పూణే నుంచి అజ్మీర్‌కు సైకిల్ యాత్ర
మానవాళి క్షేమంగా ఉండాలి: కౌసర్‌షాహ
ధారూరు : ప్రపంచంలోని మానవులు, పశుపక్షాదులు, ఇతర జీవకోటి క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూణెకు చెందిన కౌసర్‌షాహ (75) సైకిల్ యాత్ర చేపట్టాడు. మహారాష్ట్రలోని పూణే నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా వరకు చేపట్టిన సైకిల్ యాత్ర శనివారం ధారూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను 20 ఏళ్లుగా.. దేశంలోని వివిధ ప్రాంతాలకు సైకిల్ యాత్ర చేస్తున్నానని, అందులో భాగంగానే 13 రోజుల క్రితం పూణే నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు బయలుదేరినట్లు తెలిపారు. 20 రోజుల్లో అజ్మీర్‌దర్గాకు చేరుకోవాలన్నది తనలక్ష్యమని తెలిపారు. ఇప్పటివరకు (13 రోజులు) 450 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. మరో 7 రోజుల్లో అజ్మీర్‌దర్గాకు చేరుకుంటానని దీమా వ్యక్తం చేశారు. నేడు ప్రపంచంలోని దేశాలన్నీ ఆదిపత్యం కోసం అలజడులు, హింసలు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతితో పాటు, భారతదేశంలోని ప్రజలంతా కలిసి మెలిసి జీవించాలన్నది తన యాత్ర ఉద్దేశమన్నారు.