సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలపై కోడ్ ఉల్లంఘల ఫిర్యాదులకు సంబంధించి ఈసీ మంగళవారం ఓ నిర్ణయం తీసుకోనుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం, సాయుధ దళాలను రాజకీయ ప్రచారంలో ప్రస్తావించడం వంటి చర్యలకు పాల్పడినా ఈసీ ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని కాంగ్రెస్ ఎంపీ సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈసీ వీటిపై దృష్టిసారించింది.
ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలపై చర్యలు తీసుకోవాలని ఈసీని ఆదేశించాల్సిందిగా ఈ పిటిషన్‌లో సుప్రీంను కాంగ్రెస్ కోరింది. మోదీ, అమిత్ షాల కోడ్ ఉల్లంఘనలపై తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై తమ పిటిషన్‌ను తక్షణ విచారణ చేపట్టాలని ఎంపీ సుస్మితా దేవి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ అంగీకరించింది. బీజేపీ అగ్రనేతలపై తాము ఇచ్చిన ఫిర్యాదులను ఈసీ పట్టించుకోకపోవడం ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరికి సంకేతమని, ఇది ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీస్తుందని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment