కొవ్వూరులో మంత్రి కేఎస్ జవహర్, టీడీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. మంత్రికి వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు పార్టీ జెండాలు పట్టుకుని ధర్నా, నిరసన ప్రదర్శన చేయడం, అదే రోజు మంత్రి వర్గీయులు పోటీగా ర్యాలీ నిర్వహించడంతో కొవ్వూరులో పార్టీ ప్రతిష్ట దెబ్బతిందని మంత్రిని మందలించినట్టు తెలిసింది.
పశ్చిమగోదావరి, ఏలూరు, సాక్షిప్రతినిధి / కొవ్వూరు : సోషల్ మీడియాలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి తన పీఆర్‌ఓతో ఇటీవల కొవ్వూరు పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టించడం, నిందితుడిగా పేర్కొన్న అన్నదేవరపేట మాజీ ఉప సర్పంచి కాకర్ల సత్యేంద్రప్రసాద్‌కు నోటీసు ఇవ్వడం, పార్టీ నేత అల్లూరి విక్రమాదిత్య కలుగ జేసుకుని ఈ సమస్యను సీఎం తనయుడు నారా లోకేష్ దృష్టి తీసుకెళ్లడం తెలిసిందే. లోకేష్ పీఏ స్వయంగా మంత్రి జవహర్‌కి ఫోన్ చేసి పార్టీ శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని రాజీ చేసుకోవాలని సూచించినట్టు తెలిసింది. దీనిలో భాగంగా మంత్రి ఇంటికి వెళ్లిన సత్యేంద్ర ప్రసాద్‌ను, అతని వెంట వెళ్లిన అన్నదేవరపేట ఉప సర్పంచి కూచికూడి గణపతి కృష్ణలపై చెయ్యి చేసుకున్నట్టు సమాచారం. దీంతో మంత్రి వైఖరిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజీ చేసుకోమని పంపితే చెయ్యి చేసుకుని సమస్యను జటిలం చేయడంతో పాటు పార్టీని రోడ్డెక్కించారని మందలించినట్టు సమాచారం. బీరు హెల్త్ డ్రింక్ అని మంత్రి జవహర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వేల మంది పోస్టింగ్‌లు పెట్టారు. వీళ్లెవ్వరిపై కేసు నమోదు చేయని మంత్రి తనకు వ్యతిరేకం వర్గంగా ముద్రపడిన అల్లూరి విక్రమాదిత్య అనుచరులపై కేసు నమోదు చేయించడం దుమారానికి కారణమైంది.
ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా
ఈ వివాదంతో కొవ్వూరు టీడీపీలో నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. మంత్రి ఇరువురు నాయకుల్ని కొట్టినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం «ధృవీకరించాయని సమాచారం. దీనిపై లోకేష్ వ్యక్తిగతంగా నిఘావర్గాల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు చెబుతున్నారు. మంత్రి కొట్టడం వాస్తవమేనని ధృవీకరించినట్టు సమాచారం.
దీంతో అధిష్టానం ఈ సమస్యకు తెరవేయకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని గుర్తించి నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఈ సమస్యను సర్దుబాటు చేయాలని సూచించినట్టు తెలిసింది. బుధవారం మళ్లీ మంత్రి జవహర్ వర్గీయులు పట్టణంలో ర్యాలీ చేసేందుకు సన్నద్ధమవడంతో పత్తిపాటి ఫోన్ చేసి చీవాట్లు పెట్టడంతో విరమించుకున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉంటే గురువారం అల్లూరి విక్రమాదిత్యతోపాటు ఇతర నాయకులు రాజధానిలో పత్తిపాటి పుల్లారావును కలిసి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు వివరించినట్టు తెలిసింది. జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, పార్టీ నేత పెండ్యాల అచ్చిబాబుతో పత్తిపాటి స్వయంగా ఫోన్‌లో మాట్లాడినట్టు చెబుతున్నారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చి పార్టీలో నెలకొన్న విభేదాలకు తెరవేయాలని పత్తిపాటి కోరినట్టు తెలిసింది. అవసరమైతే ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజీ చేద్దామని కోరినట్టు చెబుతున్నారు. పార్టీలో తీవ్ర దుమారం రేపిన ఈ విభేదాలు అధిష్టానం పెద్దల సూచనలతోనైనా సమసి పోతాయా ? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.
దిగివచ్చిన మంత్రి : పార్టీలో రేగిన వివాదంపై అధిష్టానం సీరియస్ కావడంతో మంత్రి జవహర్ పెట్టించిన కేసును వెనక్కి తీసుకునేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఇప్పటికే పట్టణ పోలీసులు ప్రత్యర్ధులకు ఫోన్ చేసి కేసు విరమించుకుంటామని మంత్రి చెప్పారని వర్తమానం పంపినట్లు తెలిసింది. మంత్రిపై పెట్టిన కేసును కూడా వెనక్కి తీసుకోవాలని పోలీసులు సూచించినట్టు సమాచారం.
మంత్రిపై దాడి చేసినట్టు ఫిర్యాదు?
మంత్రి ఇంటికి పిలిపించుకుని టీడీపీ నాయకులు కాకర్ల సత్యేంద్ర ప్రసాద్, కూచికూడి గణపతికృష్ణలను కొట్టడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చేసి డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చినరోజే పోటీగా మంత్రి వర్గీయులు డీఎస్పీకి మరో ఫిర్యాదు ఇచ్చారు. దీంట్లో డిసెంబర్ 31న అన్నదేవరపేటలో సమావేశానికి వెళ్లిన మంత్రి జవహర్‌పై సత్యేంద్ర ప్రసాద్, గణపతి కృష్ణలు దాడి చేసి కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదు చేశారు. వాస్తవంగా ఈ సమావేశం జరిగే రోజున ఈ ఇరువురు నాయకులు కర్నూలులోనే ఉన్నారని చెబుతున్నారు. పోలీసులు 30వ తేదీన 41 (సీ) నోటీసుపై సంతకం చేయించుకోవడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యమని ఆ నాయకులు చెబుతున్నారు.
వాస్తవంగా 31వ తేదీన మంత్రిపై దాడి చేసి, కులం పేరుతో దూషించి ఉంటే జనవరి 2వ తేదీ వరకు మంత్రి వర్గీయులు డీఎస్పీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదనేనది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వందల మంది హాజరైన సమావేశంలో మంత్రిపై దాడి చేసినట్టు, కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదు చేయడం నమ్మశక్యంగా లేదు. ఆ సమావేశంలో మంత్రి ఎస్కార్ట్‌గా వచ్చిన పోలీసులున్నారు. తక్షణం ఆ వ్యక్తులను అక్కడే అరెస్టు చేయించవచ్చు. నిజంగా దాడి చేసినా, కులం పేరుతో దూషించినా మంత్రి హోదా ఉన్న వ్యక్తి రెండు రోజుల వరకు ఎందుకు ఫిర్యాదు చేయాలేదన్నది అంతు చిక్కని ప్రశ్నగా చెప్పవచ్చు. సొంత పార్టీ నాయకులపై మంత్రి చెయ్యి చేసుకున్నాడన్న అంశం టీడీపీలో దుమారం రేపింది. మంత్రికి వ్యతిరేకంగా కార్యకర్తలు రోడ్డెక్కిన తరుణంలో ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నంలో ఈ ఫిర్యాదు చేయించి ఉంటారని అర్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment