫిబ్రవరి 11న తన స్వగ్రామం నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. అలా యాత్రలో భాగంగా 86 రోజుల్లో తొమ్మిది రాష్ట్రాలు చుట్టొచ్చాడు.
జ్వరాన్ని సైతం లెక్క చేయకుండా..
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. దాదాపు అన్నిచోట్లా 40 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదవుతోంది. ఇంత ఎండలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రకాశ్ తన సైకిల్‌యాత్రను కొనసాగిస్తున్నాడు. వెంటతెచ్చుకున్న రూ.300 అయిపోయి తినడానికి చేతిలో డబ్బులు లేకపోయినప్పటికీ తను ఎంచుకున్న ఆశయం కోసం ఆరాటపడుతూ ఆకలిమంటను చంపుకుంటున్నాడు. మూడు రోజులుగా జ్వరం వచ్చినప్పటికీ ఏ మాత్రం లెక్క చేయకుండా కేవలం మాత్రలు వేసుకుని తన యాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. ‘పర్యావరణ సంరక్షణ, బేటీ బచావో–బేటీ పడావో, నాసాముక్తి, అవినీతి నిర్మూలన, జాతీయవాదం పెంపు, దేశ పౌరులందరూ సోదరభావంతో మెలగాలని, ప్రతి గ్రామంలో పర్యారవరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటాలని’ తాను బస చేసిన ప్రతిచోటా అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాడు. మరో 20 రోజుల్లో ఢిల్లీలోని ఎర్రకోటకు చేరుకుని తన సైకిల్‌యాత్ర విజయాన్ని ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమరవీరులకు అంకితం చేస్తానంటూ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment