ఎన్నికల అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై అప్పటికప్పుడు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం ‘సీ విజిల్’ పేరుతో ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. మామూలు ఎన్నికల ప్రచారాలు, ప్రసంగాలతో పాటు మీడియా, సామాజిక మాధ్యమాలలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే వెంటనే పౌరులెవరైనా ఈ యాప్ ద్వారా దాన్ని ఫొటో లేదా వీడియో సహా ఎన్నికల సంఘానికి నిమిషాల్లో పంపవచ్చు. దానిపై సంబంధిత అధికారులు తక్షణమే దర్యాప్తు జరిపి ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తారు. ఆపై ఎన్నికల సంఘం తగిన చర్య తీసుకుంటుంది.
ఎలా పని చేస్తుందంటే..?
కెమెరా, జీపీఎస్, ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అక్రమాలకు సంబంధించిన ఫొటో లేదా రెండు నిమిషాలకు మించని వీడియోలను తీసి వాటిని ఈ యాప్‌లో అప్‌లోడ్ చేసి ఎన్నికల సంఘానికి పంపాలి. ఆ సమాచారం వెంటనే సంబంధిత జిల్లా కంట్రోల్ రూమ్ కు వెళుతుంది. దాని ఆధారంగా తనిఖీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి అక్రమం జరిగిందీ లేనిదీ పరిశీలిస్తారు. ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తారు. ఫిర్యాదుదారుడు తీసిన ఫొటో లేదా వీడియో ఎక్కడిది అన్నది యాప్ లో నిక్షిప్తం చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా తనిఖీ అధికారులకు తెలుస్తుంది. ఫిర్యాదును అప్‌లోడ్ చేసిన వెంటనే ఫిర్యాదుదారుడికి ఒక ఐడీ నంబరు వస్తుంది. ఫిర్యాదుపై తదుపరి చర్యల సమాచారం ఎప్పటికప్పుడు అతని మొబైల్‌కు వస్తుంటుంది. ఈ యాప్ ద్వారా ఒకరు ఎన్ని ఫిర్యాదులైనా చేయవచ్చు. అవసరమైతే ఫిర్యా దు దారు తన పేరు తెలియకుండా ఫిర్యాదు చేసే సదుపాయం కూడా దీనిలో ఉంది. ఫిర్యాదుదారుని వివరాలు ఎన్నికల సంఘం రహస్యంగా ఉంచుతుంది. ఇంతకు ముందు ఇలాం టి ఫిర్యాదులపై చర్య తీసుకోవడానికి నెలలు, ఏళ్లు పట్టేది. ఆధారాలు కూడా సరిగా దొరికేవి కాదు. సీ విజిల్ యాప్‌తో పకడ్బందీగా ఫిర్యాదు చేయవచ్చు. కొన్ని గంటలు లేదా రోజుల్లోనే చర్య తీసుకోవడానికి వీలవుతుంది.
దుర్వినియోగం కాకుండా....
యాప్‌ను దుర్వినియోగం చేయకుండా ఎన్నికల సంఘం కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల పరిధిలోనే ఈ యాప్ పని చేస్తుంది. సంఘటనను ఫొటో లేదా వీడియో తీసిన ఐదు నిమిషాల్లో దాన్ని అప్‌లోడ్ చేయాలి. ఈ గడువు దాటితే యాప్ వాటిని స్వీకరించదు. ముందుగా రికార్డు చేసిన వాటిని కూడా స్వీకరించదు. ఈ యాప్ ద్వారా తీసిన ఫొటోలు, వీడియోలను ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయడానికి వీలుండదు. ఎన్నికల నియమావళి ఉలంఘనకు సంబంధించిన ఫిర్యాదులనే ఇది స్వీకరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment