
సాక్షి, విజయవాడ : పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలుసుకున్నారని.. ఆయన్ను సీఎం చేయడం మన బాధ్యత అని ప్రముఖ సినీ నటి, వైఎస్సార్‌సీపీ నేత జయసుధ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో సొంతగూటికి వచ్చినట్టుందన్నారు. మహానేత వైఎస్సారే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. ప్రజలంతా జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని, నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత ఎన్నికలు చాలా కీలకమని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అందుకు ఇదే సరైన సమయమని, వైఎస్ జగన్‌ను సీఎం చెయ్యడమే ప్రజలు తీసుకునే సరైన నిర్ణయమని అది ధర్మం కూడా అని పేర్కొన్నారు. 9ఏళ్లు ప్రజల మధ్యే గడిపిన జగన్.. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారని అన్నారు. కేసులు బనాయించి ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. వెనక్కి తగ్గని దృఢమైన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. ఐదేళ్లు చంద్రబాబు పాలనలో ప్రజలు ఇబ్బంది పడ్డారని, ఆయన చేసిన వాగ్దానాలు ఏవీ కూడా అమలు చేయలేకపోయారన్నారు. ఎన్నో ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సినిమా రంగానికి ఏమీ చెయ్యలేదనీ, ప్రస్తుతం సినీ రంగానికి చెందిన వారిలో 80శాతం మంది జగన్‌కు మద్దతిస్తున్నారన్నారు.
కేసీఆర్ ఫోర్స్ చేస్తే.. సినీరంగానికి చెందిన వాళ్లు జగన్‌కు మద్దతిస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సినీ రంగానికి చెందిన వ్యక్తులు మనస్ఫూర్తిగా ఎవరికైనా మద్దతిస్తారన్నారు. చెప్పింది ఖచ్చితంగా చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి వైఎస్ జగన్ అని, వైఎస్సార్‌లాగానే మెరుగైన పాలన అందిస్తారన్నారు. తెలంగాణపై పవన్ వ్యాఖ్యలు నిజం కాదన్నారు. రాజకీయం కోసం ఒక రాష్ట్రంపై నిందలు వెయ్యడం సరికాదన్నారు. తెలంగాణలోని ఆంధ్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాజకీయాల్లో పవన్, చంద్రబాబును ఫాలో అవుతున్నారని, చంద్రబాబు చెప్పిన మాటలనే పవన్ కళ్యాణ్ తిరిగి చెబుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment