
అలీఘడ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చున్న బాలికను కొట్టిన కేసులో స్థానిక బీజేపీ మహిళా విభాగం నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ మహిళా నేత సంగీత వర్షిణీపై గాంధీపార్క్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ టీ కొట్టు వద్ద ముస్లిం యువకుడితో కలసి కూర్చొని ఉందనే నెపంతో బాలికపై సంగీత వర్షిణి బహిరంగంగా చేయిచేసుకుంది.
‘హిందువు ఎవరో, ముస్లిం ఎవరో తెలసుకోకుండానే ప్రేమిస్తావా. నేను మర్యాదగా చెప్పినా వినవా’ అంటూ బాలికను ఆమె హెచ్చరించింది. చేయి కూడా చేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి కెమెరాతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది సంచలనంగా మారింది. సంగీత వర్షిణి చర్యపై మహిళా హక్కుల పరిరక్షణ సంఘం కార్యకర్త కల్పనా గుప్తా మండిపడ్డారు.