
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వటంపై స్పష్టత ఇవ్వాలంటే.. ముందుగా తన డిమాండ్లను అంగీకరించాల్సిందేనని పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పటేళ్లకు రిజర్వేషన్లపై తేల్చాల్సిందేనన్నారు. గుజరాత్ కాంగ్రెస్ ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్‌తో జరిగిన సమావేశంలో.. హార్దిక్ పటేల్ తన డిమాండ్లను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పటేళ్ల ప్రభావం
ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సామాజిక వర్గానికే ఎక్కువ టికెట్లు ఇవ్వాలని హార్దిక్ కోరినట్లు తెలిసింది. దీంతోపాటుగా కాంగ్రెస్ వ్యవస్థాగత నిర్మాణంలో పటేళ్ల ప్రాతినిధ్యం పెంచాలని.. పటేళ్ల రిజర్వేషన్ల అమలుపై న్యాయసమీక్ష లేకుండా రాజ్యాంగ భద్రత కల్పించాలనే ప్రతిపాదనలను కూడా హార్దిక్ గెహ్లాట్ ముందుంచినట్లు సమాచారం.
ప్రస్తుత రిజర్వేషన్లకు భంగం కలిగించకుండా పటేళ్లకు వేరుగా రిజర్వేషన్ ఇవ్వాలని హార్దిక్ డిమాండ్ చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి పేర్కొన్నారు. పటీదార్ ఆందోళన సందర్భంగా తమ వర్గం వారిపై దౌర్జన్యం చేసిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని హార్దిక్ పటేల్ కోరినట్లు తెలిసింది.
తదుపరి పర్యటనలో కలుస్తా
గెహ్లాట్, పటేల్ వర్గం నేతల సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని హార్దిక్ పటేల్ తెలిపారు. ‘నేను రాహుల్‌ను కలవలేదు. ఆయన్ను కలిసినప్పుడు దేశం మొత్తానికి ఈ విషయాన్ని వెల్లడిస్తాం.
రాహుల్ గాంధీ తదుపరి గుజరాత్ పర్యటనలో నేను కలుస్తాను’ అని హార్దిక్ ట్వీట్ చేశాడు. ఫైవ్‌స్టార్ హోటల్లోని సీసీటీవీ ఫుటేజీ ఎలా లీకయింది?’ అని ప్రశ్నించారు. ‘గూఢచర్యం చేయటంలో బీజేపీ వారు నిపుణులు’ అని పటేల్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment