మాట్లాడుతున్న ఎమ్మెల్యే వై. ఐజయ్య
పగిడ్యాల:రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీఎం చంద్రబాబుకు నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య సూచించారు. ఆ పార్టీ మాజీ మండల కన్వీ నర్ రమాదేవి స్వగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసి అధికారంలోకి రాగానే ప్యాకేజీకి మొగ్గు చూపి ప్రజలను మోసం చేశారన్నారు. నాలుగేళ్లుగా హోదా సాధనం కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఆమరణ æనిరాహారదీక్షలు, ధర్నాలు, యువభేరిలు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాక ఎంపీలతో రాజీనామా చేయించేందుకు సిద్ధమయ్యారన్నారు. తమ పోరాటానికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ఆద్మీ, ఆర్‌జేడీ, సమాజ్‌వాది తదితర పార్టీలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు. తమకు లభిస్తున్న మద్దతును చూసి టీడీపీ యూటర్న్ తీసుకుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా ఉద్యమంలో తమతో కలిసి రావాలని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రతి పనిలో అవినీతి
పోలవరం, రాజధాని నిర్మాణం ఇలా ప్రతి పనిలో టీడీపీ అవినీతికి పాల్పడుతోందని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ఆ డబ్బుతోనే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కొనుగోలు చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు ఏదో ఒక రోజు విచారణను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. దమ్ముంటే తన నాలుగేళ్ల పాలనలో అవినీతికి పాల్పడలేదని విచారణకు అంగీకరించి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, మినుము, శనగ, వరి, కంది, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మిడుతూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, నాయకులు చంద్రమౌళి, చిట్టిరెడ్డి, మిడుతూరు ఎంపీటీసీ మరియమ్మ, శివపురం సర్పంచ్ సంతోషమ్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment