సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రసంగిస్తూ తన ప్రభుత్వ సంస‍్కరణలను, లక్ష్యాలను ఏకరువు పెట్టారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. జీఎస్‌టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి విప్లవాత్మక సంస్కరణలతో నాలుగేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆర్థికమంత్రి వివరించారు. ప్రపంచదేశాలతో పోలిస్తే దేశం ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగ్గా ఉందన్నారు. కరెన్సీ స్తిరీకరణతో దేశ ఆర్థికపరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.
డీమానిటైజేషన్ ఫలితాలు ఇపుడు కనిపిస్తున్నాయి. జీఎస్టీని కేవలం ఆరునెలల్లో అమల్లోకి తీసుకొచ్చాం. పన్ను సంస్కరణలతో పన్నుల ద్వారా ఆదాయంగా గణనీయంగా పెరిగింది. బ్యాంకుల దివాలా బిల్లుతో బ్యాంకుల్లో సంస్కరణకు శ్రీకారం చుట్టాం. దాదాపు అన్ని రంగాల్లోనూ స్థిరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ బడ్జెట్ లో మధ్యతరగతి వారికి ఊరట నిచ్చాం. తాజా బడ్జెట్ లో రైతులకు, మహిళలకు, సీనియర్ సిటిజన్లకు, ఉద్యోగులకు ఎంతో ఊరట కల్పించామంటూ తమ బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో జైట్లీ సమర్ధించుకున్నారు. మొదటి ఐదేళ్లకు రెవెన్యూ సాయం చేయాలని అన్నిరాష్ట్రాలు కోరాయన్నారు. జీఎస్‌టీ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందంటూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
ఏపీ విభజన సమస్యలపై తమకు అవగాహనుందని అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తానన్నారు. ఏపీ మిత్రులు తనను కలుస్తూనే ఉంటారనీ, ఏపీపై తమకు సానుభూతి ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా, ఆంధప్రదేశ్ విభజన కేటాయింపులు, అమలు గురించి జైట్లీ మాట్లాడుతూ వుండగానే.. సభలో ప్రతిపక్షాలు న్యాయం కావాలంటూ నినాదాలతో ఆందోళనకు దిగారు. ఈ గందరగోళం మధ్యనే అరుణ్ జైట్లీ ఏపీ గురించి మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీల్లో ఇప్పటికే తాము కొన్ని అమలు చేశామని, మరికొన్ని అమలు దశలో ఉన్నాయని తెలిపారు.ఏపీకి పలు జాతీయ సంస్థలను కేటాయించామని వాటికి నిధులు ఇస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. ఏపీ రాజధాని నిర్మాణానికి వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిన్నటి నుంచి చర్చలు కూడా జరుపుతున్నారని అన్నారు. రైల్వే జోన్ కు సంబంధించి కొన్ని విషయాలు తేలాల్సి ఉందని అన్నారు. నాబార్డ్ ద్వారా పోలవరం ప్రాజెక్ట్‌కోసం ఇప్పటికే నాలుగున్నరవేల కోట్ల రూపాయలలిచ్చాం.. అదనపు నిధులను ఈఏపి ద్వారా ఇవ్వాలని భావించామంటూ ప్రకటించారు. నాబార్డ్‌నుంచి అదనపు నిధులిస్తే....రుణ పరిమితి పెరుగుతుందని చెప్పామంటూ ఆర్థికమంత్రి ప్రసంగం కొనసాగుతుండగానే ఆంద్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment