
న్యూఢిల్లీ: ఆర్టికల్370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన బిల్లును వ్యతిరేకించిన ఎన్డీయే మిత్రపక్షం జేడీయూ ఎట్టకేలకు దిగొచ్చింది. ఈ విషయంలో ఇకపై బీజేపీతో రాజీధోరణిలో ముందుకుసాగుతామని ఆ పార్టీ తెలిపింది. ఆర్టికల్ 370 రద్దును, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును రాజ్యసభలోనూ, లోక్‌సభలోనూ జేడీయూ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరితో విభేదించినప్పటికీ.. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయకుండా సభల నుంచి వాకౌట్ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తిగా యూటర్న్ తీసుకున్న జేడీయూ.. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన విషయంలో ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటించింది. జేడీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి, బిహార్ సీఎం నితీశ్‌కుమార్ సన్నిహిత అనుచరుడు రాంచంద్రప్రసాద్ సింగ్ గురువారం విలేకరులతో ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్ విషయంలో భావజాల విభేదాలను మరింతగా ముందుకు తీసుకుపోవాలని తాము భావించడం లేదని ఆయన తెలిపారు.
పార్లమెంటు ఆమోదించడంతో జమ్మూకశ్మీర్ విభజన బిల్లు చట్టరూపం దాల్చిందని, అవి దేశ చట్టాలుగా మారినందున వాటిని గౌరవించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ విషయంలో తలెత్తిన భావజాల విభేదాలు బిహార్‌లో ఎన్డీయే కూటమిపై ప్రభావం చూపబోవని, రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలను ఎన్డీయే కూటమిలో భాగంగానే ఎదుర్కొంటామని ఆయన వెల్లడించారు. పార్టీ స్థాపకుడు జార్జ్ ఫెర్నాండెజ్, సోషలిస్ట్ సిద్ధాంతకర్తలు జయప్రకాశ్ నారాయణ, రాం మనోహర్ లోహియా సిద్ధాంతాలకు అనుగుణంగా కశ్మీర్ విషయంలో బీజేపీ వైఖరిని సిద్ధాంతపరంగా తాము వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందేనని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment